గోదావరికి వరద పోటు
కొవ్వూరు : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. మూడు రోజులుగా నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి 4,39,075 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. సాయంత్రానికి స్వల్పంగా ఇన్ఫ్లో తగ్గడంతో ఆనకట్టకి ఉన్న 175 గేట్లను మీటరు ఎత్తులేపి 4,31,992 క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో మూడు రోజుల నుంచి డెల్టా కాలువలకు నీటి విడుదలను కాస్తతగ్గించారు. గురువారం 7,900 క్యూసెక్కులు విడిచిపెట్టగా శుక్రవారం సాయంత్రం నుంచి 8,400 క్యూసెక్కులు వదులుతున్నారు. దీనిలో జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువకి 5 వేల క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు.