Sohail Khan
-
‘ఎన్కేఆర్ 21’లో విలన్‌గా...
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్కేఆర్ 21’ (వర్కింగ్ టైటిల్). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. విజయశాంతి, శ్రీకాంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు. శుక్రవారం (డిసెంబరు 20) సోహైల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్కేఆర్ 21’లో ఆయన చేస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘సోహైల్ ఖాన్ చేస్తున్న విలన్ పాత్ర, హీరో, ఈ పాత్ర మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కల్యాణ్ రామ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: రామ్ ప్రసాద్. -
సల్మాన్ ఖాన్ సోదరుడితో విడాకులు.. ఇప్పుడేమో మాజీ భాయ్‌ఫ్రెండ్‌తో!
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, సల్మాన్ ఖాన్ తమ్ముడి భార్య సీమా సజ్దేహ్ ఓ షోలో మెరిసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో కనిపించింది. ఈ షోలో పాల్గొన్న సీమా సజ్దేహ్ తన వివాహా జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సోహైల్ ఖాన్‌తో పెళ్లికి ముందే ప్రముఖ రచయిత విక్రమ్ అహుజాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్‌ను పెళ్లాడింది. వీరిద్దరు 2022లో విడాకులు తీసుకున్నారు.తాజాహా నెట్‌ఫ్లిక్స్ షోలో కనిపించిన సీమా.. తన డేటింగ్ గురించి నోరు విప్పింది. సోహైల్‌తో డివోర్స్ తర్వాత విక్రమ్ అహుజాతో డేటింగ్లో ఉన్నట్లు సీమా వెల్లడించింది. ప్రస్తుతం అతనితో డేటింగ్లో ఉన్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ముంబయిలోని వర్లీ నుంచి బాంద్రాకు మారినప్పుడు తన ఇంటికోసం సాయం చేశాడని సీమా తెలిపింది. తన గురించి నాకంటే అతనికే ఎక్కువగా తెలుసని చెప్పింది. అతనితో మళ్లీ ప్రేమలో పడినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.కాగా.. విక్రమ్ అహుజా ఒక వ్యాపారవేత్త. మల్టీ మిలియనీర్ దేవేంద్ర అహుజా కుమారుడు. అతను సెంచూరియన్ బ్యాంక్ ప్రమోటర్‌గా పనిచేశాడు. గతంలో సీమా, విక్రమ్ 1990 నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఊహించని కారణాలతో వాళ్లిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సీమా.. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కానీ వీరిద్దరు రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. దీంతో తాజాగా సీమా తన మాజీ బాయ్‌ఫ్రెండ్ విక్రమ్ అహుజాతో డేటింగ్ చేస్తున్నట్లు తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ షో ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ షోలో ఈ విషయాన్ని వెల్లడించింది. -
మాజీ ప్రియురాలి ఇంట్లో గేమ్స్.. నా పక్కన ఆమె తల్లి..!
ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించావా? అంటే చాలామంది అబ్బేం, అదేం లేదని సులువుగా అబద్ధాలు చెప్పేస్తుంటారు. అదే ఇండస్ట్రీలో.. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో అయితే.. ఎస్, గతంలో పలువురితో ప్రేమలో పడ్డానంటూ చాంతాడంత లిస్టు బయటపెడతారు. కొందరు మాత్రం ఒకరిద్దరితోనే ఆగిపోతారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బ్రదర్స్ కూడా డేటింగ్ ఎక్స్పీరియన్స్ చేసినవారే! సల్లూభాయ్ సోదరుడు, నటుడు సోహైల్ ఖాన్ తాజాగా ఓ పాడ్‌క్యాస్ట్‌లో మాజీ ప్రేయసి ఇంట్లో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను షేర్ చేసుకున్నాడు. దాగుడుమూతలు 'నా ప్రియురాలి(ప్రస్తుతం మాజీ గర్ల్‌ఫ్రెండ్) ఇంట్లో మేమంతా దాగుడుమూతలు ఆడాము. నేను వెళ్లి వార్డ్‌రోబ్‌లో దాక్కున్నాను. అప్పుడే మరొకరు అదే వార్డ్ రోబ్‌లో దూరారు. నా గర్ల్‌ఫ్రెండ్ వచ్చిందేమో అనుకున్నాను. అంతా చీకటిగా ఉండటంతో అసలేమీ కనిపించలేదు. నా పక్కన ఉంది ప్రేయసే అనుకుని ఏదేదో ఊహించుకున్నాను. కట్ చేస్తే లైట్లు ఆన్ చేశారు. అందరూ బయటకు వచ్చారు. గేమ్ అయిపోయింది.. ఇంకా ఎందుకు దాక్కున్నారు? అని అడిగారు. అప్పుడు కానీ నాతో ఉన్నది ప్రియురాలి తల్లి అని అర్థం కాలేదు' అంటూ నవ్వేశాడు. అన్నింటికీ ఎక్స్పైరీ సీమా కిరణ్‌తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'ప్రతిదానికి ఎక్స్పైరీ ఉంటుంది. చాక్లెట్, మెడిసిన్, ఫుడ్.. ఇలా అన్నీ ఏదో ఒకరోజు పాడైపోయేవే. సంతోషంగా ఉన్నన్నాళ్లూ వైవాహిక బంధం బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి ఇద్దరి మధ్య నెగెటివ్ ఎనర్జీ వచ్చిందా? అది అంత ఈజీగా పోదు. గొడవలు పడుతూ ఉండే కంటే విడిపోవడమే మంచిది అని చెప్పుకొచ్చాడు. 1998లో సీమాను పెళ్లాడిన ఇతడు 2022లో విడాకులు తీసుకున్నాడు. చదవండి: హీరోయిన్ను పెళ్లాడిన దర్శన్? ఫోటో వైరల్! -
రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ స్టార్ క్రికెటర్..
పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోహైల్ ఖాన్ తన నిర్ణయాన్ని ఆదివారం ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలియజేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ డొమాస్టిక్ వైట్‌బాల్ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగుతానని సోహైల్ సృష్టం చేశాడు. తన 15 ఏళ్ల ప్రయాణంలో మద్దతుగా నిలిచిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అభిమానలకు, సహచర ఆటగాళ్లకు సోహైల్ ధన్యవాదాలు తెలిపాడు. సోహైల్ ఖాన్ 2008 జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అతడు చివరగా 2016 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాక్ తరపున ఆడాడు. తన కెరీర్లో సోహైల్ 9 టెస్టు, 13 వన్డేలు, 5 టీ20ల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో సోహైల్‌కు మంచి రికార్డు ఉంది. 9 మ్యాచ్‌ల్లో 3.69 ఏకానమీతో 27 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా వన్డేల్లో 19 వికెట్లు, టీ20ల్లో 5 వికెట్లు సాధించాడు. భారత్‌పై 5 వికెట్లు.. ముఖ్యంగా సోహైల్ ఖాన్ కంటే గుర్తు వచ్చేది 2015 వన్డే ప్రపంచకప్. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అతడు 5 వికెట్లు పడగొట్టి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అప్పటిలో అతడి పేరు మారుమ్రోగిపోయింది. కానీ ఆతర్వాత ఏడాదికే జట్టులో అతడు చోటు కోల్పోయాడు. చదవండి: Asia Cup 2023: ఇదెక్కడి దరిద్రం రా బాబు.. సిక్స్ కొట్టినా ఔటైపోయాడు! వీడియో చూడాల్సిందే -
నిప్పులు చెరిగిన పాక్ పేసర్.. మ్యాచ్ టై.. సూపర్ ఓవర్‌తో ఫలితం
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ 2023 ఎడిషన్ విజేతగా టెక్సస్ ఛార్జర్స్ అవతరించింది. న్యూయార్క్ వారియర్స్‌తో నిన్న (ఆగస్ట్ 27) జరిగిన ఫైనల్లో ఛార్జర్స్ సూపర్ ఓవర్ ద్వారా విజేతగా నిలిచింది. నిర్ణీత ఓవర్ల అనంతరం ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను తేల్చాల్సి వచ్చింది. రాణించిన కార్టర్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ వారియర్స్.. టెయిలెండర్ జోనాథన్ కార్టర్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో కార్టర్ మినహా అందరూ తేలిపోయారు. దిల్షన్ (18), రిచర్డ్ లెవి (17) రెండంకెల స్కోర్లు చేయగా.. మిస్బా ఉల్ హాక్ (5), షాహిద్ అఫ్రిది (1), కమ్రాన్ అక్మల్ (0), అబ్దుల్ రజాక్ (3) తస్సుమన్నారు. టెక్సస్ బౌలర్లలో ఎహసాన్ ఆదిల్ 3, ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇమ్రాన్ ఖాన్, తిసార పెరీరా తలో వికెట్ పడగొట్టారు. నిప్పులు చెరిగిన సోహైల్ ఖాన్.. 93 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టెక్సస్ ఛార్జర్స్.. సోహైల్ ఖాన్ (2-0-15-5), షాహిద్ అఫ్రిది (1-0-8-2), ఉమైద్ ఆసిఫ్ (2-0-14-2), జెరోమ్ టేలర్ (2-0-24-1) ధాటికి 10 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హఫీజ్ (46), బెన్ డంక్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. స్కోర్లు సమం కావడంతో ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు. స్కోర్లు సమం.. సూపర్ ఓవర్లో ఫలితం సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛార్జర్స్.. వికెట్ నష్టపోయి 15 పరుగులు చేసింది. డంక్, ముక్తర్ చెరో సిక్సర్ బాది, ఈ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు. ఛేదనలో వారియర్స్ 13 పరుగులకే పరిమతం కావడంతో టెక్సస్ ఛార్జర్స్ విజేతగా ఆవిర్భవించింది. కార్టర్ సిక్సర్, బౌండరీ బాదినా ప్రయోజనం లేకుండాపోయింది. సోహైల్ తన్వీర్ వారియర్స్‌ను కట్టడి చేశాడు. -
'ఉమ్రాన్‌కు అంత సీన్ లేదు.. పాక్‌లో అలాంటోళ్లు చాలా మంది ఉన్నారు’
పాకిస్తాన్ మాజీ ఆటగాడు సొహైల్ ఖాన్ భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. ఇటీవలే కోహ్లిపై వివాదస్పద వాఖ్యలు చేసిన సొహైల్ ఖాన్.. తాజాగా టీమిండియా యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌ను హేళన చేశాడు. పాకిస్తాన్ క్రికెట్లో ఉమ్రాన్ మాలిక్ వంటి చాలా మంది బౌలర్లు ఉన్నారని అతడు తెలిపాడు. పాక్ దేశీవాళీ క్రికెట్లో దాదాపు 12-15 మంది వరకు ఉమ్రాన్ వేసిన స్పీడ్‌తో బౌలింగ్ చేయగలరని గొప్పలు పలికాడు. ఉమ్రాన్ మంచి బౌలరే.. కానీ? "ఉమ్రాన్ మాలిక్ మంచి పేసర్ బౌలర్. నేను ఇప్పటికే ఒకట్రెండు మ్యాచ్‌ల్లో అతడు ప్రదర్శన చూశాను. అతడు రన్ప్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే కేవలం పేస్ ఆధారంగానే అతడు అద్భుతమైన బౌలర్ అని అనడం సరికాదు. అలా అయితే ప్రస్తుతం పాకిస్తాన్ దేశీవాళీ క్రికెట్లో 150-155 కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసే చాలా మంది ఫాస్ట్ బౌలర్ల ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ప్రస్తుతం 12-15 మంది వరకు ఇదే స్పీడ్‌తో బౌలింగ్ చేయగలరు. లాహోర్ క్వాలండర్స్ నిర్వహించే ట్రయల్స్‌ను ఓసారి సందర్శించినట్లయితే ఇటువంటి ఫాస్ట్‌బౌలర్లు చాలా మంది కన్పిస్తారు. అదే విధంగా మా జాతీయ జట్టు కూడా ఉమ్రాన్ మాలిక్ వంటి బౌలర్లతో నిండి ఉంది. షాహీన్, నసీమ్ షా, హరీస్ రౌఫ్ వంటి వారు ఈ కోవకు చెందినవారే. ఇంకా నేను చాలా పేర్లు చెప్పగలను" అని అతడు పేర్కొన్నాడు. అక్తర్ రికార్డను ఎవరూ బ్రేక్ చేయలేరు! షోయబ్ అక్తర్ అత్యంత వేగవంతమైన డెలివరి రికార్డు(161.3) రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరు. ఎందుకుంటే ఆ రోజుల్లో షోయబ్ చాలా కష్టపడ్డాడు. ఒక రోజులో 32 రౌండ్ల రన్నింగ్ పూర్తి చేసేవాడు. నేను వారం మొత్తానికి 10 రౌండ్లు మాత్రమే పరిగెత్తెవాడిని. ఇప్పుడు ఏ బౌలర్ కూడా అంత సాధన చేయలేడు. కాబట్టి అతడి రికార్డు ఎప్పటికీ బ్రేక్ కాదు అని సొహైల్ అన్నాడు. కాగా భవిష్యత్తులో అక్తర్ రికార్డును ఉమ్రాన్ బ్రేక్ చేస్తాడని పలువురు మాజీ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సొహైల్ చేసిన వాఖ్యలు మరోసారి వివాదాస్పదమవుతున్నాయి. చదవండి: సొంతగడ్డపై భారత జట్టు బలహీనం.. ఆసీస్‌దే ట్రోఫీ: టీమిండియా మాజీ హెడ్‌కోచ్ -
కోహ్లితో నాడు వాగ్వాదం.. పాక్ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు! కొడుకా అంటూ..
Virat Kohli: వన్డే వరల్డ్‌కప్ 2015.. ఫిబ్రవరి 15.. అడిలైడ్ ఓవల్ మైదానంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్.. చిరకాల ప్రత్యర్థుల పోరులో ఎప్పటిలాగే టీమిండియాదే పైచేయి.. ఈ విజయంలో ముఖ్యపాత్ర వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లిది! రన్‌మెషీన్ కోహ్లి దెబ్బకు.. దాయాది శిబిరంలో పేసర్ సొహైల్ ఖాన్ తీసిన ఐదు వికెట్లకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 10 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చిన ఈ రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, మహేంద్ర సింగ్ ధోని, అజింక్య రహానే వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక వికెట్లు తీసి సత్తా చాటినప్పటికీ కోహ్లి అద్భుత సెంచరీకి తోడు, రైనా 74 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు స్కోరు చేసింది టీమిండియా. భారత బౌలర్ల విజృంభణతో చతికిలపడ్డ పాకిస్తాన్ 224 పరుగులకే కుప్పకూలి 76 పరుగుల తేడాతో చిత్తైంది. కోహ్లి- సొహైల్ వాగ్వాదం అయితే, నాటి భారత్- పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లి- సొహైల్ ఖాన్ మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఆ ఘటన గురించి గుర్తు చేసుకున్న సొహైల్ ఖాన్.. కోహ్లితో గొడవ సందర్భంగా అన్న మాటలు వివాదాస్పదంగా మారాయి. బిడ్డా నువ్వు అండర్ 19లో ఆడుతున్నపుడే నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సొహైల్.. ‘‘నేను బ్యాటింగ్‌కి వెళ్లినపుడు.. విరాట్ కోహ్లి నా దగ్గరకొచ్చి.. కొత్తగా వచ్చావు.. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అన్నాడు. అప్పుడు నేను.. ‘‘కొడుకా(బిడ్డా).. నువ్వు అండర్ 19 క్రికెట్ ఆడుతున్నపుడు.. మీ బాపు (తనను తాను ఉద్దేశించి) టెస్టు క్రికెటర్ అని చెప్పాను’’ అన్నాడు. ఇక 2006 నుంచి తాను పాకిస్తాన్‌కు ఆడుతున్నానన్న సొహైల్.. గాయం కారణంగా కొన్నాళ్లు జట్టుకు దూరమైన విషయాన్ని చెప్పానన్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన సొహైల్‌కు అనూహ్యంగా నాటి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. అంత గొప్పగా ఏం లేదు ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2022లోనూ కోహ్లి ఒంటిచేత్తో పాక్‌తో మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిన సిక్స్ హైలైట్‌గా నిలిచింది. అయితే, సొహైల్ మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిందేమీ మరీ అంత చెప్పుకోదగ్గ షాట్ కాదు. తనకు బౌలర్ ఇచ్చిన అవకాశాన్ని కోహ్లి సద్వినియోగం చేసుకున్నాడు అంతే’’ అని పేర్కొన్నాడు. కింగ్ ఫ్యాన్స్ ఫైర్ కాగా సొహైల్ ఖాన్ 2008 జనవరిలో జింబాబ్వేతో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టగా.. 2009లో శ్రీలంకతో మ్యాచ్‌లో టెస్టుల్లో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక కోహ్లి శ్రీలకంతో వన్డేలో 2008 ఆగష్టులో టీమిండియా తరఫున అరంగ్రేటం చేశాడు. 2011లో భారత్ తరఫున వెస్టిండీస్‌తో సిరీస్‌లో మొదటి టెస్టు ఆడాడు. ఇక సొహైల్ తాజా ఇంటర్వ్యూ నేపథ్యంలో కింగ్ కోహ్లి ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ‘‘ఎప్పుడొచ్చామని కాదు.. ఎలా ఆడామన్నది ముఖ్యం. వయసు రాగానే సరిపోదు.. అందుకు తగ్గట్లు సంస్కారంగా ఉండటం నేర్చుకోవాలి. అవేవో గొప్ప మాటలు అయినట్లు మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నావా’’అని 38 ఏళ్ల సొహైల్‌కు చురకలు అంటిస్తున్నారు. కోహ్లి ముందు నువ్వు ఏమాత్రం పనికిరావంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్ రావాల్సిందే! WC 2023: ప్రపంచకప్ టోర్నీ ‘అర్హత’ కోసం దక్షిణాఫ్రికా, లంక పోరు! ఆ సిరీస్‌ల ఫలితాలు తేలితేనే -
ఇన్‌స్టా అకౌంట్ నుంచి భర్త పేరును తొలగించిన నటి
సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్‌తో విడిపోయిన అనంతరం సీమా ఖాన్ తన అత్తింటి పేరును తొలగించింది. ఇప్పటికే ఈ స్టార్ కపుల్ విడాకుల విషయం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెబుతూ ఈ జంట ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. విడాకుల కోసం ముంబై ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్న వారం రోజుల అనంతరం సీమా ఖాన్ తన భర్త పేరును ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తొలగించింది. గతంలో సీమా ఖాన్‌గా ఉన్న ఆమె ఇప్పుడు 'సీమాకిరణ్ సజ్దేహ్' పేరుతో ఇన్‌స్టా అకౌంట్ పేరును మార్చుకుంది. దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా 1998లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సోహైల్ ఖాన్-సీమా ఖాన్లు 24ఏళ్ల వివాహం అనంతరం విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. గతంలోనూ సల్మాన్ ఖాన్ మరో తమ్ముడు అర్భాజ్ ఖాన్ సైతం మలైకా అరోరాతో విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా సోహైల్ ఖాన్ కూడా విడాకులు తీసుకోనుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. -
స్టార్ కపుల్ విడాకుల వెనుక ఆ హీరోయిన్ ఉందా?
సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ విడాకుల విషయం ఇప్పుడు బీటౌన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా కలిసున్న సోహైల్- సీమా ఖాన్లు 24ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ కోర్టు మెట్లు ఎక్కారు. ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న సోహైల్-సీమా ఖాన్లు ఇప్పుడు తమ బంధానికి ముగింపు పలకడం ఇప్పుడు బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది.దీని వెనుక కారణం ఏంటన్నదానిపై ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే వీరి విడాకుల వెనుక ఓ హీరోయిన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నాడంటూ మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. గతంలోనూ ఇలాంటి వార్తలు రాగా, సోహైల్ తనకు అన్నలాంటి వాడని చెప్పి హ్యూమా ఖురేషీ అందరి నోరూ మూయించింది. మరి ఇప్పుడు ఏకంగా ఆ జంట విడాకులు తీసుకోవడంతో మరోసారి ఈ బ్యూటీ పేరు జోరుగా వినిపిస్తుంది. -
సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లిళ్లు అచ్చిరాలేదా?
సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఈ బ్రేకప్ కహానీలు ఎక్కువ. తాజాగా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ విడాకుల విషయం ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా కలిసున్న సోహైల్- సీమా ఖాన్లు 24ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ ఖాన్ హీరోయిన్ మలైకా అరోరాతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో తమ్ముడు సోహైల్ ఖాన్ సైతం విడాకుల లిస్ట్‌లో చేరిపోయాడు. మరోవైపు ఎంతో మంది హీరోయిన్స్‌తో ప్రేమాయణం సాగించిన సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయాడు. అటు చాన్నాళ్ల కిందటే పెళిళ్లు చేసుకున్న ఆయన తమ్ముళ్లు విడాకులు తీసుకున్నారు. దీంతో సల్మాన్ ఫ్యామిలీకి పెళ్లి అచ్చి రాలేదేమో అంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. చదవండి: విడాకులు తీసుకోనున్న స్టార్ కపుల్ -
విడాకులు తీసుకోనున్న స్టార్ కపుల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ విడాకుల విషయం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోనంగా ఉండే సోహైల్ ఖాన్- సీమా ఖాన్లు పెళ్లయిన 24ఏళ్ల అనంతరం విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ముంబై ఫ్యామిలీ కోర్టుకు చేరుకున్న ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకోవడం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే వీరి విడాకులకు గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియలేదు. కాగా 1998లో సోహైల్ ఖాన్- సీమా ఖాన్లు ఇంట్లోంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి నిర్వాన్, యోహాన్ పిల్లలు. గతంలో 2017లోనే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారు అని వార్తలు హల్చల్ చేయగా సీమా వాటిని ఖండించింది. ఏ బంధంలో అయినా గొడవలు సహజమని, తమకు అన్నింటి కంటే తమ పిల్లలే చాలా ముఖ్యమని పేర్కొంది. తాజాగా ఈ జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం బీటౌన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. -
రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌తో సల్మాన్ దీపావళి సంబరాలు
గతేడాది కరోనా కారణంగా దీపావళి పండగ సెలబ్రెషన్స్‌ను ఎవరు అంతగా జరుపుకోలేకపోరు. ఇక ఈ ఏడాది పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఈ దివాళిని రెట్టింపు సంతోషంతో జరుపుకున్నారు. ఇక సినీ తారల సందడి అయితే మామూలుగా లేదు. తమ కుటుంబాలతో కలిసి పూజలు, టాపాసులు పేల్చి ఘనంగా ఈ దీవాళిని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ‘భాయిజాన్’ సల్మాన్ ఖాన్ కూడా తన కుటుంబ సభ్యులు, రూమార్డ్ గర్ల్‌ఫ్రెండ్ లూలియా వాంటూర్లుతో కలిసి పండగను సెలబ్రెట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. చదవండి: స్టార్ హీరోలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ముంబైలోని తన నివాసంలో దీపావళి వేడుకలను ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్ అతడి రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ లూలియా వాంటూర్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సల్మాన్ ఖాన్ బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో సింపుల్‌గా కనిపించగా..లూలియా వాంటూర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఎంబ్రాయిడరీ డిజైన్‌తో రూపొందించిన అనార్కలీ షూట్, బంగారు ఆభరణాలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ వేడుకకు డేవిడ్ ధావన్-కరుణ ధావన్ దంపతులు కూడా హజరయ్యారు. వారితో సల్మాన్ ఖాన్ గేటు దగ్గర నుంచి స్వాగతం పలికి వారితో కాసేపు ముచ్చటించాడు. చదవండి: ఆ స్టార్ హీరో వల్లే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: టబు -
రేర్ వీడియో: పార్టీలో సల్మాన్ సోదరుల జోష్, వీడియో వైరల్!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సోదరులతో కలిస డ్యాన్స్ చేస్తున్న పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండేళ్ల క్రితం సల్మాన్ ఖాన్, అర్భాజ్ ఖాన్, సోహైల్ ఖాన్లు డ్యాన్స్ చేస్తున్న ఈ రేర్ వీడియో చివరలోనే వారి బావ ఆయుష్ శర్మ కూడా వారితో కాలు కదిపాడు. ఎప్పుడు షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఈ సల్మాన్ ఖాన్, ఆయన సోదరుడు కలిసి పార్టీలకు, కార్యక్రమాలకు హజరవడం అరుదు. ఈ నేపధ్యంలో గత 2018 క్రిస్మస్ వేడుకలో భాగంగా ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకచోట చేరి ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియో మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో ఈ సల్మాన్, అర్భాజ్, సోహైల్‌లు వారి బావతో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఒక్కచోట ముగ్గురు అన్నదమ్ములను చూసి అభిమానులు, నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. దీంతో ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా సల్మాన్ ఇటీవల నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ మూవీ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈధ్ సందర్భంగా డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పలు కాంట్రవర్శీల్లో చిక్కుకుంది. విడుదలైన కొన్ని గంటల ముందే ఈ మూవీ ఆన్లైన్లో లీక్ అయ్యింది. ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన రాధేలో సల్మాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) -
ఆదాయం... సహాయం
‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్ర నిర్మాతలు ఆదర్శనీయమైన ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సినిమా విడుదల ద్వారా లభించే ఆదాయంలో కొంత మొత్తాన్ని కరోనా బాధితుల వైద్య సేవలకు వినియోగించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘గివ్ ఇండియా’ సంస్థతో అసోసియేట్ అయి, కోవిడ్ బాధితులకు అవసరమయ్యే ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్స్, వెంటిలేటర్స్ వంటి పరికరాల కొనుగోలుకు తాము సహాయం చేస్తున్నట్లు ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ నిర్మాతలు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాను సల్మాన్ ఖాన్, ఆయన సోదరుడు సోహైల్ ఖాన్, బావ అతుల్ అగ్నిహోత్రి, నిఖిల్ నిర్మించారు. ఈ సినిమా విడుదల హక్కులను జీ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది. ‘‘ఈ నెల 13న మల్టీ ప్లాట్‌ఫామ్స్ (ఓటీటీ, డీటీహెచ్ ఆపరేటర్స్, థియేటర్స్...)లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు ఆదాయం వస్తే అందులో కొంత కోవిడ్ బాధితుల సహాయార్థం వినియోగిస్తాం. కోవిడ్ బాధితుల కోసం మరింతమంది సహాయం చేయాల్సిన అవసరం ఉంది’’ అని జీ స్టూడియోస్ ప్రతినిధులు వెల్లడించారు. -
యూకే స్ట్రెయిన్: సల్మాన్ సోదరులపై ఎఫ్ఐఆర్
ముంబై: కరోనా వైరస్‌ను అరికట్టెందుకు మన ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధిస్తున్నప్పటికి కొందరు మాత్రం వాటిని లెక్కచేయకుండా పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వ నియమాలను, ఆదేశాలను లెక్కచేయని వారిలో సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం. తాజాగా వారిలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సోహైల్ ఖాన్లు కూడా చేరారు. కోవిడ్ నిబంధనలను ఉల్లఘించారంటూ వారిపై ఓ వైద్యాధికారి ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ) పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహరాష్ట్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చిన వారు కోవిడ్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి అంటూ ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలో ఒకవేళ నెగిటివ్ వచ్చినప్పటికి కూడా వారాల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని మహా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల దుబాయ్ వెళ్లిన అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, సోహైల్ తనయుడు నిర్వాన్ ఖాన్లు గతేడాది డిసెంబర్ 25న దుబాయ్ నుంచి ముంబైకు తిరిగి వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం లేక్క చేయకుండ ఆర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, నిర్వాన్‌లు నిబంధలను ఉల్లఘించడంతో ముగ్గురిపై ముంబై వైద్యాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్‌కు వెళ్లాలి. కానీ నిబంధనలను అతిక్రమిస్తూ వారు నేరుగా ఇంటికి వెళ్లారని, కోవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్లో ఉండాలని చెప్పినా పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించారని సదరు వైద్య అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మా అభిమాన భార్య కరణ్ జోహార్యే..!
ముంబై: బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రోడక్షన్లో నిర్మించిన ‘ది ఫ్యాబులస్ లైఫ్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ సిరీస్ గత శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ రియాలిటీ షోలో ప్రముఖ బాలీవుడ్ నటుల భార్యలు కథానాయికలకు నటిస్తున్నారు. అయితే ఈ సిరీస్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటొంది. ఇందులో సోహై ఖాన్(సల్మాన్ ఖాన్ సోదరుడు) భార్య సీమా ఖాన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రసారమైన నాలుగవ ఎపీసోడ్‌లో సీమా-సోహైల్ ఖాన్‌లను నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ షో నిర్మాత కరణ్ జోహార్ కూడా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అది చూసిన కరణ్ తనదైన శైలీలో ట్రోలర్‌కు సమాధానం ఇచ్చాడు. (చదవండి: రియాలిటీ షో: వారిద్దరూ కలిసుండటం లేదా!) Ok this really made me laugh! 🤣 A troll with a sense of humour is so refreshing! Thanks Doc! https://t.co/nuelRifxzI — Karan Johar (@karanjohar) November 29, 2020 అయితే ఈ వెబ్ సిరీస్‌పై డాక్టర్ అఖిలేష్ గాంధీ అనే ట్విటర్ యూజర్ కరణ్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఫ్యాబులస్ లైప్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్లో మన అభిమాన భార్య కరణ్ జోహార్ అని మనమంతా అంగీకరించక తప్పదని నా అభిప్రాయం’ అంటూ కామెంట్ చేశాడు. అది చూసిన కరణ్ సదరు నెటిజన్ కామెంట్‌పై స్పందిస్తూ.. ‘ఓకె నీ ట్వీట్ నిజంగా నన్ను నవ్వించింది. ఈ ట్రోల్ నన్ను రీఫ్రెష్ చేసింది. ధన్యవాదలు మిస్టర్ డాక్టర్’ అంటూ కరణ్ చురకలు అట్టించారు. కాగా కరణ్ జోహార్, అపూర్వ మెహతాలు కలిసి ‘ది ఫ్యాబులస్ లైఫ్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ రియాలిటీ షోను రూపొందించారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటులు సోహైల్ ఖాన్ భార్య నీలం ఖాన్, సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్, చుంకీ పాండే భార్య భావన పాండే, సమీర్ సోనీ భార్య నీలం కొఠారీలు నటిస్తున్నారు. -
రియాలిటీ షో: వారిద్దరూ కలిసుండటం లేదా!
