గాలివాన బీభత్సం
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : మంచిర్యాలలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పడిన భారీ వర్షానికి పట్టణం అతలాకుతలమైంది. పట్టణంలో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి రహదారులకు అడ్డంగా పడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. స్తంభాలు విరిగాయి. రాత్రి వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. గౌతమీనగర్ బైపాస్‌రోడ్‌లోని శ్రీసాయి కారు మెకానిక్ షెడ్డు పక్కనే నూతనంగా నిర్మాణం అవుతున్న భవనం పరిధి గోడ కింద పడటంతో రేకులు పగిలి కింద పడంతో రేకుల షెడ్డు కింద ఉన్న కారు ముందు భాగం ధ్వంసమైంది.
గౌతమీనగర్‌లో అల్లి శ్రీనివాస్‌కు చెందిన ఇల్లు భారీ వర్షానికి పూర్తి ధ్వంసమైంది. పక్కనే నిర్మాణం అవుతున్న నాలుగు అంతస్థుల భవనానికి సంబంధించిన గోడలు కూలి ఇంటిపై కప్పు రేకులపై పడటంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఇంట్లోనే ఉన్న అల్లి సత్యవతి, ఆమె కుమార్తె వినీత, కుమారుడు నిశాంత్‌లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.