ఒక పల్లవి నాలుగు చరణాలు
అమ్మాయిలని నోట్స్ అడగడం కూడా చాలా కష్టమైన రోజులు అవి. వారి కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం తప్పు. పలకరించడం నేరం. కాఫీకి పిలవాలంటే న్యూక్లియర్ ఫార్ములాను డిరైవ్ చేసినంత పని. ఇక లవ్ లెటర్... హడల్. అబ్బాయిలు వేరు... అమ్మాయిలు పూర్తిగా వేరు అనుకునే 1990ల రోజులు అవి. పొడుగు జడలు, పవిటా పావడాలు, బిఎస్ఏ ఎస్సల్లార్ ఎక్కి తల వొంచుకుని వెళ్లి చదువుకునే అలాంటి రోజుల్లో ఇవాళ అమెరికాలో జరుగుతున్నట్టుగా, ఇండియాలో ఇంకా మొదలు కాలేదు, ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఒకే గదిలో ఉంటే? వారు రూమ్‌ను షేర్ చేసుకుంటే? స్నేహాన్ని పంచుకుంటే... ఒకరిని ఒకరు గౌరవించుకునేలా ఉంటే? ఇలాంటి కథా? ఇలాంటి కథే అన్నాడు త్రివిక్రమన్. తీశాడు. ప్రేక్షకుల ముందు ఉంచాడు. జనం ఏం చేశారు?
వాళ్లల్లో ఒకడు తనను తాను ఎస్.పి.బి అనుకున్నాడు. ఇంకొకడు ఇళయరాజా అనుకున్నాడు. మరొకడు కె.వి.మహదేవనో, పుహళేందో. నలుగురూ మద్రాసు చేరారు మ్యూజిక్ రంగంలో రాణిద్దామని. ఎవరూ ఆదరించలేదు. ఏవీఎం, విజయా గార్డెన్స్ గేట్లు వారి కోసం తెరుచుకోలేదు. పాట అందుకుంటే, కీర్తన ఆలపిస్తే కడుపు నిండదు. తినడానికి డబ్బులు కావాలి. వారి దగ్గర లేవు. ఆత్మాభిమానానికి ఆకలి ప్రథమ శత్రువు. వాళ్లు నలుగురు స్ట్రీట్ సింగర్స్‌గా మారారు. చెట్టు కింద, పేవ్మెంట్ మీద, బీచ్‌లో, బస్టాండ్ సమీపంలో గుడ్డ పరిచి పాట మొదలుపెట్టారు. రోజూ నాలుగు చోట్ల కచ్చేరీలు. దారిన పోయేవాళ్లు ఆగి కాసేపు విని చిల్లర పడేస్తే ఆ పూటకు భోజనం. లేకుంటే లేదు. వాళ్లు బతకడమే కష్టం అనుకుంటే ఇంకో పొట్ట కూడా తోడు చేరింది. అమ్మాయి. ఇప్పుడేమవుతుంది?
మద్రాసులో ఏదో అడ్రస్ కోసం వెతుక్కుంటూ ఆ అమ్మాయి ఊరు విడిచి వచ్చింది. ఆ అడ్రస్‌లో ఆమెకు కావలిసినవారు లేరు. వీళ్లు కనిపించారు. ఆ అమ్మాయి వీరి వెంట నడిచింది. వయసులో ఉన్న కుర్రాళ్లందరూ గోడలు దూకేవాళ్లే అయి ఉండరు. కొందరు ఆశ్రయం కోరేవారికి పైకప్పుగా కూడా నిలబడగలుగుతారు. ఆ అమ్మాయి కష్టంలో ఉందని ఆ నలుగురు గ్రహించారు. తమ గదిలోనే చోటు ఇచ్చారు. వీధి ఆశ్చర్యపోయింది. హౌస్ ఓనరమ్మ ముక్కున వేలేసుకుంది. కాని మన ప్రవర్తనే మనకు సర్టిఫికెట్ ఇస్తుంది. త్వరలోనే వారిని ఆ వాడ యాక్సెప్ట్ చేసింది. డాబా మీద గది. రోజూ కనిపించే చందమామ. పిసినారితనం చూపకుండా హాయిగా వీచే చల్లగాలి. కొద్దిగా తిన్నా కడుపు నింపగల అన్నం. చేయగలిగిన కూర. బోలెడన్ని కబుర్లు. శ్వాస అంత సులభంగా తోడుగా ఉండే పాట.
పాటలలోన జీవితమే పలికేను అంట.. మాటలలో చందనమే వెదజల్లేనంట...
ఒక పల్లవికి నాలుగు చరణాలు తోడయ్యాయి. వాళ్లు జీవితంలో పైకి రావాలంటే వీధుల వెంట పాడటం మాని మంచి అవకాశాల కోసం ప్రయత్నించాలి అని ఆ అమ్మాయి వారికి చెబుతుంది. దాని కోసం జరిగే కాంపిటీషన్లో పాల్గొనడానికి ఏరోజుకారోజు డబ్బు కూడబెట్టేలా చేస్తుంది. ఈ లోపు ఆమె గతం కూడా వారికి చెబుతుంది. ఆమె ప్రేమించినవాడు దేశంలో లేడు. రేపో మాపో వస్తాడు... వస్తే అతడిని పెళ్లి చేసుకోవాలి... అందుకోసమే ఎదురు చూస్తోంది... ఆ విషయం తెలిసి వాళ్లు నలుగురు సంతోషపడతారు. అందరూ ఆ రాబోయేవాడి కోసం ఎదరు చూస్తూ ఉంటారు. కాని వచ్చేవాడు ఫల్గుణుడు కాదు. ఫాల్తు వెధవ. కుసంస్కారి.
ఆడపిల్లకు వ్యక్తిత్వం ఉందని లోకం అంగీకరించదు. మగవాళ్లు స్నేహానికి, వ్యక్తిత్వానికి విలువ ఇస్తారన్నా లోకం నమ్మదు. ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఒకే గదిలో సంవత్సరం పాటు ఉంటున్నారంటే వాళ్ల మధ్య ఏమీ ఉండకుండా ఉంటుందా? కథ చూస్తున్న ప్రేక్షకులకు వారి మధ్య ఏమీ లేదని తెలుస్తూ ఉంటుంది. కాని పాత్రధారి అయిన ఆ అమ్మాయి ప్రియుడికి మాత్రం తెలియదు. అతడు తెలివి మీరుతాడు. ఏకంగా ఆ అమ్మాయిని తీసుకెళ్లి కన్యత్వ పరీక్ష చేయిస్తాడు. అమ్మాయి హర్ట్ అవుతుంది. ఎందుకు చేయించావ్ అని అడిగితే పావలా రీఫిల్ కొనేటప్పుడు కూడా నాలుగుసార్లు రాసి చూసి కొంటాము... జీవితాంతం చూసుకోవాల్సిన వ్యక్తి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటాడు. సీతకు కూడా అగ్నిపరీక్ష ఉందని అంటాడు.
‘సీత చెడిపోవాలనుకుంటే అయోధ్యలోనే చెడిపోయి ఉండవచ్చు. అశోకవనంలోనే కాదు’ అంటుంది ఆ అమ్మాయి. ‘ఎవరైతే నన్ను నమ్మాలో నువ్వు నన్ను నమ్మలేదు. ఎవరినైతే నేను అనుమానంగా చూడాలో వారు నన్ను నమ్మారు. ఇక నీకూ నాకూ పడదు. గుడ్‌బై’ అని ఆ అమ్మాయి అతణ్ణి వదిలి తను ఇష్టపడే, గౌరవించే నలుగురు స్నేహితుల దగ్గరకు వచ్చేస్తుంది. వాళ్ల ట్రూప్‌లో సభ్యురాలిగా ఉండిపోతుంది. ఆ ఐదుగురు కలిసి ఇప్పుడొక స్నేహగీతం అయ్యారు. దానిని సరిగా వినగలిగే సంస్కారం ఉన్నవాళ్లే వాళ్లకు తోడవుతారు. లేకుంటే? వాళ్ల దారిలో వారలా సాగిపోతూనే ఉంటారు. అమ్మాయి అబ్బాయి అనగానే ప్రేమ, కామం అని స్థిరపడిన లోకానికి వారి మధ్య స్నేహం కూడా సాధ్యమే అని చాలా తర్కబద్ధంగా, సంస్కారవంతంగా నిరూపించిన కథ కొద్దిగా అయినా ప్రేక్షకులను మారుస్తుంది. ఈ సినిమా అవసరం ఆ కాలం కంటే ఈ కాలం ఎక్కువగా ఉంది. ప్రేమ కోసం కత్తిపట్టుకునే వాళ్లంతా ఈ సినిమా డీవీడీ పట్టుకుంటే ఎంత బాగుండు?
పుదు వసంతం
దర్శకుడు విక్రమన్ తన తొలి సినిమాగా ప్రేక్షకుల మీదకు సంధించిన ఈ కొత్త తరహా కథ ‘పుదు వసంతం’గా 1990లో విడుదలయ్యి తమిళంలో సినిమా కథా ధోరణినే మార్చేసింది. పాడే హీరోలు, స్నేహం చేసే హీరోలు, నలుగురు కుర్రాళ్ల కథలు... ఇలాంటివి భారతీయ భాషలలో పుంఖాను పుంఖాలుగా రావడానికి ఈ సినిమా బీజం వేసింది. తమిళ నటుడు మురళి, ఆనంద్ బాబు, సితార వీళ్లంతా ఈ సినిమాతో చాలా పేరు సంపాదించుకున్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఏ.రాజ్ కుమార్ ఈ సినిమా పాటలతో ఇళయరాజా ధాటికి తట్టుకుని నిలబడగలిగాడు. ‘స్త్రీని పరీక్షించే పురుష స్వభావాన్ని’ ప్రశ్నించినందుకే ఈ సినిమా హిట్ అయ్యిందని చెప్పాలి. ప్రఖ్యాత దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాకు అసిస్టెంట్‌గా పని చేశారు. దీని ప్రభావంతో చిరంజీవి, సాక్షి శివానంద్లతో ‘ఇద్దరు మిత్రులు’ తీశారుకాని సఫలం కాలేదు. అలాగే తరుణ్ హీరోగా ఇదే ధోరణిలో 2002లో ఒక ‘నవ వసంతం’ వచ్చింది. సూపర్‌గుడ్ ఫిలిమ్స్ చౌదరి, విక్రమన్ కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమాలలో ‘శుభాకాంక్షలు’, ‘రాజా’, ‘మా అన్నయ్య’, ‘సూర్యవంశం’ తదితర భారీ హిట్స్ ఉన్నాయి. తమిళంలో విక్రమన్ది ఒక శకం.
– కె