పరువు హత్యల నిరోధక బిల్లుకు 22 రాష్ట్రాల మద్దతు
న్యూఢిల్లీ: పరువు హత్యలను నిరోధించే బిల్లుకు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మద్దతు తెలిపినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్సభలో వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను సిద్ధం చేసేందుకుగానూ ఒక నిర్ధిష్ట కాలపరిమితిని నిర్ణయించేందుకు మాత్రం కేంద్రం అంగీకరించలేదు. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే పరువు హత్యల నిరోధక బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని లోక్సభలో కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఈ సమావేశాల్లోనే లోక్పాల్ సవరణ బిల్లు
లోక్పాల్ సెలక్షన్ ప్యానెల్లో లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతకు చోటు కల్పించేందుకు ఉద్దేశించిన లోక్పాల్ సవరణ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్పాల్, లోకాయుక్త చట్టం ప్రకారం ప్రధాని నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో లోక్సభ స్పీకర్, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నామినేట్ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రాష్ట్రపతి నామినేట్ చేసే న్యాయకోవిదుడు ఉంటారు. అయితే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత లేని నేపథ్యంలో లోక్సభలో అతిపెద్ద పార్టీకి చెందిన నేతకు సెలక్షన్ కమిటీలో చోటు కల్పించేందుకు అనువుగా కేంద్రం సవరణ చేయనుంది.
రాజ్యసభలో బిల్లును అడ్డుకున్న విపక్షాలు
లోక్సభ ఆమోదం పొందిన పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (సవరణ)బిల్లు, 2014ను రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తప్పుపట్టాయి. బీఏసీలో లేని బిల్లును ఆశ్చర్యకరంగా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో తీవ్రంగా ప్రతిఘటించాయి.