ఎన్నికల ‘హవా’లా!
సాక్షి, జనగామ: ఎన్నికలకు మరో రెండు రోజులే మిగిలి ఉండటంతో పంపిణీ నిమిత్తం డబ్బు విపరీతంగా రవాణా అవుతోంది. చిన్న నోట్లను తరలించడంలో ఇబ్బందులు ఉండటంతో రూ.500, రూ.2 వేల నోట్ల కట్టలను తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అక్రమ మార్గంలో వందల కోట్లు ఇక్కడికి రవాణా అవుతున్నాయి. ఏపీ అధికార పార్టీ తమ అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హవాలా మార్గంలో తరలిస్తున్న రూ.5.80 కోట్లను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ డబ్బంతా కాంగ్రెస్, టీడీపీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థులకు ఇవ్వడానికి తీసుకెళుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. జనగామ జిల్లా హైదరాబాద్–వరంగల్ 163వ జాతీయ రహదారిపై పెంబర్తి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ వి.రవీందర్ మీడియాకు వెల్లడించారు.
వెనుక సీటు కింద నోట్ల కట్టలు..
‘హైదరాబాద్ నుంచి కారులో పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తున్నట్లు స్టేట్ ఇంటలీజెన్స్కు సమాచారం అందింది. కారు వివరాలు కూడా తెలియడంతో గూగుల్ మ్యాప్ ద్వారా సెర్చ్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఆ కారు వరంగల్ దిశగా వెళుతున్నట్లు గుర్తించిన అధికా>రులు జనగామ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో జనగామ జిల్లా పెంబర్తి చెక్‌పోస్టు వద్ద ఎస్సై శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేస్తుండగా, ఏపీ 37 సీకే 4985 నంబర్ షిప్టు డిజైర్ కారు వచ్చింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు, డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని విచారించారు. ఈ సమయంలో హైదరాబాద్ గోషామహల్‌కు చెందిన కీర్తి కుమార్ జైన్, రాజస్తాన్‌కు చెందిన డ్రైవర్ నవరాం, మహబూబాబాద్ జిల్లా కాన్వాయ్గూడెంకు చెందిన ముత్యం ప్రకాష్ కారులో ఉన్నారు. విచారణ సందర్భంగా కారులో డబ్బు ఉందని, వరంగల్‌కు తీసుకుపోతున్నామని చెప్పారు. కారులోని వెనుక సీట్ల కింద దాచిన నోట్ల కట్టలను పోలీసులు గుర్తించారు. కారును, అందులో ప్రయాణిస్తున్న వారిని జనగామ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల అధికారులు, పోలీసుల సమక్షంలో కౌంటింగ్ మిషన్ల సాయంతో డబ్బును లెక్కించగా మొత్తం రూ.5,80,65,000 ఉన్నట్లు తేలిందని’ సీపీ చెప్పారు.
‘కూటమి’ అభ్యర్థులకు ఇవ్వడానికి..
‘తనిఖీల్లో పట్టుబడిన డబ్బు కాంగ్రెస్, టీడీపీ నేతృత్వంలో ఏర్పడిన కూటమి అభ్యర్థులకు చెందినదిగా గుర్తించాం. కీర్తి కుమార్ జైన్ హైదరాబాద్‌లోని గోషామహల్ ఏరియాలో నివాసం ఉంటూ హవాలా మార్గం ద్వారా డబ్బును రవాణా చేస్తుంటాడు. ఎన్నికలు కావడంతో స్థానికంగా కొందరు డబ్బు కావాలని అతన్ని కోరారు. దీంతో హైదరాబాద్ నుంచి డబ్బు తీసుకొని వరంగల్ వస్తూ పెంబర్తి వద్ద పట్టుపడ్డారు. ఈ డబ్బులో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర్రావుకు రూ.1.5 కోట్లు, వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రకు రూ.2 కోట్లు, పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ భర్త ఎమ్మెల్సీ కొండా మురళీకి రూ. 2.3 కోట్లు ఇవ్వడానికి తీసుకువెళుతున్నట్లు చెప్పారు. మొత్తం డబ్బు రూ.5,80,65,000లతో పాటు కారును స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడు కీర్తి కుమార్ జైన్, డ్రైవర్లు నవరాం, ముత్యం ప్రకాశ్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించాం. కారు కీర్తి కుమార్ జైన్ సోదరుడు ప్రవీణ్‌కుమార్ జైన్ భార్య సుమిత్రా జైన్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. కోట్లలో డబ్బు పట్టుబడటంతో పూర్తిస్థాయి విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ)కు అప్పగించే అవకాశాలున్నాయని’ రవీందర్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీతో పాటు డీసీపీ శ్రీనివాసరెడ్డి, సీఐ ముష్క శ్రీనివాస్, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.
