బాయ్‌కాట్‌ సల్మాన్‌ | Dabangg director Abhinav Kashyap blames Salman for ruining his career | Sakshi
Sakshi News home page

బాయ్‌కాట్‌ సల్మాన్‌

Published Wed, Jun 17 2020 3:02 AM | Last Updated on Wed, Jun 17 2020 11:14 AM

Dabangg director Abhinav Kashyap blames Salman for ruining his career - Sakshi

‘‘నా శత్రువులు చాలా చురుకైనవాళ్లు. చాకచక్యంగా నా వెనక నుంచి నాపై దాడి చేస్తారు. కానీ పదేళ్ల తర్వాత నా శత్రువులు ఎవరో నేను తెలుసుకోగలిగాను. వాళ్లెవరంటే సలీం ఖాన్‌ (రచయిత–నటుడు, సల్మాన్‌ ఖాన్‌ తండ్రి), సల్మాన్‌ ఖాన్, సల్మాన్‌ సోదరులు అర్భాజ్‌ ఖాన్, సొహైల్‌ ఖాన్‌. ఇంకా వెన్నుపోటు పొడిచినవాళ్లు ఉన్నారు. కానీ ఈ విషపూరిత సర్పానికి సల్మాన్‌ కుటుంబం అధిపతి. డబ్బు, రాజకీయ పలుకుబడి, అండర్‌వరల్డ్‌ కనెక్షన్లతో వాళ్లు ఎవరినైనా ఏమైనా చేయగలుగుతారు. దురదృష్టం ఏంటంటే నావైపు ‘నిజాయితీ’ మాత్రమే ఉంది.

అయితే నేను సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌లా జీవితాన్ని చాలించను. తలవంచేది లేదు. ఎదురు నిలబడి పోరాడతా. ఒకటీ వాళ్ల అంతం చూస్తా.. లేకపోతే నా అంతం అయినా చూస్తా. ఇక భరించింది చాలు. మళ్లీ పోరాడే సమయం ఆసన్నమైంది’’ అని హిందీ దర్శకుడు అభినవ్‌ కశ్యప్‌ మంగళవారం తన ఫేస్‌బుక్‌లో సుదీర్ఘంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి హిందీ పరిశ్రమలో అతనికి ఎదురైన చేదు అనుభవాలు ఒక కారణం అనేది పలువురి అభిప్రాయం. అభినవ్‌ కశ్యప్‌ కూడా ఆ మాటే అంటున్నారు.

ఇది ‘మీటూ’ ఉద్యమం అంత పెద్దది
‘‘ప్రభుత్వానికి ఓ విన్నపం. సుశాంత్‌ మరణానికి గల కారణాలను సునిశితంగా పరిశోధించాలి. మేం చాలామంది ఎదుర్కొంటున్న చాలా సమస్యలను సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య బయటకు తీసుకొస్తోంది. ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించే సమస్యలవి. సుశాంత్‌ మరణం అనేది ఒక మచ్చు తునక అనే భయం వేస్తోంది. ఇది (నెపోటిజమ్‌ – బంధుప్రీతి) ‘మీటూ’ ఉద్యమం అంత పెద్దది. సుశాంత్‌ మరణానికి ‘వైఆర్‌ఎఫ్‌’ టాలెంట్‌ మ్యానేజ్‌మెంట్‌ ఏజెన్సీ ముఖ్య కారణం. ఈ టాలెంట్‌ ఏజెన్సీ వాళ్లు మన కెరీర్‌ని బిల్డ్‌ చేయరు.. కెరీర్‌తో పాటు జీవితాలను కూడా నాశనం చేసేస్తారు.

పదేళ్లుగా ఇబ్బందిపడుతున్న వ్యక్తిగా చెబుతున్నా.. బాలీవుడ్‌కి చెందిన ప్రతి టాలెంట్‌ మ్యానేజర్, టాలెంట్‌ మ్యానేజ్‌మెంట్‌ ఏజెన్సీలు  ఆర్టిస్ట్‌లకు ఓ ‘డెత్‌ ట్రాప్‌’లాంటివి. ఈ మ్యానేజర్లు, ఏజెన్సీలు అవకాశాలిప్పిస్తామని ఇండస్ట్రీకి సంబంధంలేనివాళ్లను నమ్మిస్తారు. బాలీవుడ్‌లో జరిగే పార్టీలకు వాళ్లను ఆహ్వానిస్తారు. అయితే అక్కడ వీరిని చాలా దారుణంగా ట్రీట్‌ చేస్తారు. అప్పుడు వీళ్లకు ఓ అభద్రతాభావం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అప్పుడు ఈ క్యాస్టింగ్‌ డైరెక్టర్లు మేం కాపాడతామంటూ కొన్నేళ్ల పాటు తమ ఏజెన్సీతో కలిసి పని చేస్తామని ఒప్పందపత్రంలో సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తారు.

ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఒక్కసారి ఒప్పందం కుదిరాక ఇక వాళ్లకు ఏ హక్కూ ఉండదు. కెరీర్‌కి సంబంధించిన నిర్ణయాలు వాళ్ల చేతిలో ఉండవు. కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్న కార్మికుడిలా తక్కువ పారితోషికానికి పని చేయాలి. పోనీ ఎలాగోలా ఈ ఏజెన్సీ నుంచి తప్పించుకుని ‘రేపు’ బాగుంటుందనే నమ్మకంతో వేరే ఏజెన్సీ దగ్గరికి వెళితే ఆ ‘రేపు’ఎప్పటికీ రాదు. ఇలాంటి అనుభవాలు నేను చాలా ఎదుర్కొన్నాను. అర్బాజ్‌ ఖాన్‌ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. ‘దబాంగ్‌’ (2010) సినిమాకి దర్శకత్వం వహించిన పదేళ్లకు నా అనుభవాలను ఇప్పుడు చెప్పబోతున్నాను.

‘దబాంగ్‌’ తర్వాత ‘దబాంగ్‌ 2’ ఒప్పుకుని ఆ సినిమా నుంచి నేను తప్పకోడానికి కారణం అర్భాజ్‌ ఖాన్, సొహైల్‌ ఖాన్‌ మరియు అతని కుటుంబం. నా కెరీర్‌ని కంట్రోల్‌ చేయడానికి వాళ్లు ట్రై చేశారు. నా రెండో చిత్రాన్ని శ్రీ అష్టవినాయక ఫిలింస్‌ సంస్థతో చేయడానికి సైన్‌ చేశాను. కానీ ఆ సంస్థ అధినేత రాజ్‌ మెహతాకి ఫోన్‌ చేసి, ‘అతనితో సినిమా చేస్తే జాగ్రత్త’ అని బెదిరించారు. దాంతో నేను తీసుకున్న అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత వయాకామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ సంస్థ అధినేత విక్రమ్‌ మల్హోత్రాకి ఫోన్‌ చేసి, బెదిరించారు. దాంతో తీసుకున్న 7 కోట్ల రూపాయల అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వడంతో పాటు 90 లక్షలు వడ్డీ కూడా ఇవ్వాల్సి వచ్చింది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సపోర్ట్‌ వల్ల ‘బేషరమ్‌’ (2013) సినిమాకి దర్శకత్వం వహించగలిగాను. అయితే ఆ సినిమా విడుదలకు ముందు సల్మాన్‌ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. దాంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనడానికి భయపడ్డారు. కానీ రిలయన్స్, నేను ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నవాళ్లం కాబట్టి సొంతంగా సినిమాని విడుదల చేయాలనుకున్నాం. అప్పుడు అసలు యుద్ధం మొదలైంది.

నా శత్రువులు బాక్సాఫీస్‌ దగ్గర నా సినిమా పరాజయం పాలు కావడానికి సినిమా గురించి నెగటివ్‌ ప్రచారం చేశారు. అయితే థియేటర్ల నుంచి ఎత్తేసే నాటికి నా సినిమా 58 కోట్లు వసూలు చేసింది. శాటిలైట్‌ రైట్స్‌ విషయంలో ఇబ్బందిపెట్టారు. ఇక ఆ తర్వాత నా ప్రతి ప్రయత్నాన్ని చెడగొట్టే పనులు చేశారు. నన్ను బెదిరించారు. నా కుటుంబంలో ఉన్న స్త్రీలను అత్యాచారం చేస్తామని బెదిరించారు. దాంతో నా మానసిక ఆరోగ్యం దెబ్బతింది. చివరికి 2017లో నా భార్య, నేను విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత కూడా నన్ను వదిలిపెట్టలేదు. బెదిరిస్తూ మెసేజ్‌లు పంపించారు. పోలీస్‌ స్టేషన్‌కి వెళితే ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించారు. నా శత్రువులు చాలా చురుకైనవాళ్లు. వెనక నుండి నాపై దాడి చేస్తున్నారు. నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఇక సహించేది లేదు. ఓపెన్‌గా చాలెంజ్‌ చేస్తున్నాను.

అమాయకులు బలి కాకూడదు
సుశాంత్‌ సింగ్‌ వెళ్లిపోయాడు. కానీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాడని అనుకుంటున్నాను. కానీ అలాంటి అమాయకులు ఇక బాలీవుడ్‌లో బలి కాకూడదు. ఇబ్బంది పడుతున్న నటీనటులు, క్రియేటివ్‌ పీపుల్‌ నా ఈ పోస్ట్‌ని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తారని అనుకుంటున్నాను. దయచేసి షేర్‌ చేయండి’’ అంటూ ‘మీటూ బాయ్‌కాట్‌ సల్మాన్‌ఖాన్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ముగించారు అభినవ్‌ కశ్యప్‌.


కాగా నో స్మోకింగ్, బాంబే వెల్వెట్, రమణ్‌ రాఘవ్, మన్‌మర్జియాన్‌.. ఇలా ఓ 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ సోదరుడు అభినవ్‌ కశ్యప్‌. తన సోదరుడు అభినవ్, సల్మాన్‌ ఖాన్‌కి మధ్య జరుగుతున్న వివాదం గురించి తాను స్పందించదలచుకోలేదని అనురాగ్‌ తన ట్వీటర్‌ ద్వారా పేర్కొన్నారు. ‘‘ఈ విషయం గురించి మాట్లాడటానికి మీడియావారు నాకు ఫోన్‌ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే తన విషయంలో నన్ను జోక్యం చేసుకోవద్దని అభినవ్‌ చాలా స్పష్టంగా చెప్పేశాడు. అందుకని తను చేస్తున్నవాటికి, చెబుతున్నవాటి గురించి నేను స్పందించలేను’’ అని అనురాగ్‌ ట్వీట్‌ చేశారు.

చిత్రపరిశ్రమ మేల్కొనాల్సిన సమయం ఇది
– నటుడు వివేక్‌ ఒబెరాయ్‌
‘‘సుశాంత్‌ తండ్రి కళ్లల్లో బాధ చూస్తుంటే భరించలేని విధంగా ఉంది’’ అంటూ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ తన ట్వీటర్‌ ద్వారా కొన్ని విషయాలు పంచుకున్నారు. చిత్రపరిశ్రమ మేల్కొనాల్సిన సమయం ఇది అని వివేక్‌ చెబుతూ – ‘‘ప్రతిభను ప్రోత్సహించే దిశగా సినిమా పరిశ్రమ అడుగులు వేయాలి కానీ ప్రతిభను నాశనం చేసే దిశగా కాదు. నా ఈ ప్రయాణంలో నేను కూడా ఎన్నో బాధలు అనుభవించాను. ఆ బాధలు చెప్పి సుశాంత్‌ బాధని తగ్గించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది.

మన ప్రయాణం చీకటిలో కొనసాగవచ్చు లేదా ఒంటరి ప్రయాణం కావొచ్చు. కానీ మరణం దానికి పరిష్కారం కాదు. ఆత్మహత్య పరిష్కారం కానే కాదు.  సుశాంత్‌ తన కుటుంబం, స్నేహితులు, లక్షలాది మంది అభిమానుల గురించి ఆలోచించడం మానేశాడనుకుంటున్నాను. అందుకే ఈరోజు అతన్ని మనం కోల్పోయాం. అతని తండ్రి బాధ వర్ణనాతీతం. ఇక సుశాంత్‌ అక్క అయితే ‘వెనక్కి వచ్చెయ్‌’ అంటూ కన్నీటి పర్యంతం కావడం నన్ను కలచివేసింది. సుశాంత్‌ మరణం సినిమా పరిశ్రమకు ఓ మేలుకొలుపు లాంటిది’’ అన్నారు.

– డి.జి.భవాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement