‘నృత్య’ నూతనం
అన్నవరప్పాడు (పెరవలి) : నాటకం, పౌరాణిక సినిమాల్లో కనిపించే దృశ్యాలను నృత్యంలోనూ ఆవిష్కరించారు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణుడు ర«థం నడపడం, గోపికలతో గోపాలుడి నృత్యం, అర్జునుడికి గీతా బోధన, అష్టలక్ష్మిల అవతారం, మహాకాళి అగ్రహం వంటి దృశ్యాలను నృత్యంలో ఆవిష్కరించారు. రింగ్‌తో చేసిన నృత్యాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. ఇలా తమ నృత్యంతో ఆహూతులను అలరించారు నాట్యకారిణి జవ్వాది అంబిక, శిష్య బృందం. పెరవలి మండలం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకుంది. తణుకు దగ్గర పైడిపర్రు గ్రామానికి చెందిన అంబిక అంతర్జాతీయస్థాయిలో ప్రసిద్ధి గాంచిన నాట్యకారిణి. దేశ, విదేశాల్లో వందల ప్రదర్శనలు ఇచ్చారు. అన్నవరప్పాడు తాతగారి ఊరు కావటంతో ఆమె తన శిష్య బృందంతో వచ్చి ప్రదర్శన ఇచ్చారు.