Anand Rao
-
ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది: నారాయణమూర్తి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మరణం సమాజానికీ తీరని లోటని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయనని ఉత్తరాంధ్ర సంతకం అని గొల్లపూడి మారుతీరావు కొనియాడారు. పార్వతీపురం మహాసభలో మహాకవి శ్రీశ్రీ మాట్లాడుతూ నిజమైన ప్రజాకవి నేను కాదు వంగపండు ప్రసాదరావు, గద్దర్ అన్నారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) వంగపండు నా అర్ధరాత్రి స్వతంత్య్రం సినిమాలో గొప్ప పాటలు రాశారు, పాడారు, నటించారు. తర్వాత కూడా నా అనేక చిత్రాలకు ఆయన పాటలు రాశారు. నా చిత్ర విజయాలకు అయన పాటలు ఎంతో దోహదం చేశాయి. దాసరి నారాయణరావు, టీ కృష్ణ, మాదాల రంగారావు సినిమాలతో పాటు అనేక చిత్రాలకు పాటలు రాశారు. ఆయన మరణంతో ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు, సాహిత్య లోకానికే కాదు.. పీడిత ప్రజానీకానికి, సమాజానికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అంటూ పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. (వంగపండు మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం) ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం ఉత్తరాంధ్రకు తీరని లోటని మిధునం సినిమా నిర్మాత ఆనంద్‌రావు అభిప్రాయపడ్డారు. అతని పాట వింటే ఊపు వస్తుందని..పేద ప్రజల గుండెచప్పుడు ఆ పాటలో కనిపిస్తుంది. ప్రజల కష్టాలను పాట రూపంలో ఓదార్చిన వ్యక్తి వంగపండు. అలాంటి ప్రజా గాయకుడు మళ్ళీ ఈ తరంలో కనిపిస్తారా. తన చిన్నతనంలో వంగపండు పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహాన్ని పొందేవాడినని నిర్మాత ఆనంద రావు అన్నారు. -
చుప్పుల కోట
ఇవి గప్‌చుప్‌గా విదేశాలకు సైతం ప్రయాణిస్తున్నాయి... ఒక్కసారి చుప్పులను పంటి కింద ఉంచి కరకరలాడిస్తే చాలు... మళీ మళ్లీ కావాలని అడగకుండా ఉండలేరు... సుమారు 40 సంవత్సరాలుగా చుప్పులను తయారుచేస్తూ, సారవకోట పేరును ప్రపంచ పటంలోకి తీసుకువెళ్తున్నారు ఆనందరావు. ఇదే ఈవారం మన ఫుడ్ ప్రింట్స్... చుప్పులు వాసన వస్తేనే చాలు నోరూరిపోతుంది. వాటిని వెంటనే తినాలనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల కేంద్రానికి రాగానే బస్సులో పడుకున్నవారిని సైతం నిద్రలేపుతుంది ఈ రుచి. ఇవి చాలా కాలం నుంచే ప్రసిద్ధి చెందాయి. జాతీయ రహదారిని ఆనుకుని ఈ గ్రామం ఉండటం వల్ల ఒడిషా వెళ్ళేవారంతా వీటిని కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. ఈ చుప్పులకు సుమారు 40 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇతర దేశాలలో ఉన్న తమ పిల్లలకు వీటిని పంపించడం ఆనవాయితీగా మారింది. అందువల్ల వీటి ప్రత్యేకత ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. ఇదీ చరిత్ర 1960 సంవత్సరంలో జలుమూరు నుండి పొట్ట చేత పట్టుకుని ఈ గ్రామానికి వలస వచ్చారు తంగుడు వంశీయులు. బతుకు తెరువు కోసం చుప్పుల తయారీని ప్రారంభించారు. అప్పటి నుంచి చుప్పుల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. తంగుడు వంశీయులు తమకు తెలిసిన మెళకువలను ఉపయోగించి మరిన్ని వైశ్య కుటుంబాలకు నేర్పించారు. ఇప్పుడు ప్రస్తుతం సుమారు 12 కుటుంబాల వారు వీటిని తయారుచేసి, కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఆనందరావు మాది ఒరిస్సాలో గునుపూరు. మేం ఏడుగురు అన్నదమ్ములం. జీవనోపాధి కోసం 40 సంవత్సరాల క్రితమే ఇక్కడకు వచ్చాం. నా చిన్నప్పటి నుంచి తాతగారి దగ్గర నర్సన్నపేటలో ఉండేవాడిని. వివాహం అయ్యాక సారవకోట వచ్చాను. మేము వ్యాపారస్థులం, ఎవ్వరికీ అరువు పెట్టం. అలా చేస్తే, వ్యాపారంలో నష్టపోతామని మా నమ్మకం. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో రెండు డబ్బాల చుప్పులు తయారు చేసి అమ్మేవాళ్లం. వ్యాపారంలో లాభం అంతగా రాకపోయినా, నష్టం ఉండేది కాదు. వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. జాగ్రత్తగా నీడలో ఉంచితే, పాడు కావు. ఎండలో పెడితే మూడు రోజులకే పాడైపోతాయి. ఎప్పుడైనా ఊరు వెళ్లాలనుకుంటే మా పని ఆపుకుంటాం. మా ఆవిడ పేరు సత్యవతి. ఆవిడే తయారు చేస్తుంది. నేను దుకాణంలో కూర్చుని వ్యాపారం చూసుకుంటాను. అలసట చూపకూడదు... చుప్పుల తయారీలో ఏమాత్రం ఏమరుపాటు చూపినా వీటి నాణ్యత, రుచి దెబ్బతినే ప్రమాదం ఉంది. చుప్పుల తయారీకి సాంబమసూరి, సి ఆర్ రకం బియ్యాన్నే వినియోగిస్తున్నారు. ఇందులోకి దేశవాళీ నువ్వులనే వాడతారు. వీటిని సాధారణంగా మహిళలే తయారు చేస్తారు. ముందుగా బియ్యాన్ని కడిగి అరబెట్టి, తరువాత మెత్తని పిండిగా తయారు చేస్తారు. పొట్టు తీసిన నువ్వులను, బియ్యప్పిండిలో కలిపి తగినన్ని నీళ్లు, ఉప్పు, వాము కలిపి పలచగాను, చిక్కగాను కాకుండా పిండి కలుపుకుంటారు. ఈ పిండితో వృత్తాకారంగా చుట్టి, సుమారు అరగంట సేపు ఆరబెట్టి, నూనెలో దోరగా వేయిస్తారు. ఇదీ చుప్పుల తయారీ విధానం. నెలకు 50 వేల రూపాయల టర్నోవర్ ఉంది. పెళ్ళిళ్ల సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. సారెలో చుప్పులను తప్పనిసరిగా చేయించుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, పర్లాకిమిడి, తెంబూరు, పాతపట్నం, నరసన్నపేట ప్రాంతాలను ఈ కుటుంబీకులే చుప్పులు సరఫరా చేస్తున్నారు. – కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం – ఫొటోలు: వై. గణేష్, సారవకోట -
ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న కారు ఇద్దరు దుర్మరణం
కావలి: ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపక్కన ఆగిఉన్న టిప్పర్‌ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పట్టణ శివారులో శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో పమిడి స్కూల్ కరస్పాండెంట్ పమిడి వెంకటసుబ్బయ్యనాయుడు(50), కలిగిరి మండలం అయ్యపురెడ్డిపాళెంకు చెందిన మన్నం చంద్రమౌళి(47) మృతి చెందారు. చిన్నారావుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలించారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసుల కథనం మేరకు.. దగదర్తి మండలం మనుబోలుపాడు చెందిన పమిడి వెంకటసుబ్బయ్యనాయుడు ముసునూరులో పమిడి కాన్సెప్ట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఆయన భార్య సుభాషిణి దుండిగం ఎంపీటీసీ. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. కలిగిరి మండలం అయ్యపురెడ్డిపాళెంకు చెందిన మన్నం చంద్రమౌళి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఆయన భార్య శిరీష, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. గురువారం అర్ధరాత్రి దాటిని తర్వాత మన్నం చంద్రమౌళి, ఆయన అన్న చిన్నారావు, మేనల్లుడు ఆనందరావు కారులో పట్టణం నుంచి జలదంకి మండలం జమ్మపాళెంలో ఉన్న ఓ డాబాకు వెళ్లారు. అక్కడ భోజనం చేసి శుక్రవారం వేకువన తిరిగి కావలికి బయలుదేరారు. పట్టణ శివారు ప్రాంతమైన బుడంగుంట ఇందిరమ్మ కాలనీకి సమీపించే సరికి ప్రమాదం జరిగింది. చంద్రమౌళి, వెంకట సుబ్బయ్యనాయుడు ప్రమాదస్థంలోనే చనిపోగా గాయపడిన ఆనందరావును 108 వాహన సిబ్బంది చికిత్స కోసం కావలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చిన్నారావు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని వైద్యశాలకు తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. జెడ్పీచైర్మన్ పరామర్శ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఏరియా వైద్యశాలకు వచ్చి మృతుల కుటుంభ సభ్యులను, బంధువులను పరామర్శించారు. కావలి ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, వివిధ పార్టీల నాయకులు ఏరియా వైద్యశాలకు వచ్చారు. -
సోంపేట.. షేక్
సోంపేట:దాదాపు దశాబ్దం క్రితం.. ఆనంద్ జ్యూయలర్స్ యజమాని కుటుంబం హత్య, భారీ దోపిడీ.. అక్కడికి కొన్నాళ్ల వ్యవధిలోనే.. పైడిశెట్టి ప్రతాప్ షాపు మూసి ఇంటికి వెళుతుండగా.. అతనిపై దాడి, దోపిడీ.. ఆ తర్వాత నుంచి చిన్నా చితకా చోరీలు తప్ప దాదాపు ప్రశాంతంగానే ఉన్న సోంపేట మళ్లీ బుధవారం ఉలిక్కిపడింది. భయంతో వణికిపోతోంది. కారణం..బుధవారం రాత్రి ఒక వ్యాపారస్తుని స్కూటర్ డిక్కీలో ఉంచిన లక్షల విలువైన బంగారు నగలు, నగదు అనూహ్య రీతిలో చోరీకి గురి కావడ మే.. పోలీస్ స్టేషన్ ఎదురుగానే జరిగిన ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. ఏం జరిగిందంటే.. తంగుడు ఆనందరావు పట్టణంలోని పెద్దబజారు వీధిలో బాబా జ్యూయలర్స్ షాపు పెట్టుకొని నగల వ్యాపారం చేస్తున్నారు. రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి 8.20 గంటల ప్రాంతంలో షాపు మూసివేశారు. అంతకు ముందు ఆయన ఇంటికి కావలసిన టిఫిన్ కోసం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వెంకటసాయి హోటల్‌కు ఫోన్లో ఆర్డరు ఇచ్చారు. అనంతరం షాపులో ఉన్న సుమారు కిలో బంగారు నగలు, రూ.1.50 లక్షల నగదు బ్యాగులో సర్ది షాపుకు తాళం వేశారు. నగల బ్యాగును తన ద్విచక్ర వాహనం సీటు కింద డిక్కీలో పెట్టి ఇంటికి బయలుదేరారు. మధ్యలో హోటల్ వద్ద ఆగి టిఫిన్ పార్శిల్ తీసుకొని చర్చి వీధిలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయారు. వాహనం పార్క్ చేసి నగల బ్యాగు కోసం చూస్తే అది కనిపించలేదు. దాంతో కంగారు పడిన ఆయన టిఫిన్ కోసం హోటల్ దగ్గర వాహనం ఆపినప్పుడే ఎవరో బ్యాగు కొట్టేసి ఉంటారని భావించారు. వెంటనే హోటల్ వద్దకు వెళ్లి వాకబు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాగులో ఉన్న నగల విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వత్రా ఆందోళన షాపు మూసిన తర్వాత హోటల్ దగ్గర తప్ప ఎక్కడా ఆగలేదని బాధితుడు ఆనందరావు చెప్పారు. టిఫిన్ ముందుగానే ఆర్డర్ ఇచ్చినందున అక్కడ కూడా ఎక్కువ సేపు ఆగలేదని, ఈలోగానే దారుణం జరిగిపోయిందని చెబుతూ భోరున విలపించారు. తెలిసిన వారు. తన దినచర్యను గమనిస్తున్న వారి పనే అయ్యుంటుందన్న అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈ సంఘటనతో పట్టణ ప్రజలు, ముఖ్యంగా వ్యాపారస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పదేళ్ల క్రితం ఇదేస్థాయిలో రెండు దోపిడీలు జరిగిన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆనంద్ జ్యూయలర్స్ యజమాని వూనా తాతారావు ఇంటిలోకి దుండగులు చొరబడి , తాతారావుతోపాటు ఆయన తల్లి, కుమార్తెలను హత్య చేసి నగదు, బంగారం దోచుకుపోయారు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే పైడి శెట్టి ప్రతాప్ అనే వ్యాపారి షాపు మూసి, బంగారంతో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా, ఇంటి సమీపంలోనే అతనిపై దాడి చే సి బంగారం ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత నుంచి చిన్న చిన్న చోరీలు తప్ప పెద్ద సంఘటనలేవీ లేకపోవడంతో ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఘటనతో బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. సమాచారం అందుకున్న వెంటనే కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ సోంపేటకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. సోంపేట ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.