భారత్‌లో కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. కొంత మంది రోగులకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా వారికి కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. కానీ హఠాత్తుగా దేశంలో కేసులో పెరగడంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది.
దీంతో వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక ఆక్సిజన్ సిలిండర్లకు ప్రత్యామ్నాయ మార్గాలపై నిపుణులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సిలిండర్లకు ప్రత్నామ్నాయంగా దొరికిందే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కంప్యూటర్ మానిటర్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి, ప్రాణవాయువు తగినంత అందని వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఐసోలేషన్‌లో ఉన్నవారు, ఇంటివద్ద ఒంటరిగా చికిత్స పొందుతున్న రోగులకు దీన్ని సిఫారసు చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరా సదుపాయం లేని ఆసుపత్రుల్లో ప్రస్తుతం వీటిని వాడుతున్నారు.
ఎలా పనిచేస్తాయి?
ఇవి గాలి నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వేరు చేసి అందిస్తుంటుంది. సాధారణంగా వాతావరణంలోని గాలిలో 78 శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. ఇతర వాయువులు ఒక శాతం వరకు ఉంటాయి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఈ గాలిని వడపోస్తాయి. ఒక జల్లెడ ద్వారా డివైజ్ గాలిని ఫిల్టర్ చేస్తుంది. ఈ ప్రక్రియలో విడుదలైన నైట్రోజన్‌ను తిరిగి గాలిలోకి విడుదల చేస్తుంది. మిగిలిన ఆక్సిజన్‌ను రోగులకు అందిస్తుంది. ఈ ఆక్సిజన్ 90-95 శాతం స్వచ్ఛమైనదని నిపుణులు చెబుతున్నారు. వీటిని 24 గంటలు ఉపయోగించవచ్చు. ఇవి నిరంతరాయంగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలవు.
సాధారణ, మధ్యస్థ లక్షణాలతో ఉన్న కరోనా రోగులకు మాత్రమే
కాన్సన్ట్రేటర్లు విడుదల చేసే ఆక్సిజన్, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ మాదిరిగా (ఎల్ఎంఓ) 99 శాతం స్వచ్ఛమైనది కాదు. అందువల్ల ఐసీయూ రోగులకు డాక్టర్లు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సిఫారసు చేయరు. సాధారణ, మధ్యస్థ లక్షణాలతో ఉన్న కరోనా రోగులకి మాత్రమే 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ సంతృప్త స్థాయి ఉన్న వారికి ఇవి సరిపోతాయి. ఒక డివైజ్ ద్వారా ఒకేసారి ఇద్దరు రోగులకు ప్రాణవాయువును అందించవచ్చు. కానీ వీటి వల్ల క్రాస్ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది.
ఆక్సిజన్ సిలిండర్లు.. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు తేడాలు
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సిలిండర్లకు ప్రత్యామ్నాయాలుగా చెప్పుకోవచ్చు. సాధారణ అవసరాలకు మాత్రమే వీటిని వినియోగించవచ్చు. క్లిష్టమైన సమస్యలు ఉన్న రోగులకు కాన్సన్ట్రేటర్లను వాడకూడదు. ఎందుకంటే తీవ్ర సమస్యతో బాధపడుతున్నరోగులకు నిమిషానికి 40-50 లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుంది. కానీ కాన్సన్ట్రేటర్లు నిమిషానికి 5-10 లీటర్ల ఆక్సిజన్‌ను మాత్రమే సరఫరా చేయగలవు.
ఎల్‌ఎంఓలకు.. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు తేడాలు
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సులువుగా వేరే ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు. ఎల్‌ఎంఓల విషయంలో ఇలాంటి సదుపాయం ఉండదు. దీన్ని క్రయోజెనిక్ ట్యాంకర్లలో నిల్వ చేసి, రవాణా చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్లను నిరంతరం రీఫిల్లింగ్ చేసి వాడుకోవాల్సి ఉంటుంది. కానీ కాన్సన్ట్రేటర్ల విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఇవి కేవలం గాలి నుంచి ఆక్సిజన్‌ను వేరుచేసి అందిస్తాయి కనుక నిరంతరం వాడుకోవచ్చు.
ధర ఎంత?
ఆక్సిజన్ సిలిండర్ల కంటే కాన్సన్ట్రేటర్ల ధర ఎక్కువగా ఉంటుంది. వీటికి రూ.40,000- రూ.90,000 వరకు ఖర్చు అవుతుంది. సిలిండర్ల ధర మాత్రం రూ.8,000- రూ.20,000 వరకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం హాస్పిటళ్లలో ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడటంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. సాధారణంగా ఏటా 40,000 వరకు యంత్రాలను సరఫరా చేస్తుండగా, ప్రస్తుతం ఇది నెలకు 30,000-40,000 వరకు పెరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
( చదవండి: క్షణమొక యుగంలా గడిచింది, లేదంటే 100 ప్రాణాలు.. )
Comments
Please login to add a commentAdd a comment