మనుషుల శబ్దాలను డీకోడ్ చేస్తాయట!
వాషింగ్టన్: వినిపించే శబ్దాలను బట్టి.. ప్రమాదాలను గుర్తించడం జంతువులకు బాగా తెలిసిన విద్యే. అయితే ఈ విద్యలో ఆఫ్రికన్ ఏనుగులు మరింతగా ఆరితేరాయట. మనుషులు చేసే శబ్దాలను బట్టి.. దగ్గరలో ఉన్నది మగవారా? ఆడవారా? పిల్లలా? పెద్దలా? వారి నుంచి ముప్పు ఉందా? లేదా? అన్నదీ ఈ ఏనుగులు పసిగడతాయట. శబ్దాలను బట్టి సమీపంలో ఉన్న మనుషులు ఏ తెగకు చెందినవారో కూడా గుర్తు పడతాయట. కెన్యాలోని అంబోసెలీ నేషనల్ పార్కులో 47 ఆఫ్రికన్ ఏనుగుల బృందాలపై పరిశోధన చేసిన ఎమోరీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ జంతుప్రవర్తన పరిశోధకులు ఈ సంగతులు కనుగొన్నారు.
అంబొసెలీ పార్కు ప్రాంతంలో మసాయి తెగ పురుషులు తరచుగా ఏనుగులను చంపుతుంటారు. దీంతో మసాయి పురుషులు తారసపడినప్పుడు లేదా వారి శబ్దాలు వినపడినప్పుడల్లా ఈ ఏనుగులు పారిపోతుంటాయి. అయితే మసాయి పిల్లలు లేదా మహిళల శబ్దాలు విన్నప్పుడు మాత్రం ఇవి తక్కువగా భయపడతాయట. జంతువులకు ఎలాంటి హానీ తలపెట్టని కాంబా తెగ ప్రజల శబ్దాలు విన్నా, వారు ఎదురుపడినా ఇవి అసలు భయపడవట. పశుపోషణ తో జీవించే ఈ రెండు తెగలవారి శబ్దాలను రికార్డు చేసి లౌడ్‌స్పీకర్లలో వినిపించి ఏనుగుల ప్రవర్తనను పరిశీలించడంతో ఈ సంగతులు తెలిశాయి. అయితే.. సింహాల శబ్దాలను వినిపించినప్పుడు వాటిపై దాడి చేసేందుకు ఆ దిశగా వచ్చిన ఈ ఏనుగులు మసాయిల శబ్దాలు వింటే మాత్రం పిల్ల ఏనుగులతోపాటు తమను రక్షించుకునేందుకు గుంపుగా చేరి పారిపోతున్నాయట. సింహాల కన్నా మనుషులే డేంజర్ అని ఇవి కూడా తెలుసుకున్నాయన్నమాట!