అరిచిందని చంపేశారు..
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని గాంధీపార్కులో గత నెల 28న వెలుగు చూసిన మహిళ ‘హత్యా’చారం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించి నిందితుల్ని రిమాండుకు తరలించారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజకుమారి కేసు వివరాలు వెల్లడించారు. ధారూరు మండలం మైలారం ముందు తండాకు చెందిన రమావత్ చాప్లీబాయ్ (45) భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె వికారాబాద్ పట్టణంలో కూలీపనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకునేది. మద్యానికి బానిసైన ఆమె గతనెల 27న రాత్రి 9 గంటల సమయంలో వికారాబాద్‌లోని అనంత్ వైన్స్ వద్ద కూర్చొని ఉంది.
వికారాబాద్ రాజీవ్ గృహకల్పకు చెందిన ఎండీ గౌస్, ఎండీ అలీలు హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. రైలు అప్పటికే వెళ్లిపోవడంతో వారు స్టేషన్ సమీపంలోని అనంత్ వైన్స్ వైపుగా వచ్చారు. అంతకుముందే వారు మద్యం తాగి ఉన్నారు. వారిద్దరు ఒంటరిగా ఉన్న చాప్లీబాయిని గమనించారు. వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసినట్లు నటించి ఆమెతో మాటలు కలిపారు. కొద్దిసేపటి తర్వాత మద్యం తాగుదామని వారు చెప్పి చాప్లీబాయిని గాంధీ పార్కులోకి తీసుకెళ్లారు. అంధకారంగా ఉన్న పార్క్‌లో ఎండీ గౌస్, ఎండీ అలీలు ఆమెపై అత్యాచారం చేశారు.
అరిచిందని అంతం చేశారు..
కొద్దిసేపటికి తర్వాత గౌస్, అలీలు చాప్లీబాయిపై రెండోసారి అఘాయిత్యం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆమె కేకలు వేసింది. అరుపులకు ఎవరైనా వస్తారేమోనని భయపడిన అలీ చాప్లీబాయి గొంతు కొరికాడు. అయినా ఆమె కేకలు ఆపకపోవడంతో తన జేబులో ఉన్న చేతిరూమాలును తీసి గొంతుకు బిగించి చంపేశాడు. దీనికి గౌస్ సహకరించాడు. మరుసటి రోజు ఉదయం ధారూరు మైలారం ముందు తండాకు చెందిన విద్యార్థులు సేదతీరేందుకు గాంధీ పార్క్‌కు రావడంతో మహిళ విగతజీవిగా పడి ఉంది. ఆమెను చాప్లీబాయిగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.
మున్సిపల్ ఆర్ఐ ఎదుట లొంగిపొయిన నిందితులు...
మహిళ ‘హత్యా’చారం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో పోలీసులకు పట్టుబడుతామేమోనని భయపడిన నిందితులు బుధవారం సాయంత్రం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఆర్ఐ షేక్‌అలీ ఎదుట లొంగిపోయారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించి పైవిషయాలు తెలిపారు. నిందితుల్ని గురువారం రిమాండుకు తరలించారు. కేసును త్వరగా ఛేదించిన డీఎస్పీ స్వామి, సీఐ రవి, ఎస్ఐ శేఖర్‌ను,ఐడీ పార్టీ పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి అభినందించారు.