Virat kohli Completes 15 Years As International Cricketer: ‘‘ఆ మ్యాచ్ ఆసాంతం విరాట్ కోహ్లి గురించే చర్చ. క్రికెట్ దేవుళ్లు అతడు పని పూర్తి చేయాలని దీవించారు. అప్పటికి అతడు అత్యుత్తమ ఫామ్‌లో లేడు. సొంత ప్రేక్షకుల నుంచే విమర్శలు. మీడియా అయితే.. అతడి వెంట పడింది.
కానీ.. దేవుడు మాత్రం.. ఇది నీకై వేచిన వేదిక.. మునుపటి వైభవం అందుకో.. మళ్లీ రారాజుగా అవతరించు అని అతడిని ఆశీర్వదించినట్లుగా అనిపించింది. ఆరోజు మ్యాచ్ చూసిన వాళ్లకు విషయం అర్థమయ్యే ఉంటుంది. దాదాపు లక్ష మంది నేరుగా చూస్తుండగా.. 1.3 బిలియన్ల భారతీయులు, 30 కోట్ల మంది పాకిస్తానీలు ఆ అద్భుతాన్ని వీక్షించారు.
ఆ రెండు సిక్సర్లు మహాద్బుతం
క్రికెట్ ప్రపంచమంతా కోహ్లి ఆట కోసం ఎదురుచూసిన తరుణంలో.. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఆ రెండు సిక్సర్లు.. మహా అద్భుతం. అతడు తన రాజ్యంలోకి తిరిగి అడుగుపెట్టాడు. ఆరోజు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇలా జరగాలని అతడి విధిరాతలో రాసి ఉంది’’ అంటూ పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఆకాశానికెత్తాడు.
కోహ్లి ఎల్లప్పుడూ కింగ్ కోహ్లిగానే ఉంటాడంటూ రన్‌మెషీన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో పాకిస్తాన్‌పై పరుగుల యంత్రం అద్భుత ఇన్నింగ్స్‌ను ప్రస్తావిస్తూ తనదైన శైలిలో కొనియాడాడు. కాగా 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. పద్దెనిమిదేళ్ల వయసులో అరంగేట్ర మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన విఫలమైన ఈ అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్.. అంచెలంచెలుగా ఎదుగుతూ రికార్డుల రారాజుగా పేరొందాడు.
అయితే, ఆసియా టీ20 కప్-2022 ముందు వరకు కెరీర్‌లో తొలిసారి అత్యంత గడ్డుకాలం ఎదుర్కొన్న కోహ్లి.. ఈ మెగా ఈవెంట్ సందర్భంగా సెంచరీతో మునుపటి లయను అందుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్ వింటేజ్ కోహ్లిని గుర్తు చేసింది.
సెంచరీల వీరుడిపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ప్రశంసలు
మెల్‌బోర్న్ మ్యాచ్‌లో 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి పాక్‌పై భారత్ మరోసారి పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేశాడు.
నేటి(ఆగష్టు 18)తో కోహ్లి అంతర్జాతీయ కెరీర్‌కు 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.. ఈ మేరకు తమ జట్టుపై కోహ్లి విధ్వంసకర ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ అతడికి శుభాభినందనలు తెలియజేశాడు. కాగా కోహ్లి ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 76 సెంచరీలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్!
Comments
Please login to add a commentAdd a comment