భూ బిల్లుపై కదం తొక్కిన విపక్షం
సోనియా నేతృత్వంలో తరలివచ్చిన 14 విపక్ష పార్టీల నేతలు
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన మార్గం
రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పణ
న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షం అంతా ఏకమైంది. కలసి కదం తొక్కింది. బిల్లులోని రైతు వ్యతిరేక సవరణలను అడ్డుకుని తీరుతామని గళమెత్తింది. ఎలాగైనా బిల్లును ఆమోదింపచేసుకోవాలనుకుంటున్న మోదీ సర్కారు నియంతృత్వ పోకడలకు పోతోందంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. రైతు ప్రయోజనాలను కాపాడేందుకు ఇందులో జోక్యం చేసుకోవాలని కోరింది. బిల్లుపై రాజ్యసభలో ముందుకెళ్లకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షమంతా కలసికట్టుగా కదలడం ఇదే ప్రథమం.
14 పార్టీలు.. వందకుపైగా ఎంపీలు
కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ, వామపక్షాలు, జేడీయూ, ఎన్సీపీ, ఐఎన్ఎల్డీ, ఆప్ సహ 14 విపక్షాల జాతీయ స్థాయి నేతలు ఒక్కటై కదిలిన అరుదైన దృశ్యం దేశ రాజధానిలో మంగళవారం ఆవిష్కృతమైంది. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ నేతృత్వంలో వివిధ పార్టీలకు చెందిన వందమందికి పైగా ఎంపీలు పార్లమెంట్ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, నిషేధాజ్ఞలు ఉన్నాయంటూ పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకోవడానికి విఫలయత్నం చేశారు. కిలోమీటరుపైగా దూరాన్ని విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉత్సాహంగా నడిచారు. ర్యాలీకి జేడీయూ చీఫ్ శరద్‌యాదవ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. అనంతరం వారిలో నుంచి మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ సహా 26 మంది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి బిల్లుపైఅభ్యంతరాలను వివరించి, వినతిపత్రం సమర్పించారు.
మోదీ సర్కారు ప్రతిపాదించిన సవరణల వల్ల ప్రజల్లో అంతరాలు పెరిగే, సామాజిక అసమతౌల్యత నెలకొనే ప్రమాదముందని హెచ్చరించారు. ‘భూ సేకరణ చట్టం, 2013లో మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న సవరణలకు వ్యతిరేకంగా మేమంతా ఏకమయ్యాం. సమాజంలో అంతరాలను, ప్రజల్లో విద్వేషాలను పెంచే మోదీ సర్కారు ప్రయత్నాలను అడ్డుకునేందుకు లౌకిక, అభ్యుదయ, ప్రజాస్వామ్య శక్తులన్నీ సిద్ధంగా ఉన్నాయి. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ముందుకు తీసుకువెళ్లకుండా చూడాలని రాష్ట్రపతిని అభ్యర్థించాం’ అని ప్రణబ్‌తో భేటీ అనంతరం సోనియా వెల్లడించారు. కేవలం రైతులకే కాదు, భారతదేశానికే ప్రమాదకరమైన ఈ బిల్లును ప్రభుత్వం వెనక్కుతీసుకునేంతవరకు పోరాటం కొనసాగుతుందని శరద్‌యాదవ్ తేల్చిచెప్పారు.
రాష్ట్రపతిని కలిసినవారిలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్(కాంగ్రెస్), లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే(కాంగ్రెస్), రాంగోపాల్ యాదవ్(ఎస్పీ), సీతారాం ఏచూరి(సీపీఎం), డీ రాజా(సీపీఐ), డెరెక్ ఒబ్రీన్(టీఎంసీ), కనిమొళి(డీఎంకే), ప్రఫుల్ పటేల్(ఎన్సీపీ), దుష్యంత్ చౌతాలా(ఐఎన్ఎల్డీ), ధర్మవీర్ గాంధీ(ఆప్), జయప్రకాశ్ యాదవ్(ఆర్జేడీ).. తదితరులున్నారు. విపక్షాల ర్యాలీ సందర్భంగా పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. అవసరమైతే ఉపయోగించేందుకు వాటర్ క్యానన్లు, బారికేడ్లతో సిద్ధమై వచ్చారు. యూపీఏ హయాంలో అమల్లోకి వచ్చిన భూ సేకరణ చట్టాన్ని అప్పుడు సోనియా నేతృత్వంలోని జాతీయ సలహా మండలి రూపొందించింది.
ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల కోసం రైతుల భూములను సేకరించే ప్రక్రియలో కఠిన నిబంధనలను అందులో చేర్చారు. ప్రైవేటు ప్రాజెక్టులకు 80%, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లోని ప్రాజెక్టులకు 70% భూ యజమానుల ఆమోదం తప్పని సరనే నిబంధన, ప్రాజెక్టుల సామాజిక ప్రభావ అంచనా తదితర రైతు అనుకూల నిబంధనలను తొలగిస్తూ మోదీ ప్రభుత్వం పలు సవరణలతో తాజా బిల్లును తెచ్చింది. స్పష్టమైన మెజారిటీ ఉండటంతో లోక్‌సభలో దీన్ని ఆమోదింపజేసుకుంది కానీ అధికార పక్షం మైనారిటీలో ఉన్న రాజ్యసభలో అదంత సులభం కాని పరిస్థితి నెలకొంది.
పోలీసురాజ్యం చేయాలనుకుంటున్నారు
దేశాన్ని గుజరాత్ తరహాలో పోలీసు రాజ్యం చేయాలని మోదీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ దుయ్యబట్టింది. పోలీసుల ద్వారా ప్రతిపక్షాల ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించడం అందులో భాగమేనంది. రైతుల గొంతు నొక్కాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రీటా బహుగుణ జోషి విమర్శించారు.
మెమొరాండంలో ఏముంది!?
బిల్లును స్థాయీ సంఘం అధ్యయనానికి పంపించాలని విపక్షం కోరుకుంటోంది. కానీ ప్రభుత్వం స్టాండింగ్ కమిటీ, సెలెక్ట్ కమిటీ వ్యవస్థలను నాశనం చేయాలనుకుంటోంది.
‘రైతుల ఆమోద’ నిబంధన పూర్తిగా పక్కనబెట్టారు. దీంతో వారి భూముల్నిబలవంతంగా లాక్కోడానికి అవకాశం లభిస్తుంది.
సేకరించిన భూమి దుర్వినియోగం కాకుండా, అనవసరంగా, అదనంగా భూ సేకరణ జరపకుండా, తప్పనిసరి పరిస్థితుల్లోనే బహుళ పంటలు పండే భూముల సేకరణ జరిపేలా.. చూసే ముఖ్యమైన రక్షణ కవచమైన ‘సామాజిక ప్రభావ అంచనా(ఎస్ఐఏ) నిబంధనను తొలగిస్తూ సవరణలు చేశారు. ఇది పూర్తిగా రైతు ప్రయోజనాలను దెబ్బతీసే అంశం.
రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి.. కార్పొరేట్లకు అనుచిత లబ్ధి చేకూర్చేలా.. పారిశ్రామిక కారిడార్ల కోసం పెద్ద మొత్తంలో భూముల సేకరణకు తలుపులు బార్లాతీశారు.