అర్హులందరికీ ఫీజులు చెల్లించాలి
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అర్హతను పది వేల నుంచి అయిదు వేల ర్యాంకుకు తగ్గిస్తే ఇంకా ఆ పథకం ఎందుకని బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాసగౌడ్ ప్రశ్నించారు. రూ.లక్ష లోపు ఆదాయమున్న అర్హులైన ప్రతి విద్యార్థికి ర్యాంకులతో సంబంధం లేకుండా ఫీజులు మొత్తం మంజూరు చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల మాటలు వింటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. ఫీజులపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని, వెంటనే అఖిల పక్ష భేటీని నిర్వహించి విధాన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మలిదశ ఫీజుల పోరు తప్పదని హెచ్చరించారు.