‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్ర నిర్మాతలు ఆదర్శనీయమైన ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సినిమా విడుదల ద్వారా లభించే ఆదాయంలో కొంత మొత్తాన్ని కరోనా బాధితుల వైద్య సేవలకు వినియోగించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘గివ్ ఇండియా’ సంస్థతో అసోసియేట్ అయి, కోవిడ్ బాధితులకు అవసరమయ్యే ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్స్, వెంటిలేటర్స్ వంటి పరికరాల కొనుగోలుకు తాము సహాయం చేస్తున్నట్లు ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ నిర్మాతలు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాను సల్మాన్ ఖాన్, ఆయన సోదరుడు సోహైల్ ఖాన్, బావ అతుల్ అగ్నిహోత్రి, నిఖిల్ నిర్మించారు. ఈ సినిమా విడుదల హక్కులను జీ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది. ‘‘ఈ నెల 13న మల్టీ ప్లాట్‌ఫామ్స్ (ఓటీటీ, డీటీహెచ్ ఆపరేటర్స్, థియేటర్స్...)లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు ఆదాయం వస్తే అందులో కొంత కోవిడ్ బాధితుల సహాయార్థం వినియోగిస్తాం. కోవిడ్ బాధితుల కోసం మరింతమంది సహాయం చేయాల్సిన అవసరం ఉంది’’ అని జీ స్టూడియోస్ ప్రతినిధులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment