సోంపేట.. షేక్
సోంపేట:దాదాపు దశాబ్దం క్రితం.. ఆనంద్ జ్యూయలర్స్ యజమాని కుటుంబం హత్య, భారీ దోపిడీ..
అక్కడికి కొన్నాళ్ల వ్యవధిలోనే.. పైడిశెట్టి ప్రతాప్ షాపు మూసి ఇంటికి వెళుతుండగా.. అతనిపై దాడి, దోపిడీ..
ఆ తర్వాత నుంచి చిన్నా చితకా చోరీలు తప్ప దాదాపు ప్రశాంతంగానే ఉన్న సోంపేట మళ్లీ బుధవారం ఉలిక్కిపడింది. భయంతో వణికిపోతోంది. కారణం..బుధవారం రాత్రి ఒక వ్యాపారస్తుని స్కూటర్ డిక్కీలో ఉంచిన లక్షల విలువైన బంగారు నగలు, నగదు అనూహ్య రీతిలో చోరీకి గురి కావడ మే.. పోలీస్ స్టేషన్ ఎదురుగానే జరిగిన ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.
ఏం జరిగిందంటే..
తంగుడు ఆనందరావు పట్టణంలోని పెద్దబజారు వీధిలో బాబా జ్యూయలర్స్ షాపు పెట్టుకొని నగల వ్యాపారం చేస్తున్నారు. రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి 8.20 గంటల ప్రాంతంలో షాపు మూసివేశారు. అంతకు ముందు ఆయన ఇంటికి కావలసిన టిఫిన్ కోసం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వెంకటసాయి హోటల్‌కు ఫోన్‌లో ఆర్డరు ఇచ్చారు. అనంతరం షాపులో ఉన్న సుమారు కిలో బంగారు నగలు, రూ.1.50 లక్షల నగదు బ్యాగులో సర్ది షాపుకు తాళం వేశారు. నగల బ్యాగును తన ద్విచక్ర వాహనం సీటు కింద డిక్కీలో పెట్టి ఇంటికి బయలుదేరారు. మధ్యలో హోటల్ వద్ద ఆగి టిఫిన్ పార్శిల్ తీసుకొని చర్చి వీధిలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయారు. వాహనం పార్క్ చేసి నగల బ్యాగు కోసం చూస్తే అది కనిపించలేదు. దాంతో కంగారు పడిన ఆయన టిఫిన్ కోసం హోటల్ దగ్గర వాహనం ఆపినప్పుడే ఎవరో బ్యాగు కొట్టేసి ఉంటారని భావించారు. వెంటనే హోటల్ వద్దకు వెళ్లి వాకబు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాగులో ఉన్న నగల విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సర్వత్రా ఆందోళన
షాపు మూసిన తర్వాత హోటల్ దగ్గర తప్ప ఎక్కడా ఆగలేదని బాధితుడు ఆనందరావు చెప్పారు. టిఫిన్ ముందుగానే ఆర్డర్ ఇచ్చినందున అక్కడ కూడా ఎక్కువ సేపు ఆగలేదని, ఈలోగానే దారుణం జరిగిపోయిందని చెబుతూ భోరున విలపించారు. తెలిసిన వారు. తన దినచర్యను గమనిస్తున్న వారి పనే అయ్యుంటుందన్న అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈ సంఘటనతో పట్టణ ప్రజలు, ముఖ్యంగా వ్యాపారస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పదేళ్ల క్రితం ఇదేస్థాయిలో రెండు దోపిడీలు జరిగిన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆనంద్ జ్యూయలర్స్ యజమాని వూనా తాతారావు ఇంటిలోకి దుండగులు చొరబడి , తాతారావుతోపాటు ఆయన తల్లి, కుమార్తెలను హత్య చేసి నగదు, బంగారం దోచుకుపోయారు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే పైడి శెట్టి ప్రతాప్ అనే వ్యాపారి షాపు మూసి, బంగారంతో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా, ఇంటి సమీపంలోనే అతనిపై దాడి చే సి బంగారం ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత నుంచి చిన్న చిన్న చోరీలు తప్ప పెద్ద సంఘటనలేవీ లేకపోవడంతో ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఘటనతో బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. సమాచారం అందుకున్న వెంటనే కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ సోంపేటకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. సోంపేట ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.