ICC Mens T20 World Cup 2022 - India Vs Pakistan- Dead Ball Row: టీ20 వరల్డ్‌కప్-2022 సూపర్-12లో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా చర్చనీయాంశమైన ‘డెడ్ బాల్’పై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమకు అన్యాయం జరిగిందంటూ పాక్ అభిమానులు వాదిస్తుండగా.. సైమన్ టాఫెల్ వంటి దిగ్గజ అంపైర్.. నిబంధనల ప్రకారమే టీమిండియాకు మూడు పరుగులు వచ్చాయని ఇప్పటికే స్పష్టం చేశారు.
దీంతో ఈ ఆసీస్ అంపైర్ పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ మార్క్ టేలర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. కాగా పాక్‌తో ఆదివారం నాటి హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ నాలుగో బంతికి నవాజ్ వేసిన ఫుల్‌టాస్‌ను విరాట్ కోహ్లి డీప్ స్క్వేర్‌లో సిక్సర్‌గా మలిచిన విషయం తెలిసిందే.
దీనిని అంపైర్ ‘హైట్ నోబాల్‌గా’ ప్రకటించడంతో టీమిండియాకు 1 బంతికి 7 పరుగులు వచ్చాయి. అంతేకాకుండా రోహిత్ సేనకు ‘ఫ్రీ హిట్’ ఛాన్స్ కూడా దొరికింది. ఆ క్రమంలో విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారగా.. నవాజ్ వైడ్ వేయడంతో.. ఫ్రీ హిట్ సజీవంగా నిలిచింది. అయితే, ఈ ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యాడు.
నిజానికి ‘ఫ్రీ హిట్’పై కేవలం రనౌట్ అయితేనే అవుట్‌గా పరిగణిస్తారు. వికెట్లకు తగిలిన బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లగానే. కోహ్లి, దినేశ్ కార్తిక్ 3 ‘బై’ పరుగులు తీశారు. కానీ, చాలా మంది ఈ మూడు పరుగులు ఎలా ఇస్తారు? అంటూ డెడ్‌బాల్ అంశంపై చర్చ లేవనెత్తారు.
ఇలా చేస్తే సరి!
ఈ విషయంపై మార్క్ టేలర్ తన స్పందన తెలియజేశాడు. వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ షోలో అతడు మాట్లాడుతూ.. ఇలాంటి సందర్భాల్లో బ్యాటింగ్ జట్టుకు లాభం చేకూరేలా నిర్ణయం ఉండకూడదని అభిప్రాయపడ్డాడు. ‘‘నిజానికి ఒకవేళ బంతి స్టంప్స్‌ను తాకినా అవుట్ కాకుండా ఉండటమే అనైతికంగా లాభం పొందడం లాంటిది. ఆదివారం రాత్రి విచిత్ర పరిస్థితిని మనం చూశాం.
బంతి ఎక్కడున్నా సరే.. ఒకవేళ ఫీల్డింగ్ జట్టు బ్యాటర్‌ను రనౌట్ చేయాలనుకుంటే అప్పటికే బెయిల్స్ కిందపడిపోయి ఉంటాయి. అలాంటప్పుడు స్టంప్‌ను రిమూవ్ చేయాలి. అలా చేయడం కష్టమన్న విషయం తెలిసిందే. నా అభిప్రాయం ప్రకారం.. ఫ్రీ హిట్ బంతికి ఒకవేళ బ్యాటర్ బౌల్డ్ అయినా క్యాచవుట్ అయినా.. ఎప్పటిలాగే అతడిని నాటౌట్‌గానే ప్రకటించాలి.
అయితే, ఆ బాల్‌ను మాత్రం డెడ్‌బాల్‌గా పరిగణించాలి. ఆదివారం నాటి సందర్భాల్లో ఇలా చేయడం న్యాయమైనది. హేతుబద్ధంగా కూడా ఉంటుంది. ఫ్రీ హిట్‌కు బ్యాటర్ అవుట్ కాకుండా ఉంటాడు.. అదే సమయంలో రెండోసారి అతడికి ఫేవర్‌గా అంపైర్ నిర్ణయం తీసుకోలేడు’’ అంటూ క్రికెట్ చట్టాల్లోని రూల్స్ మార్చాలంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా వరుసగా రెండోసారి
ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్‌లో శుభారంభం చేసింది. తదుపరి గురువారం(అక్టోబరు 27) సిడ్నీలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 56 పరుగులతో చిత్తు చేసి రెండో విజయం నమోదు చేసింది.
చదవండి: నన్ను GOAT అని పిలవకండి.. ఆ ఇద్దరే అందుకు అర్హులు: విరాట్ కోహ్లి
Ind Vs Ned: పాక్‌తో అయినా.. పసికూనతో అయినా నీ ఆట తీరు మారదా? అదేం కాదు!
Comments
Please login to add a commentAdd a comment