సబ్‌ప్లాన్ నిధులపై నిర్లక్ష్యం తగదు
కర్నూలు (అర్బన్): దళితులు, గిరిజనులకు కేటాయించిన సబ్‌ప్లాన్ నిధుల పట్ల ప్రభుత్వం వివక్ష వహిస్తే ప్రతిఘటిస్తామని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ ఆనంద్‌బాబు హెచ్చరించారు. స్థానిక కొత్తబస్టాండ్ సమీపంలోని కేకే భవన్లో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు అనే అంశంపై కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్ అధ్యక్షతన గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
కార్యక్రమానికి సీఐటీయూ, ఉపాధి, డీకేఎస్, పీఎన్ఎం, వ్యవసాయ, చేనేత, దళిత సంఘాల ప్రతినిధులు పీఎస్ రాధాక్రిష్ణ, టీపీ శీలన్న, జేఎన్ శేషయ్య, ఆర్ఏ వాసు, కేవీ నారాయణ, కె.సూర్యచంద్రన్న హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలుకు వచ్చిన సందర్భంగా తీపి కబురు చెబుతారని ఆశించిన వారందరికీ నిరాశే ఎదురైందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా చేపట్టిన పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేద ని వాపోయారు.
దీంతో దళిత, గిరిజన కాలనీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయని వాపోయారు. పదేళ్లపాటు పోరాడి సాధించుకున్న సబ్‌ప్లాన్‌కు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయే తప్ప ఆచరణకు నోచుకోలేదన్నారు. ఉప ప్రణాళిక అమలుకు రూ. 4,900 కోట్లు కేటాయిస్తామన్న మంత్రి రావెల కిశోర్‌బాబు గొంతు మూగబోయిందన్నారు. కేవీపీఎస్ నగర కార్యదర్శి ఎం.విజయ్, వీవైఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు.