alternate
-
ఏఐఎఫ్‌ల పెట్టుబడుల రికవరీపై పిరమల్ ధీమా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలతో ప్రభావితమయ్యే ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల (ఏఐఎఫ్) నుంచి పెట్టుబడులను సజావుగా రాబట్టుకోగలమని పిరమల్ ఎంటర్ప్రైజెస్ (పీఈఎల్) ధీమా వ్యక్తం చేసింది. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి ఏఐఎఫ్ యూనిట్లలో పీఈఎల్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ. 3,817 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో రుణగ్రస్త కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయని మొత్తం .. రూ. 653 కోట్లుగా ఉంది. మిగతా రూ. 3,164 కోట్లలో రూ. 1,737 కోట్ల నిధులను గత 12 నెలల వ్యవధిలో మూడు రుణగ్రస్త కంపెనీల్లో ఏఐఎఫ్‌లు ఇన్వెస్ట్ చేశాయి. అయితే, నిబంధనలకు అనుగుణంగా మొత్తం రూ. 3,164 కోట్లకు పీఈఎల్ ప్రొవిజనింగ్ చేయొచ్చని, ఫలితంగా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల మేర నష్టాలను చూపించే అవకాశం ఉందని బ్రోకరేజి సంస్థ ఎమ్కే ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ దగ్గర రుణాలు తీసుకున్న సంస్థల్లో ఏఐఎఫ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేయరాదని, ఒకవేళ చేసి ఉంటే నెలరోజుల్లోగా వాటిని ఉపసంహరించుకోవాలని లేదా ఆ మొత్తానికి ప్రొవిజనింగ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. -
గూగుల్ హ్యాక్ ఫర్ చేంజ్ విజేత ‘టీమ్ అగ్రి హీరోస్’
సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి ఆండ్రాయిడ్ ఫోన్ ఆధారిత యాప్‌ను రూపొందించిన ‘టీమ్ అగ్రిహీరోస్’.. గూగుల్ ‘హ్యాక్ 4 చేంజ్’విజేతగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన ఈ బృందం రూ.ఐదు లక్షల నగదు బహుమతి సాధించింది. ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’, టీ–హబ్ సంయుక్తంగా రెండు రోజుల పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో నిర్వహించిన ‘చర్చా–23’కార్యక్రమంలో భాగంగా ఈ హ్యాకథాన్ జరిగింది. దేశం మొత్తమ్మీద చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం కాగా.. మొత్తం 270 బృందాలు ఇందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లోంచి గూగుల్, టీ–హబ్‌లు మొత్తం నలభై బృందాలను తుది దశ పోటీకి ఎంపిక చేశాయి. ఒక రోజు మొత్తం ఏకబిగిన సాగిన హ్యాకథాన్‌లో ‘టీమ్ అగ్రిహీరోస్’తొలిస్థానంలో నిలిచింది. ఈ బృందం తయారు చేసిన అప్లికేషన్ డీప్.. టెక్నాలజీని ఉపయోగించి పరిశోధన సంస్థలకు చిన్న, సన్నకారు రైతులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ఫలాలను రైతు సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంది. ‘టీమ్ లైట్హెడ్స్’కి మూడో బహుమతి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి సామ్యుల్ ప్రవీణ్ కుమార్, గూగుల్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) గురు భట్, ప్రిన్సిపల్ ఇంజనీర్ అరుణ్ ప్రసాద్ అరుణాచలం, టీ–హబ్ సీఓఓ వింగ్ కమాండర్ ఆంటోని అనీశ్, ద నడ్జ్ ఇన్స్టిట్యూట్కు చెందిన రవి త్రివేదీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ హ్యాకథాన్‌లో ఘజియాబాద్‌కు చెందిన ‘టీమ్ ఇన్ఫెర్నోస్’రెండోస్థానంలో నిలిచి రూ.2.5 లక్షల నగదు బహుమతి అందుకుంది. వ్యవసాయంలో ఆల్టర్నేట్ రియాలటీ టెక్నాలజీని ఉపయోగించేందుకు వీలుగా ఈ బృందం ఒక అప్లికేషన్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కే చెందిన ‘టీమ్ లైట్హెడ్స్’ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పంటల ఉత్పాదకత పెంచేందుకు గరిష్ట స్థాయి దిగుబడులు సాధించేందుకు రూపొందించిన అప్లికేషన్‌కు మూడో బహుమతి( రూ.లక్ష నగదు) దక్కింది. -
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు ఎందుకంత డిమాండ్?
భారత్‌లో కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. కొంత మంది రోగులకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా వారికి కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. కానీ హఠాత్తుగా దేశంలో కేసులో పెరగడంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక ఆక్సిజన్ సిలిండర్లకు ప్రత్యామ్నాయ మార్గాలపై నిపుణులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సిలిండర్లకు ప్రత్నామ్నాయంగా దొరికిందే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కంప్యూటర్ మానిటర్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి, ప్రాణవాయువు తగినంత అందని వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఐసోలేషన్‌లో ఉన్నవారు, ఇంటివద్ద ఒంటరిగా చికిత్స పొందుతున్న రోగులకు దీన్ని సిఫారసు చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరా సదుపాయం లేని ఆసుపత్రుల్లో ప్రస్తుతం వీటిని వాడుతున్నారు. ఎలా పనిచేస్తాయి? ఇవి గాలి నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వేరు చేసి అందిస్తుంటుంది. సాధారణంగా వాతావరణంలోని గాలిలో 78 శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. ఇతర వాయువులు ఒక శాతం వరకు ఉంటాయి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఈ గాలిని వడపోస్తాయి. ఒక జల్లెడ ద్వారా డివైజ్ గాలిని ఫిల్టర్ చేస్తుంది. ఈ ప్రక్రియలో విడుదలైన నైట్రోజన్‌ను తిరిగి గాలిలోకి విడుదల చేస్తుంది. మిగిలిన ఆక్సిజన్‌ను రోగులకు అందిస్తుంది. ఈ ఆక్సిజన్ 90-95 శాతం స్వచ్ఛమైనదని నిపుణులు చెబుతున్నారు. వీటిని 24 గంటలు ఉపయోగించవచ్చు. ఇవి నిరంతరాయంగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలవు. సాధారణ, మధ్యస్థ లక్షణాలతో ఉన్న కరోనా రోగులకు మాత్రమే కాన్సన్ట్రేటర్లు విడుదల చేసే ఆక్సిజన్, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ మాదిరిగా (ఎల్ఎంఓ) 99 శాతం స్వచ్ఛమైనది కాదు. అందువల్ల ఐసీయూ రోగులకు డాక్టర్లు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సిఫారసు చేయరు. సాధారణ, మధ్యస్థ లక్షణాలతో ఉన్న కరోనా రోగులకి మాత్రమే 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ సంతృప్త స్థాయి ఉన్న వారికి ఇవి సరిపోతాయి. ఒక డివైజ్ ద్వారా ఒకేసారి ఇద్దరు రోగులకు ప్రాణవాయువును అందించవచ్చు. కానీ వీటి వల్ల క్రాస్ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్లు.. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు తేడాలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సిలిండర్లకు ప్రత్యామ్నాయాలుగా చెప్పుకోవచ్చు. సాధారణ అవసరాలకు మాత్రమే వీటిని వినియోగించవచ్చు. క్లిష్టమైన సమస్యలు ఉన్న రోగులకు కాన్సన్ట్రేటర్లను వాడకూడదు. ఎందుకంటే తీవ్ర సమస్యతో బాధపడుతున్నరోగులకు నిమిషానికి 40-50 లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుంది. కానీ కాన్సన్ట్రేటర్లు నిమిషానికి 5-10 లీటర్ల ఆక్సిజన్‌ను మాత్రమే సరఫరా చేయగలవు. ఎల్‌ఎంఓలకు.. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు తేడాలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సులువుగా వేరే ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు. ఎల్‌ఎంఓల విషయంలో ఇలాంటి సదుపాయం ఉండదు. దీన్ని క్రయోజెనిక్ ట్యాంకర్లలో నిల్వ చేసి, రవాణా చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్లను నిరంతరం రీఫిల్లింగ్ చేసి వాడుకోవాల్సి ఉంటుంది. కానీ కాన్సన్ట్రేటర్ల విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఇవి కేవలం గాలి నుంచి ఆక్సిజన్‌ను వేరుచేసి అందిస్తాయి కనుక నిరంతరం వాడుకోవచ్చు. ధర ఎంత? ఆక్సిజన్ సిలిండర్ల కంటే కాన్సన్ట్రేటర్ల ధర ఎక్కువగా ఉంటుంది. వీటికి రూ.40,000- రూ.90,000 వరకు ఖర్చు అవుతుంది. సిలిండర్ల ధర మాత్రం రూ.8,000- రూ.20,000 వరకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం హాస్పిటళ్లలో ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడటంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. సాధారణంగా ఏటా 40,000 వరకు యంత్రాలను సరఫరా చేస్తుండగా, ప్రస్తుతం ఇది నెలకు 30,000-40,000 వరకు పెరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ( చదవండి: క్షణమొక యుగంలా గడిచింది, లేదంటే 100 ప్రాణాలు.. ) -
వయోజన ‘మిథ్య’!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వయోజనులకు విద్యా బుద్ధులు నేర్పేందుకు కేంద్ర ప్రభుత్వం 2010 నుంచి కొనసాగించిన సాక్షర భారత్ కార్యక్రమం ఇప్పుడు నిలిచిపోయి క్షేత్రస్థాయిలో అనుకున్న లక్ష్యం సాధ్యం కావట్లేదు. ఈ ప్రక్రియ ఆగిపోయి ఏడాది కావస్తున్నా..ఇందులో పనిచేసిన మండల కోఆర్డినేటర్లు, గ్రామానికి ఇద్దరి చొప్పున విలేజ్ కోఆర్డినేటర్లకు వేతనాల చెల్లింపు ప్రక్రియను మాత్రం పూర్తి చేయలేదు. గౌరవ వేతనాలు అందక ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఏళ్లుగా ఇందులోనే కొనసాగిన వారి పరిస్థితి గందరగోళంగా మారింది. దీనిని కొనసాగిస్తారేమోననే ఆశను వదలుకోలేక, ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తారా..? లేదా..? అనే విషయాలపై ఎంతకీ స్పష్టత రాక అవస్థ పడుతున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే బృహత్తర లక్ష్యంతో ప్రవేశపెట్టిన సాక్షర భారత్ కొండెక్కింది. అక్షరాస్యతా శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2010లో సాక్షరభారత్‌ను ప్రవేశపెట్టి..నిరక్షరాస్యులైన వయోజనులకు విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు. గ్రామాల్లో కూలీలు, సామాన్యులు పగటి వేళల్లో పనులకు వెళ్తుంటారని, సాయంత్రం సమయంలో వీరికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలనేది దీని ప్రధాన ఉద్దేశం. పథకం లక్ష్యం 2017 సెప్టెంబర్ వరకుగా నిర్ణయించి, 2018 మార్చి వరకు పొడిగించారు. అయితే లక్ష్యం ఘనమైనా ఆచరణలో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. నూరుశాతం అక్షరాస్యతను సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఈ పథకం ద్వారా తీరలేదు. అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వయోజన విద్య శాఖ ద్వారా సాక్షరభారత్ పథకంలో వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగట్లేదు. కొన్నేళ్లుగా జిల్లాలో అమలవుతున్న సాక్షరభారత్ కార్యక్రమాలు సందిగ్ధంలో పడ్డాయి. అయితే పర్యవేక్షణ లోపం..ఇతర కారణాలతో ఈ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో కూడా వయోజన విద్య కేంద్రాలు అంతంతమాత్రంగానే నడిచాయని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే అక్షరాస్యతకు చేరువవుతున్న దశలో ప్రభుత్వం సాక్షరభారత్‌ను నిలిపివేసే ఆలోచనలో ఉండటం పథకం లక్ష్యాలను దెబ్బతీసేలా ఉంది. అందరికీ విద్యను అందించాలంటే సాక్షరభారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని పలువురు కోరుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం కొనసాగింపుపై కేంద్రాన్ని కోరాలని అంటున్నారు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో సాక్షరభారత్ కేంద్రం సాక్షరభారత్ సిబ్బంది భవితవ్యం ప్రశ్నార్థకం.. సాక్షరభారత్ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా..? లేదా..? అనే విషయం తేలకపోవడంతో ఇందులో పనిచేస్తున్న ఎంసీవోలు, వీసీవోల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 36 మండలాల్లోని 631 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పథకంలో మండలానికి ఒక కో ఆర్డినేటర్ (ఎంసీఓ), గ్రామానికి ఇద్దరు విలేజ్ కో ఆర్డినేటర్లు (వీసీఓ) ఉంటారు. మొత్తం 631 గ్రామ పంచాయతీల్లో 1262 మంది విలేజ్ కోఆర్డినేటర్లు ఉన్నారు. మండలానికి ఒక కో ఆర్డినేటర్ చొప్పున 36 మంది మండల కో ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. ఒకవైపు పథకం పొడిగిస్తారో లేదో అనే అనుమానాలతోపాటు గత కొన్ని నెలలుగా సిబ్బందికి వేతనాలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విలేజ్ కో ఆర్డినేటర్లకు రూ.2వేల గౌరవ వేతనం, మండల కో ఆర్డినేటర్లకు రూ.6వేలు గౌరవ వేతనం ఇస్తున్నారు. అయితే వీసీవోలకు 7 నెలలు, ఎంసీవోలకు 6నెలల గౌరవ వేతనం ఇంకా అందాల్సి ఉంది. ప్రతి ఆరునెలలకోసారి వీరికి జీతాలు రావాలి. అదే సమయానికి పథకం పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వీరికి వేతనాలు అందలేదు. అయితే ప్రభుత్వం వీరిని అనేక పనులకు వినియోగించుకుంది. పథకం పొడిగించేది..? లేనిది కేంద్రం స్పష్టం చేసి తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని వారు కోరుతున్నారు. పొడిగింపుపై స్పష్టత లేదు.. సాక్షర భారత్ కార్యక్రమం 2018 మార్చితో ముగిసింది. ప్రభుత్వం నుంచి మాకు దీనిని పొడిగిస్తున్నట్లు కానీ..లేదా ఇతర ఏ సమాచారమూ రాలేదు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం మేం విధులు నిర్వహించనున్నాం. – ధనరాజ్, డిప్యూటీ డైరెక్టర్, సాక్షర భారత్, ఖమ్మం -
ప్రత్యామ్నాయమే మార్గం