ముంబై: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తాజా రియాలిటీ షో ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ బాలీవుడ్ నటుల భార్యల నిజ జీవితంగా ఆధారంగా ఈ రియాలీటీ షో తెరకెక్కుతోంది. ఈ షోలో కథానాయికలుగా మహీప్ కపూర్, నీలం కొఠారి సోని, భావన పాండేలతో పాటు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్లు నటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం టెలికాస్ట్ అయిన తొలి ఎపీసోడ్ ప్రేక్షకులను కన్ఫ్యూజన్లోకి నెట్టెసింది. అయితే ఈ షో తొలి ఎపీసోడ్‌లో సోహైల్ ఖాన్.. భార్య సీమా ఖాన్ ఇంటికి వచ్చినట్లు చూపించారు. సోహైల్ వచ్చాడని అనుకుంటూ అని సీమా అనుకుంటుంది. దీంతో సీమా, సోహైల్‌లు ఎందుకు వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారని అని నెటిజన్లలో అనుమానం మొదలైంది. వీరిద్దరి రిలేషన్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అంతేగాక నాలుగవ ఎపిసోడ్లో ఆమె పెద్ద కుమారుడు నిర్వాన్ కూడా వస్తాడు. అతను కొత్తగా రెనోవెట్ చేసిన సీమ ఇంటిని పరిశీలిస్తుంటాడు. ఈ నేపథ్యంలో సీమా నిర్వాన్‌తో.. ‘నువ్వు ఎక్కువ సమయంలో నాతోనే ఉండాలని కొడుకును కోరుతుంది. దీంతో నిర్వాన్ రోజు నిన్ను చూడటానికి వస్తూనే ఉంటాను అమ్మ ’అని చెప్పడంతో నెటిజన్ల మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (చదవండి: నువ్వు చేసింది అనైతికం..) ఇక నిర్వాన్ తనతో ఉండడు అని సీమా బాధపడుతుంటే అతడు ‘నేను సముద్రాల అవతల నివసించడం లేదమ్మ.. అమ్మ పక్క వీధిలోనే ఉంటున్నాను’ అని సీమాతో చెబుతాడు. దీంతో ‘‘నేను నిర్వాన్‌ను ఎప్పుడూ చూడలేను. అతను ఎక్కవగా తన తండ్రితోనే కలిసుంటాడు. కేవలం ఇక్కడ నిద్రపోతాడంతే. నిర్వాన్ విషయంలో నన్ను అంత్యంత బాధించే విషయాలలో ఇది ఒకటి’’ అని సీమా కెమారా ముందు వాపోతుంది. దీంతో నెటిజన్లు సీమా-సోహైల్ ఖాన్లు విడిపోయారా అని సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక వారిద్దరూ కలిసి లేనప్పుడు ఆమెను బాలీవుడ్ వైఫ్ అని పిలవడం సరైనదేనా అంటూ నెటిజన్ ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేగాక ఓ సన్నివేశంలో సీమా.. సోహైల్‌ను సంప్రదాయా వివాహం చేసుకోలేదని చెబుతుంది. ‘అంటే వారికి వివాహం కాలేదా?.. వారిద్దరూ సహాజీవనం చేస్తున్నారా? అలాంటప్పుడు సీమా బాలీవుడ్ వైఫ్ కాదు కదా’ అంటూ నెటిన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుల భార్యల లైఫ్‌స్టైల్‌ను తెరపై చూపించే నేపథ్యంలో నిర్మాత కరణ్ జోహార్ ‘ఫ్యాబులస్ లైఫ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. (చదవండి: ఆమె ‘ఆది పురుష్’ సీత.. త్వరలో ప్రకటన!) -
లంక ప్రీమియర్ లీగ్‌లో సొహైల్ ఖాన్ పెట్టుబడి
ముంబై: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) టి20 టోర్నమెంట్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు నటుడు, నిర్మాత సొహైల్ ఖాన్ పెట్టుబడి పెట్టాడు. ‘క్యాండీ టస్కర్స్’ ఫ్రాంచైజీని సొహైల్ ఖాన్, అతని తండ్రి సలీమ్ ఖాన్‌కు చెందిన కన్సార్టియం ‘సొహైల్ ఖాన్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్పీ’ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సొహైల్ ఖాన్ అధికారికంగా ప్రకటించాడు. ‘ఎల్‌పీఎల్‌కు మంచి భవిష్యత్ ఉంది. ఇందులో భాగం కావడం సంతోషాన్నిచ్చింది. ఆట పట్ల లంక అభిమానులు ఉత్సుకతతో ఉంటారు. జట్టుకు మద్దతు ఇవ్వడానికి వారంతా మా వెంటే ఉంటారని నమ్ముతున్నా’ అని సొహైల్ పేర్కొన్నాడు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 13 వరకు జరుగనున్న ఈ ఎల్పీఎల్లో ఐదు జట్లు కొలంబో కింగ్స్, దంబుల్లా హాక్స్, గాలె గ్లాడియేటర్స్, జాఫ్నా స్టాలియన్స్, క్యాండీ టస్కర్స్ తలపడనున్నాయి. లీగ్ కోసం రెండు రోజులుగా జరిగిన ఆటగాళ్ల వేలంలో టస్కర్స్ జట్టు వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్‌ను దక్కించుకుంది. గేల్‌తో పాటు ఫ్లంకెట్, వహాబ్ రియాజ్, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, నువాన్ ప్రదీప్‌లు టస్కర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ హసన్ తిలకరత్నే ఈ జట్టు కోచింగ్ బృందంలో పనిచేయనున్నాడు. ఎల్పీఎల్లో పాల్గొనే ప్రముఖ ఆటగాళ్లు జాఫ్నా స్టాలియన్స్: షోయబ్ మాలిక్. దంబుల్లా హాక్స్: డేవిడ్ మిల్లర్, కార్లోస్ బ్రాత్‌వైట్. కొలంబో కింగ్స్: రసెల్, డుప్లెసిస్, ఏంజె లో మాథ్యూస్. గాలె గ్లాడియేటర్స్: లసిత్ మలింగ, అఫ్రిది, ఇంగ్రామ్, మొహమ్మద్ ఆమీర్. -
‘ఆ దర్శకుడిపై చట్టపరమైన చర్యలు’
ముంబై: ‘దబాంగ్’ దర్శకుడు అభినవ్ కశ్యప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, తన సోదరుడు అర్బాజ్ ఖాన్లు తన జీవితాన్ని నాశనం చేశారంటూ అభినవ్ కశ్యప్ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అర్భాజ్ స్పందిస్తూ... ‘నన్ను నా సోదరులు సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, మా తండ్రి సలీం ఖాన్‌లపై సోషల్ మీడియాలో కశ్యప్ తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్నాడు. ఇక తనపై మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పాడు. (సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ దర్శకుడు) 2013లో తన బేషారం చిత్రం విడుదలను అడ్డుకోవాలని ప్రయత్నించారని కశ్యప్ చేసిన ఆరోపణపై ఆర్భాజ్ మాట్లాడుతూ... ‘‘అభినవ్ దర్శకత్వం వహించిన 2010 చిత్రం ‘దబాంగ్’లో నేను, సల్మాన్ నటించాం. ఆ తర్వాత ‘దబాంగ్-2’ నుంచి అభినవ్ తప్పుకున్నాడు. అప్పటీ నుంచి మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. వృత్తిపరంగా మేము విడిపోయాం. అయినా ఇలాంటి ఆరోపణలు అభినవ్ ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అయితే త్వరలోనే మేము కశ్యప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అంటూ చెప్పుకొచ్చాడు. (సల్మాన్‌ఖాన్‌పై సంచలన ఆరోపణలు..) కాగా ఇటీవల కశ్యప్.. సల్మాన్ ఖాన్, తన సోదరులు నా కెరీర్‌ను నాశనం చేశారని, 2010 విడుదలైన ‘దబాంగ్’ సీక్వెల్‌ను కూడా తానే చేయాల్సి ఉండేదని, అయితే సల్మాన్ సోదరులు అర్బాజ్, సోహైల్‌లు ‘దబాంగ్ 2’ నుంచి తప్పుకోవాలని తనని బెదిరించారన చెప్పాడు. వారు నా జీవితాన్ని నియంత్రించాలని చుశారన్నాడు. అంతేకాదు తను దర్శకుడిగా వ్వవహరించిన ‘బేషారం’చిత్రం విడుదలను ఆపేందుకు సల్మాన్, అతడి కుటుంబం అన్ని రకాల ప్రయత్నాలు చేశారంటూ అభినవ్ ఫేస్బుక్లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. (సుశాంత్ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు) -
బాయ్‌కాట్ సల్మాన్
‘‘నా శత్రువులు చాలా చురుకైనవాళ్లు. చాకచక్యంగా నా వెనక నుంచి నాపై దాడి చేస్తారు. కానీ పదేళ్ల తర్వాత నా శత్రువులు ఎవరో నేను తెలుసుకోగలిగాను. వాళ్లెవరంటే సలీం ఖాన్ (రచయిత–నటుడు, సల్మాన్ ఖాన్ తండ్రి), సల్మాన్ ఖాన్, సల్మాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్. ఇంకా వెన్నుపోటు పొడిచినవాళ్లు ఉన్నారు. కానీ ఈ విషపూరిత సర్పానికి సల్మాన్ కుటుంబం అధిపతి. డబ్బు, రాజకీయ పలుకుబడి, అండర్‌వరల్డ్ కనెక్షన్లతో వాళ్లు ఎవరినైనా ఏమైనా చేయగలుగుతారు. దురదృష్టం ఏంటంటే నావైపు ‘నిజాయితీ’ మాత్రమే ఉంది. అయితే నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా జీవితాన్ని చాలించను. తలవంచేది లేదు. ఎదురు నిలబడి పోరాడతా. ఒకటీ వాళ్ల అంతం చూస్తా.. లేకపోతే నా అంతం అయినా చూస్తా. ఇక భరించింది చాలు. మళ్లీ పోరాడే సమయం ఆసన్నమైంది’’ అని హిందీ దర్శకుడు అభినవ్ కశ్యప్ మంగళవారం తన ఫేస్బుక్లో సుదీర్ఘంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి హిందీ పరిశ్రమలో అతనికి ఎదురైన చేదు అనుభవాలు ఒక కారణం అనేది పలువురి అభిప్రాయం. అభినవ్ కశ్యప్ కూడా ఆ మాటే అంటున్నారు. ఇది ‘మీటూ’ ఉద్యమం అంత పెద్దది ‘‘ప్రభుత్వానికి ఓ విన్నపం. సుశాంత్ మరణానికి గల కారణాలను సునిశితంగా పరిశోధించాలి. మేం చాలామంది ఎదుర్కొంటున్న చాలా సమస్యలను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బయటకు తీసుకొస్తోంది. ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించే సమస్యలవి. సుశాంత్ మరణం అనేది ఒక మచ్చు తునక అనే భయం వేస్తోంది. ఇది (నెపోటిజమ్ – బంధుప్రీతి) ‘మీటూ’ ఉద్యమం అంత పెద్దది. సుశాంత్ మరణానికి ‘వైఆర్ఎఫ్’ టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీ ముఖ్య కారణం. ఈ టాలెంట్ ఏజెన్సీ వాళ్లు మన కెరీర్‌ని బిల్డ్ చేయరు.. కెరీర్‌తో పాటు జీవితాలను కూడా నాశనం చేసేస్తారు. పదేళ్లుగా ఇబ్బందిపడుతున్న వ్యక్తిగా చెబుతున్నా.. బాలీవుడ్‌కి చెందిన ప్రతి టాలెంట్ మ్యానేజర్, టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీలు ఆర్టిస్ట్‌లకు ఓ ‘డెత్ ట్రాప్’లాంటివి. ఈ మ్యానేజర్లు, ఏజెన్సీలు అవకాశాలిప్పిస్తామని ఇండస్ట్రీకి సంబంధంలేనివాళ్లను నమ్మిస్తారు. బాలీవుడ్లో జరిగే పార్టీలకు వాళ్లను ఆహ్వానిస్తారు. అయితే అక్కడ వీరిని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. అప్పుడు వీళ్లకు ఓ అభద్రతాభావం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అప్పుడు ఈ క్యాస్టింగ్ డైరెక్టర్లు మేం కాపాడతామంటూ కొన్నేళ్ల పాటు తమ ఏజెన్సీతో కలిసి పని చేస్తామని ఒప్పందపత్రంలో సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తారు. ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఒక్కసారి ఒప్పందం కుదిరాక ఇక వాళ్లకు ఏ హక్కూ ఉండదు. కెరీర్‌కి సంబంధించిన నిర్ణయాలు వాళ్ల చేతిలో ఉండవు. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కార్మికుడిలా తక్కువ పారితోషికానికి పని చేయాలి. పోనీ ఎలాగోలా ఈ ఏజెన్సీ నుంచి తప్పించుకుని ‘రేపు’ బాగుంటుందనే నమ్మకంతో వేరే ఏజెన్సీ దగ్గరికి వెళితే ఆ ‘రేపు’ఎప్పటికీ రాదు. ఇలాంటి అనుభవాలు నేను చాలా ఎదుర్కొన్నాను. అర్బాజ్ ఖాన్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. ‘దబాంగ్’ (2010) సినిమాకి దర్శకత్వం వహించిన పదేళ్లకు నా అనుభవాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. ‘దబాంగ్’ తర్వాత ‘దబాంగ్ 2’ ఒప్పుకుని ఆ సినిమా నుంచి నేను తప్పకోడానికి కారణం అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్ మరియు అతని కుటుంబం. నా కెరీర్‌ని కంట్రోల్ చేయడానికి వాళ్లు ట్రై చేశారు. నా రెండో చిత్రాన్ని శ్రీ అష్టవినాయక ఫిలింస్ సంస్థతో చేయడానికి సైన్ చేశాను. కానీ ఆ సంస్థ అధినేత రాజ్ మెహతాకి ఫోన్ చేసి, ‘అతనితో సినిమా చేస్తే జాగ్రత్త’ అని బెదిరించారు. దాంతో నేను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వయాకామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ సంస్థ అధినేత విక్రమ్ మల్హోత్రాకి ఫోన్ చేసి, బెదిరించారు. దాంతో తీసుకున్న 7 కోట్ల రూపాయల అడ్వాన్స్ తిరిగి ఇవ్వడంతో పాటు 90 లక్షలు వడ్డీ కూడా ఇవ్వాల్సి వచ్చింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సపోర్ట్ వల్ల ‘బేషరమ్’ (2013) సినిమాకి దర్శకత్వం వహించగలిగాను. అయితే ఆ సినిమా విడుదలకు ముందు సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. దాంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనడానికి భయపడ్డారు. కానీ రిలయన్స్, నేను ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నవాళ్లం కాబట్టి సొంతంగా సినిమాని విడుదల చేయాలనుకున్నాం. అప్పుడు అసలు యుద్ధం మొదలైంది. నా శత్రువులు బాక్సాఫీస్ దగ్గర నా సినిమా పరాజయం పాలు కావడానికి సినిమా గురించి నెగటివ్ ప్రచారం చేశారు. అయితే థియేటర్ల నుంచి ఎత్తేసే నాటికి నా సినిమా 58 కోట్లు వసూలు చేసింది. శాటిలైట్ రైట్స్ విషయంలో ఇబ్బందిపెట్టారు. ఇక ఆ తర్వాత నా ప్రతి ప్రయత్నాన్ని చెడగొట్టే పనులు చేశారు. నన్ను బెదిరించారు. నా కుటుంబంలో ఉన్న స్త్రీలను అత్యాచారం చేస్తామని బెదిరించారు. దాంతో నా మానసిక ఆరోగ్యం దెబ్బతింది. చివరికి 2017లో నా భార్య, నేను విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత కూడా నన్ను వదిలిపెట్టలేదు. బెదిరిస్తూ మెసేజ్‌లు పంపించారు. పోలీస్ స్టేషన్‌కి వెళితే ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించారు. నా శత్రువులు చాలా చురుకైనవాళ్లు. వెనక నుండి నాపై దాడి చేస్తున్నారు. నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఇక సహించేది లేదు. ఓపెన్‌గా చాలెంజ్ చేస్తున్నాను. అమాయకులు బలి కాకూడదు సుశాంత్ సింగ్ వెళ్లిపోయాడు. కానీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాడని అనుకుంటున్నాను. కానీ అలాంటి అమాయకులు ఇక బాలీవుడ్లో బలి కాకూడదు. ఇబ్బంది పడుతున్న నటీనటులు, క్రియేటివ్ పీపుల్ నా ఈ పోస్ట్‌ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. దయచేసి షేర్ చేయండి’’ అంటూ ‘మీటూ బాయ్‌కాట్ సల్మాన్‌ఖాన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ముగించారు అభినవ్ కశ్యప్. కాగా నో స్మోకింగ్, బాంబే వెల్వెట్, రమణ్ రాఘవ్, మన్మర్జియాన్.. ఇలా ఓ 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సోదరుడు అభినవ్ కశ్యప్. తన సోదరుడు అభినవ్, సల్మాన్ ఖాన్‌కి మధ్య జరుగుతున్న వివాదం గురించి తాను స్పందించదలచుకోలేదని అనురాగ్ తన ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘ఈ విషయం గురించి మాట్లాడటానికి మీడియావారు నాకు ఫోన్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే తన విషయంలో నన్ను జోక్యం చేసుకోవద్దని అభినవ్ చాలా స్పష్టంగా చెప్పేశాడు. అందుకని తను చేస్తున్నవాటికి, చెబుతున్నవాటి గురించి నేను స్పందించలేను’’ అని అనురాగ్ ట్వీట్ చేశారు. చిత్రపరిశ్రమ మేల్కొనాల్సిన సమయం ఇది – నటుడు వివేక్ ఒబెరాయ్ ‘‘సుశాంత్ తండ్రి కళ్లల్లో బాధ చూస్తుంటే భరించలేని విధంగా ఉంది’’ అంటూ నటుడు వివేక్ ఒబెరాయ్ తన ట్వీటర్ ద్వారా కొన్ని విషయాలు పంచుకున్నారు. చిత్రపరిశ్రమ మేల్కొనాల్సిన సమయం ఇది అని వివేక్ చెబుతూ – ‘‘ప్రతిభను ప్రోత్సహించే దిశగా సినిమా పరిశ్రమ అడుగులు వేయాలి కానీ ప్రతిభను నాశనం చేసే దిశగా కాదు. నా ఈ ప్రయాణంలో నేను కూడా ఎన్నో బాధలు అనుభవించాను. ఆ బాధలు చెప్పి సుశాంత్ బాధని తగ్గించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. మన ప్రయాణం చీకటిలో కొనసాగవచ్చు లేదా ఒంటరి ప్రయాణం కావొచ్చు. కానీ మరణం దానికి పరిష్కారం కాదు. ఆత్మహత్య పరిష్కారం కానే కాదు. సుశాంత్ తన కుటుంబం, స్నేహితులు, లక్షలాది మంది అభిమానుల గురించి ఆలోచించడం మానేశాడనుకుంటున్నాను. అందుకే ఈరోజు అతన్ని మనం కోల్పోయాం. అతని తండ్రి బాధ వర్ణనాతీతం. ఇక సుశాంత్ అక్క అయితే ‘వెనక్కి వచ్చెయ్’ అంటూ కన్నీటి పర్యంతం కావడం నన్ను కలచివేసింది. సుశాంత్ మరణం సినిమా పరిశ్రమకు ఓ మేలుకొలుపు లాంటిది’’ అన్నారు. – డి.జి.భవాని -
‘సల్మాన్ నా కెరీర్‌ను నాశనం చేశాడు’
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో పాతుకుపోయిన బంధుప్రీతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంగనా రనౌత్ లాంటి హీరోయిన్లు బహిరంగంగానే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ పలు సంచలన ఆరోపణలు చేశారు. సల్మాన్ ఖాన్, అతడి కుటుంబ సభ్యులు తన కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. ఫేస్బుక్ వేదికగా సుశాంత్ మృతికి సంతాపం తెలిపిన అభినవ్ కశ్యప్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. 2010లో సల్మాన్ కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దబాంగ్ చిత్రానికి అభినవ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సీక్వెల్‌కు కూడా అతనే దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. అందుకు సల్మాన్ సోదరులు అర్బాజ్, సోహైల్ ఖాన్‌లే కారణం అని అభినవ్ తెలిపారు. వారు తనిని బెదిరించడం ద్వారా సల్మాన్ సోదరులు తన కెరీర్‌ను నియంత్రించాడనికి ప్రయత్నించారని దబాంగ్ దర్శకుడు ఆరోపించారు. తాను అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో తన భవిష్యత్తును నాశనం చేసి సల్మాన్ ఖాన్ కుటుంబం ప్రతీకారం తీర్చుకున్నదని తెలిపారు. (నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!) 2013లో అభినవ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేషారం’. ఇదే అతడి ఆఖరి చిత్రం. ఈ చిత్రం విడుదలను ఆపేందుకు సల్మాన్, అతడి కుటుంబం అన్ని రకాల ప్రయత్నాలు చేశారని అభినవ్ ఆరోపించాడు. ‘నా శత్రువులు ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు వారి గురించి అందరికి తెలియాలి. వారు సలీం ఖాన్, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్’ అని ఆరోపించారు. అంతేకాక వారు తనను బెదిరిస్తూ మెసేజ్‌లు కూడా చేశారని తెలిపాడు. ఈ సుదీర్ఘమైన ఫేస్బుక్ పోస్ట్‌లో అభినవ్ టాలెంట్ మేనేజర్లు, ప్రొడక్షన్ హౌస్‌ల కుతంత్రాల గురించి వివరించారు. ‘వీరు తమ కంటూ ఓ కెరీర్‌ను ఏర్పర్చుకోరు. కానీ వారు మీ జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తారు’ అని చెప్పుకొచ్చారు. అంతేకాక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని తన పోస్టులో అభినవ్ ప్రభుత్వాన్ని కోరారు. (ముసుగులు తొలగించండి) -
నన్నే వద్దంటారా.. అయితే ఓకే!
చిన్న పాత్ర అయినా ఫర్వాలేదు, మీ సినిమాలో నటిస్తానని సల్మాన్‌ఖాన్ స్వయంగా బంపర్ ఆఫర్ ఇస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. సల్మాన్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అంతేకానీ, వద్దంటారా? చెప్పండి. సల్లూ భాయ్ తమ్ముడు సోహైల్ ఖాన్ మాత్రం అన్నయ్య ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారు. నవాజుద్ధీన్ సిద్ధిఖీ హీరోగా సోహైల్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ఫ్రీకీ అలీ’. ఈ స్క్రిప్ట్ సల్మాన్‌కి పిచ్చ పిచ్చగా నచ్చేయడంతో చిన్న పాత్రలో అయినా నటిస్తానని అడిగితే.. ‘‘నీ లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్‌కి సరిపడే క్యారెక్టర్ మా సినిమాలో లేదు. ఒకవేళ నిన్ను తీసుకుంటే స్టోరీ డిస్ట్రబ్ అవుతుంది. నువ్వు మాకొద్దు’’ అని అన్నయ్యతో సోహైల్ చెప్పారట. క్రేజ్ కంటే కథకు ప్రాముఖ్యం ఇస్తున్న తమ్ముణ్ణి సల్మాన్ అభినందించి, నన్నే వద్దంటారా.. అయితే ఓకే అని సరదాగా అన్నారట. అమీ జాక్సన్ హీరోయిన్గా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో సల్మాన్ ఇంకో తమ్ముడు అర్బాజ్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. -
నా తమ్ముడు అలా చేయడు: సల్మాన్ ఖాన్
ముంబై: జర్నలిస్టు పట్ల దరుసుగా ప్రవర్తించిన తమ్ముడు అర్బాజ్ ఖాన్ ను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వెనకేసుకొచ్చాడు. పెళ్లి వార్తల గురించి తన కుటుంబాన్ని వేధించొద్దని మీడియాను కోరారు. తన తమ్ముడు దురుసుగా ప్రవర్తించలేదని, అతడు ఎప్పుడూ అలా చేయడని అన్నాడు. తల్లిదండ్రులతో కలిసి బాంద్రాలోని ఓ హోటల్ కు గురువారం రాత్రి డిన్నర్ కు వెళ్లిన అర్బాజ్ ఖాన్ ను జర్నలిస్ట్ ఒకరు సల్మాన్ పెళ్లి గురించి అడిగాడు. దీంతో సహనం కోల్పోయిన అర్బాజ్.. జర్నలిస్ట్ పట్ల పౌరుషంగా ప్రవర్తించాడు. తన తమ్ముడు స్థానంలో ఎవరు ఉన్నా అలాగే చేస్తారని సల్మాన్ సమర్థించాడు. తన పెళ్లి వార్తల గురించి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల వెంట పడొద్దని విజ్ఞప్తి చేశాడు. తాను ఎప్పుడు పెళ్లి చేసుకునేది ట్విటర్ ద్వారా వెల్లడిస్తానని చెప్పాడు. ప్రియురాలు లులియాను పెళ్లాడేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నాడని బాలీవుడ్ లో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. దీనిపై సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. -
ఇక స్మాల్ స్క్రీన్!
వెండి తెరపై అవకాశాలు అడుగంటిపోయి... ఉక్కిరిబిక్కిరి అవుతున్నవారికి ఇప్పుడు వరంలా మారాయి బుల్లి తెర సీరియల్స్. తాజాగా మరో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ ఈ దారే పట్టాడు. వికాస్ బహ్ల్ రూపొందిస్తున్న టీవీ సిరీస్‌లో అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సిరీస్ ఫ్లోర్‌పైకి వెళ్లనుంది. ఓ ఫిల్మ్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథాంశంతో దీన్ని తీస్తున్నారనేది సమాచారం. బాలీవుడ్ స్టార్ కావాలని తీవ్రంగా శ్రమించే యువకుడి పాత్రలో సోహైల్ కనిపించనున్నాడు. ‘వికాస్ నాకు మంచి మిత్రుడు. అతడు చక్కని స్క్రిప్ట్‌తో వచ్చి నన్ను అడిగితే... కాదనలేక పోయా’ అన్నాడు సోహైల్. -
సొహైల్ కోచ్ సుశీల్
సల్మాన్‌ఖాన్ తమ్ముడు సొహైల్ ఖాన్ తాజా సినిమా కోసం ఒలింపిక్ పతక విజేత సుశీల్‌కుమార్ కూడా పని చేయనున్నాడు. ప్రముఖ రెజ్లర్ గామా పహిల్వాన్ జీవితం ఆధారంగా తీయబోయే సినిమా కాబట్టి కుస్తీపోటీల్లో సొహైల్‌కు శిక్షణ తప్పసరిగా మారింది. ఈ సినిమాను సల్లూభాయ్ స్వయంగా నిర్మిస్తుండగా, పునీత్ ఇస్సార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే సొహైల్ మూడునెలలపాటు రెజ్లింగ్‌లో సుశీల్ దగ్గర శిక్షణ తీసుకోనున్నాడు. సుశీల్ గురువు, అతని మామ సత్పాల్సింగ్ కూడా సొహైల్‌కు కొన్ని మెళకువలు నేర్పుతారు. ఈ సినిమా, పాత్ర కోసం సల్మాన్ తన తమ్ముడికి వ్యాయామం, ఆహారం గురించి చాలా విషయాలు చెబుతున్నాడు. గామా పహిల్వాన్ దాదాపు 99 కిలోల బరువుఉండేవాడు. ఆయన తగ్గట్టే సొహైల్ కూడా బరువు పెరుగుతున్నాడు. ఇప్పటి వరకు 15 కేజీలు పెరిగాడు. మరింత పెరగాలని అన్న సూచించాడు. ‘ఈ పాత్ర కోసం సొహైల్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. శరీరంలో కొంచెం కూడా కొవ్వు లేకుండా తయారయ్యాడు. ఫొటోలు కూడా చాలా బాగా వచ్చాయి. సినిమా షూటింగ్‌ను నవంబర్ నుంచి మొదలుపెడతాం. సుశీల్ దగ్గర శిక్షణ పూర్తయ్యాక, సొహైలే మాకు పోరాట సన్నివేశాల్లో సాయం కూడా చేస్తాడు. పహిల్వాన్ జీవితం, కవిత్వాన్ని అమితంగా అభిమానించడం, ప్రముఖ గాయకుడు బడే ఘులామ్ అలీఖాన్‌తో స్నేహం వంటి వాటిని ఈ సినిమాలో చూడవచ్చు’ అని పునీత్ వివరించాడు. సహాయ పాత్రల్లో కనిపించే రెజ్లర్ల కోసం పునీత్ దేశవ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహించనున్నాడు. సల్మాన్ కూడా కొందరు అంతర్జాతీయ రెజ్లర్లతో మాట్లాడుతున్నాడు. గామా పహిల్వాన్ దాదాపు ఐదు వేల మంది రెజ్లర్లను ఓడించాడు.