ప్రత్యామ్నాయమే మార్గం
చినుకు పడితే జొన్న, సజ్జ, అలసంద, పెసర, కొర్ర సాగుకు అనుకూలం
ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డి.సంపత్‌కుమార్ సూచన
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత ఖరీఫ్‌లో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి లాంటి ప్రధాన పంటల సాగుకు గడువు ముగియడంతో ఇక ప్రత్యామ్నాయ పంటలే మార్గమని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. వర్షం వస్తే పొలాలు బీళ్లుగా ఉంచకుండా జొన్న, కొర్ర, సజ్జ, అలసంద, పెసర లాంటి పంటల సాగు చేపట్టాలని సూచిస్తున్నారు.
జొన్న : ఎస్‌వీ–1, పాలెం–2, సీఎస్‌వీ–10, సీఎస్‌వీ–11, సీఎస్‌వీ–15, ఎన్‌టీజే–1, 2, 3, ఎన్–13, 14, ఎస్‌వీ–56 సూటి రకాలు అనువైనవి. అలాగే హైబ్రీడ్ రకాలైన సీఎస్‌హెచ్–10, సీఎస్‌హెచ్–11, సీయస్‌హెచ్–16, సీఎస్‌హెచ్–18, సీఎస్‌హెచ్–21 అనువుగా ఉంటాయి. ఎకరాకు 3 నుంచి 4 కిలోలు. విత్తే ముందు 3 గ్రాములు థైరామ్ లేదా కాప్టాన్‌తో విత్తనశుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు (సెం.మీ) అంటే ఒకటిన్నర అడుగు, మొక్కల మధ్య 12–15 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి.
సజ్జ : సజ్జలో అధిక దిగుబడి ఇచ్చే సూటి లేదా కాంపోజిట్ రకాలైన ఐసీటీపీ–8203, ఐసీఎంవీ–221, రాజ్–171 అనువుగా ఉంటాయి. హైబ్రీడ్ రకాలైన హెచ్‌హెచ్‌బీ–67, ఐసీఎంహెచ్–356, ఆర్‌హెచ్‌బీ–121, జీహెచ్‌బీ–538, పీహెచ్‌బీ–3 అనువుగా ఉంటాయి. ఎకరాకు 1.6 కిలోల విత్తనం అవసరం. విత్తే ముందు 2 శాతం (20 గ్రాములు ఒక లీటర్ నీటికి) ఉప్పు ద్రావణంలో ముంచాలి. ఇలా చేయడం వల్ల ‘ఎర్గాట్’ అనే శిలీంద్ర అవశేషాలను వేరుచేయవచ్చు. అరిన తరువాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి. సాళ్ల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 12–15 సెం.మీ దూరంలో విత్తుకోవాలి.
కొర్ర : కోతకు 80 నుంచి 85 రోజుల్లో వచ్చే కొర్ర రకాలైన కృష్ణదేవరాయ, నరసింహరాయ, శ్రీలక్ష్మి, ఎస్‌ఐఏ–3085 రకాలు అనువుగా ఉంటాయి. అలాగే 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వచ్చే ప్రసాద్, సూర్యనంది (ఎస్‌ఐఏ–3088). సూర్యనంది రకం తక్కువ సమయంలో కోతకు రావడమే కాకుండా అధిక దిగుబడులు (ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు) సామర్థ్యం కలిగిన రకం. సాళ్లలో విత్తితే ఎకరాకు 2 కిలోలు, వెదజల్లే పద్ధతికి అయితే 4 కిలోలు అవసరం. కిలో విత్తనానికి 2 గ్రాములు కార్బండిజమ్‌తో విత్తనశుద్ధి చేయాలి. సాళ్ల మధ్య 25 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ ఉండేలా విత్తుకోవాలి.
అలసంద : తక్కువ పంటకాలం కలిగిన పశుగ్రాసం, పచ్చికాయ, గింజలకు ఉపయోగపడే వర్షాధారపు పప్పుజాతి పంట. కో–702, జీసీ–3, కో–4 రకాలు అనువైనవి. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరం. వరుసల మధ్య 30 నుంచి 45 సెం.మీ ఉండేలా విత్తుకోవాలి.
పెసర : పెసర పంట వేసే రైతులు పల్లాకుతెగులు (ఎల్లోమొజాయిక్ వైరస్) సోకకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. విత్తేముందు కాన్ఫిడార్‌తో విత్తనశుద్ధి చేయడం వల్ల రసంపీల్చు పురుగులు ముఖ్యంగా తెల్లదోమను అరికట్టవచ్చు. పొలం చుట్టూ జొన్న, సజ్జ పంటలను నాలుగైదు వరుసలు మేరసాళ్లుగానూ లేదా అంతర పంటలుగా వేసుకున్నా ఈ తెగులును సమర్థవంతంగా నివారించవచ్చు. మొలకెత్తిన 10 రోజుల తర్వాత రెండు మూడు సార్లు వేపనూనే పిచికారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.