‘పశ్చిమ’లో రేవ్ పార్టీ
16 మంది యువకులు, 10 మంది యువతుల అరెస్ట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రేవ్ పార్టీల సంస్కృతి పశ్చిమగోదావరి జిల్లాకు పాకింది. నిడమర్రు మండలం పత్తేపురం శివారు ఆముదాలపల్లి గ్రామంలో చేపల చెరువుల మధ్యగల అతిథి గృహంలో ఆదివారం అర్ధరాత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా.. పోలీసులు మెరుపు దాడి చేశారు. మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న 16 మంది యువకులు, 10 మంది యువతులను నిడమర్రు ఎస్సై ఎం.వీరబాబు నేతృత్వంలో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక్కడకు వచ్చిన యువకులంతా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. 15 రోజులకు ఒకసారి పార్టీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
సోమవారం సాయంత్రం డీఎస్పీ జి.వెంకటేశ్వర రావు ఏలూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవ్ పార్టీలో పాల్గొన్న 16 మంది యువకులు, 9మంది యువతులతో పాటు ఏలూరు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడకు తీసుకొచ్చిన హేమ అనే మహిళను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. గెస్ట్‌హౌస్‌లో రూ.లక్ష నగదు, మద్యం బాటిళ్లు, కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులు చినమూర్తిరాజు, గిరిరాజు పరారీలో ఉన్నారని చెప్పారు.
నిందితులపై వ్యభిచారం కేసు, హేమపై ఐటీపీ (ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రొహిబిషన్) యాక్ట్ కింద కేసు నమోదు చేశామని వివరించారు. 9మంది మహిళలను ఏలూరులోని స్వధార్‌హోంకు తరలిస్తామని తెలిపారు. సమావేశంలో గణపవరం సీఐ దుర్గాప్రసాద్, ఎస్సైలు హరికృష్ణ, వీరబాబు పాల్గొన్నారు.