Sohail Khan Recalled About Heated Argument With Virat Kohli In 2015 WC, Details Inside - Sakshi
Sakshi News home page

కోహ్లితో నాడు వాగ్వాదం.. పాక్‌ బౌలర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు! బిడ్డా.. మీ బాపు అంటూ..

Published Thu, Feb 2 2023 5:16 PM | Last Updated on Thu, Feb 2 2023 6:36 PM

Sohail Khan Comments on Kohli Shakes Cricket Fraternity Beta Tera Baap - Sakshi

నాడు కోహ్లి- సొహైల్‌ వాగ్వాదం (PC: ICC)

Virat Kohli: వన్డే వరల్డ్‌కప్‌ 2015.. ఫిబ్రవరి 15.. అడిలైడ్‌ ఓవల్‌ మైదానంలో భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌.. చిరకాల ప్రత్యర్థుల పోరులో ఎప్పటిలాగే టీమిండియాదే పైచేయి.. ఈ విజయంలో ముఖ్యపాత్ర వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిది! 

రన్‌మెషీన్‌ కోహ్లి దెబ్బకు.. దాయాది శిబిరంలో పేసర్‌ సొహైల్‌ ఖాన్‌ తీసిన ఐదు వికెట్లకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 10 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చిన ఈ రైట్‌ ఆర్మ్‌ మీడియం పేస్‌ బౌలర్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనా, మహేంద్ర సింగ్‌ ధోని, అజింక్య రహానే వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

కీలక వికెట్లు తీసి సత్తా చాటినప్పటికీ కోహ్లి అద్భుత సెంచరీకి తోడు, రైనా 74 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు స్కోరు చేసింది టీమిండియా. భారత బౌలర్ల విజృ​ంభణతో చతికిలపడ్డ పాకిస్తాన్‌ 224 పరుగులకే కుప్పకూలి 76 పరుగుల తేడాతో చిత్తైంది. 

కోహ్లి- సొహైల్‌ వాగ్వాదం
అయితే, నాటి భారత్‌- పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి- సొహైల్‌ ఖాన్‌ మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఆ ఘటన గురించి గుర్తు చేసుకున్న సొహైల్‌ ఖాన్‌.. కోహ్లితో గొడవ సందర్భంగా అన్న మాటలు వివాదాస్పదంగా మారాయి.

బిడ్డా నువ్వు అండర్‌ 19లో ఆడుతున్నపుడే
నాదిర్‌ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సొహైల్‌.. ‘‘నేను బ్యాటిం‍గ్‌కి వెళ్లినపుడు.. విరాట్‌ కోహ్లి నా దగ్గరకొచ్చి.. కొత్తగా వచ్చావు.. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అన్నాడు. అప్పుడు నేను.. ‘‘కొడుకా(బిడ్డా).. నువ్వు అండర్‌ 19 క్రికెట్‌ ఆడుతున్నపుడు.. మీ బాపు (తనను తాను ఉద్దేశించి) టెస్టు క్రికెటర్‌ అని చెప్పాను’’ అన్నాడు. 

ఇక 2006 నుంచి తాను పాకిస్తాన్‌కు ఆడుతున్నానన్న సొహైల్‌.. గాయం కారణంగా కొన్నాళ్లు జట్టుకు దూరమైన విషయాన్ని చెప్పానన్నాడు. కాగా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన సొహైల్‌కు అనూహ్యంగా నాటి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది.

అంత గొప్పగా ఏం లేదు
ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌-2022లోనూ కోహ్లి ఒంటిచేత్తో పాక్‌తో మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో 19వ ఓవర్లో హారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిన సిక్స్‌ హైలైట్‌గా నిలిచింది. 

అయితే, సొహైల్‌ మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘హారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిందేమీ మరీ అంత చెప్పుకోదగ్గ షాట్‌ కాదు. తనకు బౌలర్‌ ఇచ్చిన అవకాశాన్ని కోహ్లి సద్వినియోగం చేసుకున్నాడు అంతే’’ అని పేర్కొన్నాడు. 

కింగ్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌
కాగా సొహైల్‌ ఖాన్‌ 2008 జనవరిలో జింబాబ్వేతో వన్డేతో అంతర్జాతీయ ‍క్రికెట్లో అడుగుపెట్టగా.. 2009లో శ్రీలంకతో మ్యాచ్‌లో టెస్టుల్లో పాక్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక కోహ్లి శ్రీలకంతో వన్డేలో 2008 ఆగష్టులో టీమిండియా తరఫున అరంగ్రేటం చేశాడు. 2011లో భారత్‌ తరఫున వెస్టిండీస్‌తో సిరీస్‌లో మొదటి టెస్టు ఆడాడు. ఇక సొహైల్‌ తాజా ఇంటర్వ్యూ నేపథ్యంలో కింగ్‌ కోహ్లి ఫ్యాన్స్‌ అతడిపై ఫైర్‌ అవుతున్నారు.

‘‘ఎప్పుడొచ్చామని కాదు.. ఎలా ఆడామన్నది ముఖ్యం. వయసు రాగానే సరిపోదు.. అందుకు తగ్గట్లు సంస్కారంగా ఉండటం నేర్చుకోవాలి. అవేవో గొప్ప మాటలు అయినట్లు మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నావా’’అని 38 ఏళ్ల సొహైల్‌కు చురకలు అంటిస్తున్నారు. కోహ్లి ముందు నువ్వు ఏమాత్రం పనికిరావంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్‌ రావాల్సిందే!
WC 2023: ప్రపంచకప్‌ టోర్నీ ‘అర్హత’ కోసం దక్షిణాఫ్రికా, లంక పోరు! ఆ సిరీస్‌ల ఫలితాలు తేలితేనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement