సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్
‘ఐ వాన్న ఫాలో ఫాలో ఫాలో యు...’ అంటూ ‘నాన్నకు ప్రేమతో’లో రకుల్ ప్రీత్‌సింగ్‌ని ఫాలో అవుతూ పాడతారు ఎన్టీఆర్. సోషల్ మీడియాలో కూడా తమ అభిమాన తారలను అలానే ఫాలో అవుతుంటారు ఫ్యాన్స్. ‘ఐ వాన్న ఫాలో ఫాలో యు’ అంటూ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ని, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌ని, క్యూట్ గాళ్స్ సోనమ్ కపూర్, ఆలియా భట్, అనన్యా పాండేలను చాలామంది ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు అదే అభిమానులు ‘ఐ వాన్న అన్‌ఫాలో యు’ అంటున్నారు. దాంతో సామాజిక మాధ్యమంలో వీళ్లంతా లక్షలాది మంది ఫ్యాన్స్‌ను కోల్పోతే కంగనా రనౌత్ ఫాలోయర్స్ సంఖ్య మాత్రం పెరిగింది. దీనికి కారణం ఇటీవల చనిపోయిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.
బాలీవుడ్‌లో వారసులకే ప్రాధాన్యం ఇస్తారని, బంధుప్రీతి బాగా చూపిస్తారని, సుశాంత్ ఆత్మహత్యకు కారణం ఇదేననే వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ఇండస్ట్రీలో ‘నెపోటిజమ్’ తారాస్థాయిలో ఉందని కంగనా వీడియో కూడా రిలీజ్ చేశారు. అప్పటినుంచీ కంగనా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య పెరిగింది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి విజయాలతో దూసుకెళుతోన్న కంగనా ఇన్‌స్టా ఫాలోయర్స్ అమాంతంగా 20 లక్షలు పెరిగారు. అయితే కంగనా తరఫున ఆమె టీమ్ ఈ అకౌంట్‌ని హ్యాండిల్ చేస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన ‘రాబ్తా’ సినిమాలో నటించిన కృతీ సనన్ అతను చనిపోయాక ‘నాలో సగ భాగాన్ని కోల్పోయినట్లనిపిస్తోంది’ అని తన బాధను వ్యక్తం చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3 లక్షలమంది ఫాలోయర్స్ పెరిగారు.
ఆలియా భట్, కృతీ సనన్
సల్మాన్ ఖాన్ కుటుంబం తనను టార్చర్ పెడుతోందని దర్శకుడు అభినవ్ కశ్యప్ రాసిన లెటర్, సల్మాన్ కూడా వారసులను ప్రోత్సహిస్తాడని పలువురు పేర్కొనడంతో ఈ కండలవీరుడు భారీ స్థాయిలో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. దాదాపు పది లక్షల మంది వరకూ సల్మాన్‌ని అన్‌ఫాలో అయ్యారు. స్టార్ కిడ్స్‌కి అవకాశాలు ఇస్తూ, సినిమాలు నిర్మిస్తాడనే అభిప్రాయం కారణంగా కరణ్ జోహార్‌ని దాదాపు రెండు లక్షల యాభై వేల మంది అన్‌ఫాలో అయ్యారు. ఇక స్టార్ కిడ్స్ సోనమ్ కపూర్ రెండున్నర లక్షలమందిని, ఆలియా భట్ దాదాపు ఐదు లక్షలమందిని కోల్పోయారు.
సోనమ్ కపూర్, ఆలియా భట్
అయితే మరో స్టార్ కిడ్ శ్రద్ధాకపూర్‌కి ఫాలోయర్లు పెరగడం విశేషం. సుశాంత్ అంత్యక్రియలకు శ్రద్ధా హాజరై, నివాళులర్పించింది. ఆమెకు 3 లక్షల మంది ఫాలోయర్స్ పెరగడానికి ఇదొక కారణం. ఇక ప్రముఖ నటుడు చంకీ పాండే వారసురాలిగా ఆయన కుమార్తె అనన్యా పాండే కూడా ఆగ్రహానికి గురైనవారి జాబితాలో ఉంది. గత ఏడాది కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ ద్వారా కథానాయికగా పరిచయమైంది అనన్య. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ ద్వారా తెలుగుకి పరిచయం కానుంది. ఆమెను 70 వేల మంది అన్‌ఫాలో అయ్యారు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇతరుల ఫాలోయర్స్ సంఖ్య కూడా తగ్గుతోంది.
శ్రద్ధాకపూర్, అనన్యా పాండే
స్టార్ హీరోలకు అభిమానుల సంఖ్య తగ్గితే అది కచ్చితంగా వారి సినిమాల వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుంది. థియేటర్లు రీ ఓపెన్ అయిన వెంటనే సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమా వసూళ్లను బట్టి ఇన్‌స్టాగ్రామ్ అన్‌ఫాలోయర్స్ ప్రభావం బాక్సాఫీస్ మీద పడిందా? లేదా అని తెలుస్తుంది. ఇక హీరోయిన్లంటే కేవలం వాళ్లు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పుడే వసూళ్ల ప్రభావం ఎంతో తెలుస్తుంది. ఆలియా భట్ ప్రస్తుతం ‘గంగూభాయ్ కతియావాడి’ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ కిడ్ అనే ట్యాగ్ ఆమె మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ సినిమా వసూళ్లు చెప్పేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment