Anandraj
-
తెలుగు ప్రేక్షకులు బెస్ట్: నటుడు
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ముద్దుల మావయ్య సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చిందని, అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నానని ప్రముఖ సినీ నటుడు ఆనంద్‌రాజ్ అన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు బెస్ట్ అంటూ ప్రశంసించారు. బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా విశాఖలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తొలిసారిగా సింహాచలం వచ్చానన్నారు. అప్పటి నుంచి ఎప్పుడు విశాఖ వచ్చినా.. వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుంటున్నట్టు తెలిపారు. 1986 నుంచి సినిమాల్లో నటిస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా ఆనంద్‌రాజ్ స్వామికి పూజలు నిర్వహించారు. (చదవండి: కిల్ రాజు అంటావా..సినిమా ఎవడు ఇస్తాడు?) -
బిగ్‌బాస్ హౌస్‌లోకి వనిత కూతురు
సాక్షి, చెన్నై : తల్లిదండ్రుల విభేదాల మధ్య నలిగిపోయిన నటి వనిత కుమార్తె జెనితరాజన్ ఎట్టకేలకు తండ్రి చెంతకే చేరినట్లు సమాచారం. దివంగత సీనియర్ నటి మంజుల, నటుడు విజయకుమార్ కుమార్తె వనిత, ఆమె మాజీ భర్త ఆనంద్‌రాజ్ మధ్య గత కొన్ని నెలలుగా న్యాయ పోరు నేపథ్యంలో గత నాలుగు రోజులుగా చెన్నైలో హైడ్రామా నడిచింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యక్షురాలు వసుంధర శ్రీనివాస్, తెలంగాణ, తమిళనాడు పోలీసులు బిగ్‌బాస్ హౌస్ వేదికగా బుధవారం సాయంత్రం వరకు జరిపిన చర్చల్లో చివరకు చిన్నారి జెనితరాజన్ తండ్రి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. కూతురు తన వద్దే ఉందని అంగీకరించిన వనిత వనిత 2007లో ఆనందరాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి జెనిత రాజన్ అనే కూతురు ఉంది. కొంతకాలం సజావుగా సాగిన వీరి సంసార జీవితంలో మనస్పర్థల కారణంగా 2012లో దంపతులు విడిపోయారు. 2015లో చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు వీరికి విడాకులను మంజూరు చేసింది. కూతురి సంరక్షణ బాధ్యతలను తండ్రికే అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆనంద్‌రాజ్ తన కూతురితో సహా హైదరాబాద్‌లో నివశిస్తున్నాడు. గత ఫిబ్రవరిలో వనిత హైదరాబాద్‌కు వెళ్లి పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న కూతురిని తీసుకెళ్లిపోయింది. దీంతో ఆనంద్‌రాజ్ హైదరాబాద్ పోలీసులకు తన కూతురిని వనిత కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనిత కోసం గాలిస్తున్నారు. అయితే ఆమెకు చెన్నైలో స్థిర నివాసం లేకపోవడంతో ఆమెను కనిపెట్టి విచారించడం కష్టతరంగా మారింది. బిగ్‌బాస్ 3 సెట్లోకి పోలీసులు.. ఏ క్షణమైనా వనిత అరెస్ట్! బిగ్‌బాస్ హౌస్‌లో వనిత ఈ పరిస్థితుల్లో బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో నటి వనిత ఆచూకీని తెలిపింది. బిగ్‌బాస్ సీజన్–3లో వనిత పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ సౌత్ ఇండియన్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వసుంధర శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసు బృందం తెలంగాణ హోంమినిస్టర్ ఆదేశాల మేరకు బుధవారం చెన్నైకి వచ్చారు. చెన్నై పోలీసుల సహకారంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. వనితను ఆమె కూతురు జెనిత రాజన్ గురించి విచారించగా ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. మరోసారి విచారించిన వసుంధర శ్రీనివాస్ సాయంత్రం 5 గంటలలోపే జెనిత రాజన్ గురించిన సమాచారం అందించాలని హెచ్చరించారు. దీంతో వనిత తన కూతురిని బిగ్‌బాస్ హౌస్‌కు రప్పించారు. అయితే జెనితారాజన్ తన తల్లి, ఆమె తరఫు న్యాయవాది చెప్పినట్లుగా అమ్మతోనే ఉంటానని చెప్పింది. ఇదిలా ఉండగా తండ్రి ఆనందరాజ్.. వనిత తన కూతురిని కిడ్నాప్ చేసిందని, న్యాయస్థానం ఆదేశాలతోనే తాను తన కూతురి సంరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల సమయంలో కూతురిపై వనితకు లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చిందని, ఏదో దురుద్ధేశంతోనే తను తన కూతురిని కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. తన కూతురి ఇష్టాఇష్టాలు, తనకేం కావాలో, తన అవసరాలేంటో ఇంతకాలంగా పోషిస్తున్న తనకే తెలుసని, బిడ్డను తీసుకొచ్చి ఎక్కడో పరాయి పెంపకంలో ఉంచి బిగ్‌బాస్ రియాలిటీ గేమ్‌షోలో 100 రోజులు పాల్గొనడానికి సిద్ధం అయిన వనితలో తల్లి ప్రేమ ఎక్కడుందని ఆనంద్‌రాజ్ ప్రశ్నించారు. విచారణలో చివరికి తనకు బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోనే ముఖ్యం అని, కూతురు జెనితరాజన్ను తండ్రికే అప్పగించడానికి నటి వనిత అంగీకరించినట్లు తెలిసింది. బిగ్‌బాస్ హౌస్ నియమ నిభంధనలకు వ్యతిరేకంగా నటి వనిత తన కూతురును హౌస్‌లోకి తీసుకురావడం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ వ్యవహారం ఆ హౌస్‌లో కలకలానికి దారి తీసింది. -
ఏ తల్లికి ఈ పరిస్థితి రాకూడదు: సినీనటి
చెన్నై: బిడ్డల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏ తల్లికి రాకూడదని ప్రముఖ సినీనటి వనిత విజయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ ప్రముఖ సినీనటి వనిత విజయకుమార్, తిరువళ్లూరు జిల్లా పూందమల్లిలో నివాసం ఉంటున్నారు. ఆమెకు హైదరాబాద్‌కు చెందిన ఆనందరాజ్‌తో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి జెనీతా(10) అనే కుమార్తె ఉంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. జెనీతా హైదరాబాద్‌లో నివాసం వుండేది. ఈ నేపథ్యంలో 2012లో తన కుమార్తెను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆరోపించిన వనిత, హైదరాబాద్‌లో ఉంటున్న చిన్నారిని తనతో పాటు తీసుకొచ్చింది. దీంతో ఆనందరాజ్ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తన కుమార్తెను భార్య వనిత కిడ్నాప్ చేసిందని ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ కేసు నమోదు చేశారు. భార్య వద్ద నుంచి కుమార్తెను అప్పగించాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించిన వనిత విజయకుమార్ జెనీతాకు తాను అమ్మనని, ప్రస్తుతం తనతోనే ఉందని..చిన్నారిపై పూర్తి హక్కును తనకు అప్పగించాలని కోరుతూ పూందమల్లి కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో సంబంధిత కేసును పూందమల్లి నుంచి తిరువళ్లూరు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసు విచారణ శుక్రవారం ఉదయం తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి సెల్వనాథన్ ఎదుట సాగింది. విచారణకు ఆనందరాజ్ హాజరు కాకపోవడంతో తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వనిత విజయకుమార్, తన బిడ్డ కోసం కోర్టు మెట్లు ఎక్కానని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అన్నారు. తనకు న్యాయం జరుగుందనే నమ్మకం ఉందన్నారు. -
ఐయామ్ కనకాంబ్రం... బ్రదర్ ఆఫ్ ఏకాంబ్రం
ఏకాంబ్రం తమ్ముడి పేరు కనకాంబ్రం.పేరులో బంగారం ఉండొచ్చుగానీ ఆయన మనసు మాత్రం విషమయం. ఎప్పుడూ ఎవరి మీదో ఒకరి మీద నిప్పులు కక్కుతూనే ఉంటాడు.‘సాలా మర్గయా’ అని అరుస్తూనే ఉంటాడు.తనకు తానే నిప్పుతో వాతలు పెట్టుకుంటూ ‘రా...యు...డూ’ అని పెద్దగా అరుస్తున్న అతడి పేరు భూపతి. అతనికేమైనా పిచ్చా? కాదు కసి! ఎవరి మీద? ఇదిగో ఆయన మాటల్లోనే వినండి.‘ఆ రాయుడు వంశం మీద నా పగ చల్లారకుండా రగులుతూ ఉండడానికి ఈ వాతలు పెట్టుకుంటున్నాను’. చెవిని కిందికిలాగుతూ విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చే కనకాంబ్రంగా ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో, అవమానభారంతో రగిలిపోయే అగ్నిపర్వతంలా కనిపించే భూపతి పాత్రలో ‘పెదరాయుడు’లో కనిపించిన ఆనంద్‌రాజ్ తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత విలన్. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘యాక్షన్ జాక్సన్’తో బాలీవుడ్‌కు కూడా పరిచయమైన ఆనంద్‌రాజ్ పాండిచ్చేరిలో పుట్టి పెరిగాడు. తండ్రి వ్యాపారవేత్త. మంచి ఫిజిక్ ఉండడంతో కుమారుడు పోలీస్ ఆఫీసర్ కావాలనుకునేవాడు తండ్రి. కానీ ఆనంద్కేమో సినిమాలు ఇష్టం. ఒక ఫైన్‌మార్నింగ్... ‘‘నాకు నటన మీద ఆసక్తి ఉంది’’ అని ఆనంద్‌రాజ్ చెప్పడంతో తల్లిదండ్రులేమీ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అలా మద్రాస్‌లోని ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ఇక్కడ శివరాజ్ కుమార్ (కన్నడ హీరో) ఆనంద్‌కు సహ విద్యార్థి.కమలహాసన్‌తో సహా రకరకాల క్రాఫ్ట్‌లకు సంబంధించిన ప్రముఖులు గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వస్తుండేవాళ్లు. అలా వచ్చిన వారిలో కొందరు, విద్యార్థులను పరిశీలిస్తూ ‘నువ్వు భవిష్యత్‌లో హీరో అవుతావు’, ‘విలన్ అవుతావు’ అని జోస్యం చెప్పేవాళ్లు. అయితే ఆనంద్ విషయంలో మాత్రం ఎవరూ ఏమీ చెప్పలేదు. దీంతో డీలాపడిపోయేవాడు ఆనంద్. యాక్టింగ్ కోర్సు పూర్తికాగానే అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయిని భావించాడు. అయితే అలాంటిదేమీ జరగలేదు.సత్యరాజ్ విలన్ పాత్రల నుంచి హీరో పాత్రలు చేస్తున్న కాలం అది. అంటే విలన్ సీటు ఖాళీగానే ఉంది. ఈ టైమ్‌లోనే ‘ఒరువర్ వాళుమ్ ఆలయం’, ‘ఉరిమై గీతం’ సినిమాలతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు ఆనంద్‌రాజ్. ఈ రెండు సినిమాలు బ్లాక్బస్టర్లు అయినప్పటికీ పి.వాసు సినిమా ‘ఎన్ తంగై పడిచ్చవ’ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ‘‘హీరో పాత్రలో ఎంత దమ్ముందో... నువ్వు చేస్తున్న విలన్ పాత్రల్లో కూడా అంతే దమ్ముంది’’ అంటూ తన ఆరాధ్య నటుడైన శివాజీ గణేషన్ తనకు ఇచ్చిన కాంప్లిమెంట్ను ఎప్పుడూ గుర్తు చేసుకునే ఆనంద్‌రాజ్... ముద్దుల మామయ్య, లంకేశ్వరుడు, ఒంటరి పోరాటం, బావాబావమరిది, శుభాకాంక్షలు, పెదరాయుడు, గ్యాంగ్‌లీడర్... మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. -
రొమాన్స్... కామెడీ...
ఆనంద్‌రాజ్, సందీప్, పూజిత, సారిక ముఖ్యతారలుగా గణ మురళి దర్శకత్వంలో విద్యాసాగర్ మరిపి నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే కోరుకుంటా’. ఈ చిత్రం పాటలను నవంబరు 7న విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘యథార్థ ఘటనల ఆధారంగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని పాటలకూ ప్రణవ్ మంచి స్వరాలందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వర లో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాహు, బిట్ర ప్రకాశ్, కెమెరా: రామ్‌కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి.