ఇవి గప్‌చుప్‌గా విదేశాలకు సైతం ప్రయాణిస్తున్నాయి... ఒక్కసారి చుప్పులను పంటి కింద ఉంచి కరకరలాడిస్తే చాలు... మళీ మళ్లీ కావాలని అడగకుండా ఉండలేరు... సుమారు 40 సంవత్సరాలుగా చుప్పులను తయారుచేస్తూ, సారవకోట పేరును ప్రపంచ పటంలోకి తీసుకువెళ్తున్నారు ఆనందరావు. ఇదే ఈవారం మన ఫుడ్ ప్రింట్స్...
చుప్పులు వాసన వస్తేనే చాలు నోరూరిపోతుంది. వాటిని వెంటనే తినాలనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల కేంద్రానికి రాగానే బస్సులో పడుకున్నవారిని సైతం నిద్రలేపుతుంది ఈ రుచి. ఇవి చాలా కాలం నుంచే ప్రసిద్ధి చెందాయి. జాతీయ రహదారిని ఆనుకుని ఈ గ్రామం ఉండటం వల్ల ఒడిషా వెళ్ళేవారంతా వీటిని కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. ఈ చుప్పులకు సుమారు 40 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇతర దేశాలలో ఉన్న తమ పిల్లలకు వీటిని పంపించడం ఆనవాయితీగా మారింది. అందువల్ల వీటి ప్రత్యేకత ఇతర దేశాలకు కూడా వ్యాపించింది.
ఇదీ చరిత్ర
1960 సంవత్సరంలో జలుమూరు నుండి పొట్ట చేత పట్టుకుని ఈ గ్రామానికి వలస వచ్చారు తంగుడు వంశీయులు. బతుకు తెరువు కోసం చుప్పుల తయారీని ప్రారంభించారు. అప్పటి నుంచి చుప్పుల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. తంగుడు వంశీయులు తమకు తెలిసిన మెళకువలను ఉపయోగించి మరిన్ని వైశ్య కుటుంబాలకు నేర్పించారు. ఇప్పుడు ప్రస్తుతం సుమారు 12 కుటుంబాల వారు వీటిని తయారుచేసి, కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఆనందరావు
మాది ఒరిస్సాలో గునుపూరు. మేం ఏడుగురు అన్నదమ్ములం. జీవనోపాధి కోసం 40 సంవత్సరాల క్రితమే ఇక్కడకు వచ్చాం. నా చిన్నప్పటి నుంచి తాతగారి దగ్గర నర్సన్నపేటలో ఉండేవాడిని. వివాహం అయ్యాక సారవకోట వచ్చాను. మేము వ్యాపారస్థులం, ఎవ్వరికీ అరువు పెట్టం. అలా చేస్తే, వ్యాపారంలో నష్టపోతామని మా నమ్మకం. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో రెండు డబ్బాల చుప్పులు తయారు చేసి అమ్మేవాళ్లం. వ్యాపారంలో లాభం అంతగా రాకపోయినా, నష్టం ఉండేది కాదు. వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. జాగ్రత్తగా నీడలో ఉంచితే, పాడు కావు. ఎండలో పెడితే మూడు రోజులకే పాడైపోతాయి. ఎప్పుడైనా ఊరు వెళ్లాలనుకుంటే మా పని ఆపుకుంటాం. మా ఆవిడ పేరు సత్యవతి. ఆవిడే తయారు చేస్తుంది. నేను దుకాణంలో కూర్చుని వ్యాపారం చూసుకుంటాను.
అలసట చూపకూడదు...
చుప్పుల తయారీలో ఏమాత్రం ఏమరుపాటు చూపినా వీటి నాణ్యత, రుచి దెబ్బతినే ప్రమాదం ఉంది. చుప్పుల తయారీకి సాంబమసూరి, సి ఆర్ రకం బియ్యాన్నే వినియోగిస్తున్నారు. ఇందులోకి దేశవాళీ నువ్వులనే వాడతారు. వీటిని సాధారణంగా మహిళలే తయారు చేస్తారు. ముందుగా బియ్యాన్ని కడిగి అరబెట్టి, తరువాత మెత్తని పిండిగా తయారు చేస్తారు. పొట్టు తీసిన నువ్వులను, బియ్యప్పిండిలో కలిపి తగినన్ని నీళ్లు, ఉప్పు, వాము కలిపి పలచగాను, చిక్కగాను కాకుండా పిండి కలుపుకుంటారు. ఈ పిండితో వృత్తాకారంగా చుట్టి, సుమారు అరగంట సేపు ఆరబెట్టి, నూనెలో దోరగా వేయిస్తారు. ఇదీ చుప్పుల తయారీ విధానం. నెలకు 50 వేల రూపాయల టర్నోవర్ ఉంది. పెళ్ళిళ్ల సీజన్‌లో మంచి గిరాకీ ఉంటుంది. సారెలో చుప్పులను తప్పనిసరిగా చేయించుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, పర్లాకిమిడి, తెంబూరు, పాతపట్నం, నరసన్నపేట ప్రాంతాలను ఈ కుటుంబీకులే చుప్పులు సరఫరా చేస్తున్నారు.
– కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం
– ఫొటోలు: వై. గణేష్, సారవకోట
Comments
Please login to add a commentAdd a comment