కావలి: ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపక్కన ఆగిఉన్న టిప్పర్‌ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పట్టణ శివారులో శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో పమిడి స్కూల్ కరస్పాండెంట్ పమిడి వెంకటసుబ్బయ్యనాయుడు(50), కలిగిరి మండలం అయ్యపురెడ్డిపాళెంకు చెందిన మన్నం చంద్రమౌళి(47) మృతి చెందారు. చిన్నారావుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలించారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసుల కథనం మేరకు.. దగదర్తి మండలం మనుబోలుపాడు చెందిన పమిడి వెంకటసుబ్బయ్యనాయుడు ముసునూరులో పమిడి కాన్సెప్ట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఆయన భార్య సుభాషిణి దుండిగం ఎంపీటీసీ. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. కలిగిరి మండలం అయ్యపురెడ్డిపాళెంకు చెందిన మన్నం చంద్రమౌళి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఆయన భార్య శిరీష, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. గురువారం అర్ధరాత్రి దాటిని తర్వాత మన్నం చంద్రమౌళి, ఆయన అన్న చిన్నారావు, మేనల్లుడు ఆనందరావు కారులో పట్టణం నుంచి జలదంకి మండలం జమ్మపాళెంలో ఉన్న ఓ డాబాకు వెళ్లారు.
అక్కడ భోజనం చేసి శుక్రవారం వేకువన తిరిగి కావలికి బయలుదేరారు. పట్టణ శివారు ప్రాంతమైన బుడంగుంట ఇందిరమ్మ కాలనీకి సమీపించే సరికి ప్రమాదం జరిగింది. చంద్రమౌళి, వెంకట సుబ్బయ్యనాయుడు ప్రమాదస్థంలోనే చనిపోగా గాయపడిన ఆనందరావును 108 వాహన సిబ్బంది చికిత్స కోసం కావలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చిన్నారావు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని వైద్యశాలకు తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.
జెడ్పీచైర్మన్ పరామర్శ
జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఏరియా వైద్యశాలకు వచ్చి మృతుల కుటుంభ సభ్యులను, బంధువులను పరామర్శించారు. కావలి ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, వివిధ పార్టీల నాయకులు ఏరియా వైద్యశాలకు వచ్చారు.
ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న కారు ఇద్దరు దుర్మరణం
Published Sat, Mar 14 2015 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement
Advertisement