అబ్దుల్లాకు జరిగిన నమ్మక ద్రోహం
అమర్జీత్ సింగ్ దులత్ పుస్తకం జమ్ము –కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లాను ఎందుకంత తీవ్రంగా బాధించిందో అర్థం కాని విషయం. ఆర్.ఏ. డబ్ల్యూ(రా) మాజీ ఉన్నతాధికారి దులత్ ఆయన మీద రాసిన ‘ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై’ పుస్తకం ఏమీ ఫరూఖ్‌కు తెలియకుండా వెలువడలేదు. ‘‘ఫరూఖ్ అబ్దుల్లా మీద నా అవగాహనతో రాసిన నా కథ’’ అని రచయిత ముందుమాటలో చెప్పుకొన్న ఈ రచనకు ఫరూఖ్ మద్దతు ఉంది. దాని గురించి వారిద్దరూ ‘‘అనేకసార్లు మాట్లాడుకున్నారు.’’ ఆయన ‘‘కరో నా (కానీయ్)’’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే పుస్తకం వెలుగు చూసింది. కానీ పుస్తకం బయటకు వచ్చాక ఫరూఖ్ ఎంతో నొచ్చుకున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఈ పుస్తకం ఒక ప్రశంసా గీతిక అనేది సత్యం. ‘నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అంటే ఫరూఖ్ అబ్దుల్లానే అనీ, ఆయన లేకపోతే ఎన్సీ ఎక్కడ ఉండేదో ఊహించలేమనీ పుస్తకం చెబుతుంది. అంతటి తోనే ఆగదు. ‘‘డాక్టర్ సాహిబ్ కేవలం ముఖ్యమంత్రి కారు, ఆయనే కశ్మీర్’’ అని తేల్చిచెప్తుంది. ఫరూఖ్ తన తండ్రి షేక్ అబ్దుల్లా కంటే గొప్ప వ్యక్తి అనీ, బహుశా ఆయనే నేడు దేశంలో అత్యున్నత నాయ కుడు అనీ దులత్ ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ ప్రశంస అతిశయోక్తి. కానీ, దులత్ దృష్టిలో అక్షర సత్యం.ఫరూఖ్ ఎదుర్కొన్న పలు సంక్షోభాల గురించి ఈ పుస్తకం చెబుతుంది. ఫరూఖ్ ‘‘శ్రీనగర్‌కు ఢిల్లీకి నడుమ వారధిగా ఉండాలని కోరుకున్నారు... ఆయన రాజకీయాల్లో ఉన్నది ఢిల్లీతో కలిసి పని చేయడానికే గానీ, వ్యతిరేకంగా కాదు.’’ కానీ సమస్య ఏమిటంటే, ఢిల్లీ ఆయన ఆలోచనను గ్రహించలేక పోయింది. ‘‘ఫరూఖ్ అబ్దుల్లాను, ఆయన ఆశయాలను ఢిల్లీ ఏనాడూ అర్థం చేసుకోలేదు... దేశ రాజధానికి అంతు చిక్కనిది ఏదో ఆయనలో ఉంది.’’ ఇది ఒక పార్శ్వమైతే, రెండోది – కశ్మీరు ప్రజలతోనూ ఆయన సంబంధాలు. అవి ఏనాడూ సవ్యంగా లేవు. ఢిల్లీ మీద కశ్మీర్ ప్రజలకు విశ్వాసం లేదు. ‘‘ఢిల్లీతో ఏ మాత్రం సంబంధం ఉన్నా సరే ఆ వ్యక్తులను, సంస్థలను వారు అనుమానిస్తారు.’’ ఈ క్రమంలో ‘‘ఇండియా పట్ల విధేయత కారణంగా ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబం కశ్మీరు పౌరుల ఆగ్రహానికి గురైంది.’’ ఫరూఖ్ అబ్దుల్లా అడకత్తెరలో పోకచెక్క అయ్యారు. ఢిల్లీకిచేరువ కావడం కోసం ఆయన ప్రయత్నించారు. కాని అక్కడ ఆయనకు పూర్తి ఆదరణ లభించలేదు. ఇక తాను దేని కోసం తపన పడుతున్నదీ తన సొంత ప్రజలకు అర్థం కాలేదు. వారి నుంచిమద్దతుకు బదులుగా అనుమానం, ఆగ్రహం ఎదుర్కోవలసివచ్చింది.