రమణ్‌సింగ్ ఓడిపోవడం ఖాయం: అల్కా
జగదల్పూర్ : అసెంబ్లీ ఎన్నికల్లో రమణ్‌సింగ్ ఓడిపోవడం ఖాయమని... ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న అల్కా మొదలియార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ పోటీ చేస్తున్న రాజ్‌నంద్‌గావ్‌లో ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరపున అల్కా మొదలియార్ బరిలోకి దిగారు.
ఆమె భర్త ఉదయ్ మొదలియార్.... మే 25న జరిగిన మావోయిస్టుల దాడిలో కన్నుమూశారు. రాజ్‌నంద్‌గావ్‌లో ఆమె సోమవారం ఉదయం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అన్నీ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం సహజమేనని, కాని తాను గట్టి నమ్మకంతో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నాని అల్కా అన్నారు. రమణ్ సింగ్ తిరిగి అధికారంలోకి రావటానికి తన పలుకుబడి, ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
మరోవైపు తమ నాయకుడ్ని తామే ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఛత్తీస్‌గఢ్ యువ ఓటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది యువ ఓటర్లు తొలి దశ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యువత రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకుంటే దేశానికి మంచిదని తెలిపారు.