చినుకు పడితే జొన్న, సజ్జ, అలసంద, పెసర, కొర్ర సాగుకు అనుకూలం ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డి.సంపత్‌కుమార్ సూచన అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత ఖరీఫ్‌లో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి లాంటి ప్రధాన పంటల సాగుకు గడువు ముగియడంతో ఇక ప్రత్యామ్నాయ పంటలే మార్గమని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. వర్షం వస్తే పొలాలు బీళ్లుగా ఉంచకుండా జొన్న, కొర్ర, సజ్జ, అలసంద, పెసర లాంటి పంటల సాగు చేపట్టాలని సూచిస్తున్నారు. జొన్న : ఎస్వీ–1, పాలెం–2, సీఎస్వీ–10, సీఎస్వీ–11, సీఎస్వీ–15, ఎన్టీజే–1, 2, 3, ఎన్–13, 14, ఎస్వీ–56 సూటి రకాలు అనువైనవి. అలాగే హైబ్రీడ్ రకాలైన సీఎస్హెచ్–10, సీఎస్హెచ్–11, సీయస్హెచ్–16, సీఎస్హెచ్–18, సీఎస్హెచ్–21 అనువుగా ఉంటాయి. ఎకరాకు 3 నుంచి 4 కిలోలు. విత్తే ముందు 3 గ్రాములు థైరామ్ లేదా కాప్టాన్‌తో విత్తనశుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు (సెం.మీ) అంటే ఒకటిన్నర అడుగు, మొక్కల మధ్య 12–15 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి. సజ్జ : సజ్జలో అధిక దిగుబడి ఇచ్చే సూటి లేదా కాంపోజిట్ రకాలైన ఐసీటీపీ–8203, ఐసీఎంవీ–221, రాజ్–171 అనువుగా ఉంటాయి. హైబ్రీడ్ రకాలైన హెచ్హెచ్బీ–67, ఐసీఎంహెచ్–356, ఆర్‌హెచ్‌బీ–121, జీహెచ్‌బీ–538, పీహెచ్బీ–3 అనువుగా ఉంటాయి. ఎకరాకు 1.6 కిలోల విత్తనం అవసరం. విత్తే ముందు 2 శాతం (20 గ్రాములు ఒక లీటర్ నీటికి) ఉప్పు ద్రావణంలో ముంచాలి. ఇలా చేయడం వల్ల ‘ఎర్గాట్’ అనే శిలీంద్ర అవశేషాలను వేరుచేయవచ్చు. అరిన తరువాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి. సాళ్ల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 12–15 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. కొర్ర : కోతకు 80 నుంచి 85 రోజుల్లో వచ్చే కొర్ర రకాలైన కృష్ణదేవరాయ, నరసింహరాయ, శ్రీలక్ష్మి, ఎస్ఐఏ–3085 రకాలు అనువుగా ఉంటాయి. అలాగే 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వచ్చే ప్రసాద్, సూర్యనంది (ఎస్ఐఏ–3088). సూర్యనంది రకం తక్కువ సమయంలో కోతకు రావడమే కాకుండా అధిక దిగుబడులు (ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు) సామర్థ్యం కలిగిన రకం. సాళ్లలో విత్తితే ఎకరాకు 2 కిలోలు, వెదజల్లే పద్ధతికి అయితే 4 కిలోలు అవసరం. కిలో విత్తనానికి 2 గ్రాములు కార్బండిజమ్‌తో విత్తనశుద్ధి చేయాలి. సాళ్ల మధ్య 25 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ ఉండేలా విత్తుకోవాలి. అలసంద : తక్కువ పంటకాలం కలిగిన పశుగ్రాసం, పచ్చికాయ, గింజలకు ఉపయోగపడే వర్షాధారపు పప్పుజాతి పంట. కో–702, జీసీ–3, కో–4 రకాలు అనువైనవి. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరం. వరుసల మధ్య 30 నుంచి 45 సెం.మీ ఉండేలా విత్తుకోవాలి. పెసర : పెసర పంట వేసే రైతులు పల్లాకుతెగులు (ఎల్లోమొజాయిక్ వైరస్) సోకకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. విత్తేముందు కాన్ఫిడార్తో విత్తనశుద్ధి చేయడం వల్ల రసంపీల్చు పురుగులు ముఖ్యంగా తెల్లదోమను అరికట్టవచ్చు. పొలం చుట్టూ జొన్న, సజ్జ పంటలను నాలుగైదు వరుసలు మేరసాళ్లుగానూ లేదా అంతర పంటలుగా వేసుకున్నా ఈ తెగులును సమర్థవంతంగా నివారించవచ్చు. మొలకెత్తిన 10 రోజుల తర్వాత రెండు మూడు సార్లు వేపనూనే పిచికారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.