అన్నీ పెద్ద నోట్ల కట్టలే..
పట్టుబడిన నగదులో అన్నీ రూ.2000, రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయి. 2000 నోట్లు 20,051 ఉండగా, వాటి విలువ రూ.4,01,02,000. 500 నోట్లు 35,926 ఉండగా, వాటి విలువ రూ.1,79,63,000. తెల్లవారుజామున 5 గంటలకు నగదును లెక్కింపు ప్రారంభించగా ఉదయం 11 గంటలకు పూర్తయింది. నోట్లను లెక్కించడానికే ఆరు గంటల సమయం పట్టడం గమనార్హం. పట్టుకున్న నగదులో నకిలీ రెండు వేల నోటును కూడా గుర్తించారు. భారీ నగదులో నకిలీ నోటు రావడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఏపీ నుంచి తెలంగాణకు....
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ నుంచి డబ్బు ప్రవాహం కట్టలు తెంచుకుంది. కాంగ్రెస్‌తో కలసి ప్రజాకూటమి ఏర్పాటు చేసిన టీడీపీ.. తమ అభ్యర్థులకు ఏపీ నుంచి ఆర్థిక వనరులను సమకూర్చుతోందని పోలీసులకు పట్టుబడుతున్న డబ్బు సంచులు చెబుతున్నాయి. పెంబర్తి చెక్‌పోస్టు వద్ద పట్టుబడ్డ రూ.5.80 కోట్లు ఏపీ నుంచి వచ్చిన కారులోనే లభించడం విశేషం. కీర్తి కుమార్ జైన్ కూడా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంనకు చెందిన వ్యాపారి కావడం గమనార్హం. పాలకొల్లు పక్కనే ఉన్న నరసాపురం కేంద్రంగా పెద్ద ఎత్తున హవాలా వ్యాపారం సాగుతూ ఉంటుంది. కారు పాలకొల్లుకు చెందినది కావడంతో ఏపీకి చెందిన అధికార పార్టీ నేతలే ఇలా హవాలా రూపంలో పెద్ద మొత్తం తరలించే ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా కీర్తికుమార్ జైన్ గతంలో అనేక సందర్భాల్లో డబ్బుతో పట్టుబడ్డాడు. 2014 ఎన్నికల్లో భీమవరంలో అత్యధిక మొత్తం దొరికిన సొమ్ము కీర్తికుమార్‌కు చెందినదేనని అప్పట్లో విచారణ జరిపారు. అదే ఎన్నికల్లో ఒక అధికార అభ్యర్థి తమ అధిష్టానానికి ఇదే హవాలా వ్యాపారి ద్వారా రూ.5 కోట్లు ఎన్నికల ఫండ్ పంపిన తర్వాతే సీటు వచ్చిందన్న ప్రచారం ఉంది.
కృష్ణా, గోదావరి నదుల గట్టుదాటి..
ఏపీ నుంచి తెలంగాణకు డబ్బు రవాణాకు జలమార్గాన్ని మేలైన మార్గంగా ఎంచుకున్నారనేది విశ్వసనీయ సమాచారం. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నడుమ ఉన్న కృష్ణా, గోదావరి నదులు దాటితే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి చేరుకోవచ్చు. ఎక్కడికక్కడ డబ్బు తరలింపునకు వీలవుతుంది. ఎవరికీ అనుమానం రాకుండా నాటు పడవల ద్వారా డబ్బు సంచులు చేరవేస్తున్నారని ఓ నిఘా అధికారి విశ్లేషించారు. మరోవైపు ప్రతిరోజూ ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వందలాది ఇసుక లారీలు, కార్లు, ఇతర వాహనాల సీట్లు, బాడీ కింద అరల్లోను, పాలవ్యాన్లు, ఇతర వాహనాల్లోను నోట్ల కట్టలను సునాయాసంగా తరలిస్తున్నారని, ఇందుకు తమకు అనుకూలురైన అధికారులను ఎక్కడికక్కడ సెట్ చేసుకున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ముందుగానే ఎంపిక చేసుకున్న వాహనాలను ఎవరూ తనిఖీ చేయకుండా ఏపీలోని చెక్‌పోస్టులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్టు కూడా పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. అశ్వారావుపేట నుంచి ఏపీలో కలిసిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచి, మరోవైపు జీలుగుమిల్లి, చింతలపూడి మండలాల సరిహద్దుల నుంచి డబ్బు, పెద్ద ఎత్తున మద్యం నిల్వలు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.