Amboseli National Park
-
లొకేషన్ వేటలో రాజమౌళి..!
కెన్యాలో లొకేషన్ వేట ఆరంభించారు రాజమౌళి. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసిన రాజమౌళి లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో రాజమౌళి ఉన్నారు. కెన్యా, ఆఫ్రికా లొకేషన్స్‌లో కొన్ని లొకేషన్స్‌ని ఎంపిక చేసి, తొలి షెడ్యూల్‌ని అక్కడే ఆరంభిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకు ‘మహారాజా’, ‘మహారాజ్’ అనే టైటిల్స్‌ను అనుకుంటున్నారని, 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓ నిధి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందనీ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
మనుషుల శబ్దాలను డీకోడ్ చేస్తాయట!
వాషింగ్టన్: వినిపించే శబ్దాలను బట్టి.. ప్రమాదాలను గుర్తించడం జంతువులకు బాగా తెలిసిన విద్యే. అయితే ఈ విద్యలో ఆఫ్రికన్ ఏనుగులు మరింతగా ఆరితేరాయట. మనుషులు చేసే శబ్దాలను బట్టి.. దగ్గరలో ఉన్నది మగవారా? ఆడవారా? పిల్లలా? పెద్దలా? వారి నుంచి ముప్పు ఉందా? లేదా? అన్నదీ ఈ ఏనుగులు పసిగడతాయట. శబ్దాలను బట్టి సమీపంలో ఉన్న మనుషులు ఏ తెగకు చెందినవారో కూడా గుర్తు పడతాయట. కెన్యాలోని అంబోసెలీ నేషనల్ పార్కులో 47 ఆఫ్రికన్ ఏనుగుల బృందాలపై పరిశోధన చేసిన ఎమోరీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ జంతుప్రవర్తన పరిశోధకులు ఈ సంగతులు కనుగొన్నారు. అంబొసెలీ పార్కు ప్రాంతంలో మసాయి తెగ పురుషులు తరచుగా ఏనుగులను చంపుతుంటారు. దీంతో మసాయి పురుషులు తారసపడినప్పుడు లేదా వారి శబ్దాలు వినపడినప్పుడల్లా ఈ ఏనుగులు పారిపోతుంటాయి. అయితే మసాయి పిల్లలు లేదా మహిళల శబ్దాలు విన్నప్పుడు మాత్రం ఇవి తక్కువగా భయపడతాయట. జంతువులకు ఎలాంటి హానీ తలపెట్టని కాంబా తెగ ప్రజల శబ్దాలు విన్నా, వారు ఎదురుపడినా ఇవి అసలు భయపడవట. పశుపోషణ తో జీవించే ఈ రెండు తెగలవారి శబ్దాలను రికార్డు చేసి లౌడ్స్పీకర్లలో వినిపించి ఏనుగుల ప్రవర్తనను పరిశీలించడంతో ఈ సంగతులు తెలిశాయి. అయితే.. సింహాల శబ్దాలను వినిపించినప్పుడు వాటిపై దాడి చేసేందుకు ఆ దిశగా వచ్చిన ఈ ఏనుగులు మసాయిల శబ్దాలు వింటే మాత్రం పిల్ల ఏనుగులతోపాటు తమను రక్షించుకునేందుకు గుంపుగా చేరి పారిపోతున్నాయట. సింహాల కన్నా మనుషులే డేంజర్ అని ఇవి కూడా తెలుసుకున్నాయన్నమాట!