కశ్మీరు రాజకీయాలను మిగతా దేశం నుంచి విడదీసిన క్లిష్ట సమస్య ఏమిటో దులత్ బాగానే అర్థం చేసుకున్నారు. ‘‘కశ్మీరు నాయ కులు కశ్మీరులో ఒక విధంగా మాట్లాడతారు, ఢిల్లీ వెళ్లి అక్కడ వేరేలా మాట్లాడతారు’’ అని ఆయన వివరించారు. ఆయన ఈ రెండు నాలుకల వైఖరిని కపటత్వంలా కాకుండా ‘ఫ్రెంచి భాష’లో పేర్కొనే ఒక రకమైన సభ్యతగా భావిస్తారు. వారున్న పరిస్థితిలో మనుగడ కోసం అలా మాట్లాడక తప్పదు. అది అవకాశ వాదం కాదు.దులత్ కథనం ప్రధానంగా ఫరూఖ్ అబ్దుల్లా ఎదుర్కొన్న మూడు నమ్మక ద్రోహాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన 370వ అధికరణం రద్దు వాటిలో ఒకటి. దులత్ దీన్ని సరిగ్గా చెప్పలేక పోయారు. అది వేరే విషయం. మిగిలిన రెండూ ఫరూఖ్ మెచ్చేలానే రాశారు.మొట్టమెదటి ద్రోహం – 1984లో ఒక అర్ధరాత్రి జరిగింది.ఇందిరా గాంధీ ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి కూలదోశారు. అది ఆయన మనసులో మానని గాయాన్ని మిగిల్చింది. ‘‘... ఆయన దీన్నుంచి కోలుకున్నారని నేననుకోవడం లేదు’’ అని ఇందిరను తీవ్రంగా దుయ్యబడుతూ దులత్ వ్యాఖ్యానించారు. దీంతో ఫరూఖ్ విభేదిస్తారని నేను అనుకోను. రెండోది – 2002 నాటిది. వాజ్‌పేయి, అద్వానీ కలిసి ఫరూఖ్‌కు ఉప రాష్ట్రపతి పదవి వాగ్దానం చేశారు. అయితే, వారు తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేక పోయారు. వారి వాగ్దానానికి ‘‘ఫరూఖ్ఉప్పొంగిపోయారు... ఏదో ఒక రోజు భారత రాష్ట్రపతి కావాలన్నది ఆయన జీవితాశయం. దానికి ఇది తొలి మెట్టు అను కున్నారు.’’ దులత్, ఫరూఖ్ స్నేహబంధం ఇప్పుడు చిక్కులు ఎదుర్కొంటున్నా అది తెగేది కాదు. దులత్ తమను కలిపి ఉంచే ఆ బంధంపై ఇలా అంటారు. ‘‘డాక్టర్ సాహిబ్ నన్ను ఎంత నమ్మారో నేను ఎప్పటికీ తెలుసుకోలేను – ఆయన గురించి నాకు ఎంత తెలుసో ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.’’ఏమైనప్పటికీ, దులత్ అవగాహనలో లోపాలు స్పష్టంగా కనబడతాయి. లేనట్లయితే, తనను విశ్వాసంలోకి తీసుకుని ఉంటే 370వ అధికరణం రద్దు విషయంలో సాయం అందించడానికి ఫరూఖ్ అబ్దుల్లా సుముఖమే అనే ఆరోపణ మీద దురదృష్టకరమైన ఈ వివాదం తలెత్తేదే కాదు. తన పుస్తకం మొదటి అధ్యాయంలోనే దులత్ ఇంతటి కీలకాంశం లేవనెత్తడం హాస్యాస్పదం.‘‘ఫరూఖ్ మూడు దశాబ్దాలుగా నాకు తెలిసి ఉన్నా, నాకు ఆయన నిజంగా తెలుసు అని పూర్తి నమ్మకంగా ఏనాడూ చెప్పలేను. అదీ డాక్టర్ సాహిబ్ అనే ప్రహేళిక. ఆయన్ను తెలుసుకోవడం అంత సులభం కాదు.’’ గత వారం తలెత్తిన వివాదం, దులత్ చెప్పిన అంశాన్నే విషాదకరంగా రుజువుచేసింది.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-కరణ్ థాపర్