Angel investing
-
స్టార్టప్స్‌లో గూగుల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్... భారత్‌కు చెందిన రెండు స్టార్టప్‌లు–గ్లాన్స్ ఇన్మోబి, వర్స్ ఇన్నోవేషన్‌ల్లో పెట్టుబడులు పెట్టింది. తన 1,000 కోట్ల డాలర్ల గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్‌లో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టినట్లు గూగుల్ పేర్కొంది. అయితే ఈ స్టార్టప్‌ల్లో ఎంత మేరకు ఇన్వెస్ట్ చేసిందీ గూగుల్ వెల్లడించలేదు. అయితే పెట్టుబడులు పొందిన స్టార్టప్‌లు మాత్రం ఆ వివరాలను వెల్లడించాయి. గ్లాన్స్‌లో రూ.1,072 కోట్ల పెట్టుబడులు గూగుల్ సంస్థ తమ కంపెనీలో రూ.1,072 కోట్లు(14.5 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేసిందని గ్లాన్స్ ఇన్మోబి సంస్థ పేర్కొంది. ఇక తమ కంపెనీలో గూగుల్ సంస్థ రూ.739 కోట్లు(10 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేసినట్లు వర్స్ ఇన్నోవేషన్ పేర్కొంది. ఈ సంస్థ డైలీ హంట్, షార్ట్ వీడియో యాప్ జోష్లను నిర్వహిస్తోంది. స్టార్టప్‌లకు గూగుల్ తోడ్పాటు.. భారత్‌లో వినూత్నమైన స్టార్టప్‌లకు తోడ్పాటునందించగలమన్న దానికి తాజా పెట్టుబడులే నిదర్శనమని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్‌గుప్తా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగించే సమ్మిళిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టామని వివరించారు. ఇంటర్నెట్ అనుసంధానత మెరుగుపడటం, చౌక ధరలకే డేటా లభించడం... ఈ రెండు కారణాల వల్ల భారత్‌లో స్టార్టప్‌ల జోరు పెరుగుతోందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో 10 కోట్ల మంది గ్రామీణులు ఇంటర్నెట్ యూజర్లయ్యారని, ఇప్పుడు మొత్తం మొబైల్ డేటా వినియోగంలో గ్రామీణుల వినియోగం 45 శాతంగా ఉందని వివరించారు. 1,000 కోట్ల డాలర్ల గూగుల్ ఫండ్ ఈ ఏడాది జూలైలో 1,000 కోట్ల డాలర్ల గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్‌ను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. దేశంలో డిజిటల్ టెక్నాలజీల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడానికి ఐదు నుంచి ఐదేళ్లలో స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం కోసం ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అప్పుడు పేర్కొన్నారు. -
స్టార్టప్‌లకు ఉపశమనం!
న్యూఢిల్లీ: పన్నుకు సంబంధించి స్టార్టప్ సంస్థల్లో నెలకొన్న భయాందోళనలు కాస్త ఉపశమించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏంజెల్ ఫండ్స్ వెచ్చించే పెట్టుబడులపై స్టార్టప్స్ పన్ను మినహాయింపులను కోరేందుకు సంబంధించిన ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఏంజెల్ ఫండ్స్ ద్వారా తాము సమీకరించిన నిధులపై పన్నులు చెల్లించాలంటూ ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ నుంచి తమకు నోటీసులందటంపై స్టార్టప్స్ వ్యవస్థాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఐటీ చట్టంలోని సెక్షన్ 56 (2) కింద స్టార్టప్ సంస్థలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. స్టార్టప్‌కు పన్ను మినహాయింపు నిబంధనల విషయంలో తాజా మార్పుల నోటిఫికేషన్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆమోదం తెలిపినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ‘త్వరలో అమల్లోకి రానున్న కొత్త విధానం ప్రకారం స్టార్టప్స్ గనుక ఏంజెల్ ఫండ్స్‌పై పన్ను మినహాయింపులను కోరాలంటే ముందుగా పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డీఐపీపీ) దరఖాస్తు చేసుకోవాలి. నిర్ధేశిత స్టార్టప్ దరఖాస్తును తగిన ధ్రువపత్రాలతో కలిపి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగానికి (సీబీడీటీ) డీఐపీపీయే పంపుతుంది. దరఖాస్తును అందుకున్న 45 రోజుల్లోగా స్టార్టప్‌లకు పన్ను మినహాయింపునకు ఆమోదం తెలపడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తిరస్కరించడంపై సీబీడీటీ కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో నోటిఫికేషన్... గతంలో స్టార్టప్‌లు సమర్పించే పన్ను మినహాయింపు దరఖాస్తును అంతర్ మంత్రిత్వ శాఖల విభాగం ధ్రువీకరణ కోసం పంపేవారు. దీనివల్ల జాప్యం అయ్యేంది. ఇప్పుడు డీఐపీపీ ద్వారా నేరుగా సీబీడీటీకి పంపేలా ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వం వర్గాలు వివరించాయి. అదేవిధంగా స్టార్టప్‌లు విక్రయించిన షేర్లకు మార్కెట్ విలువ ఎంతనేది నిర్ధారిస్తూ మర్చెంట్ బ్యాంకర్ నుంచి నివేదికను తీసుకొని సమర్పించాలన్న గత నిబంధనను కూడా తాజాగా తొలగించారు. డీఐపీపీ గుర్తింపు ఉన్న స్టార్టప్‌లన్నీ కొన్ని షరతులకు లోబడి ఈ పన్ను మినహాయింపు పొందే వీలుంది. ప్రధానంగా ఖాతాల వివరాలతోపాటు గడిచిన మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాలి. అలాగే ఏంజెల్ ఇన్వెస్టర్లు కూడా తమ నెట్‌వర్త్, పెట్టుబడిపై ఎంత ఆదాయం వచ్చింది అనే వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. కాగా, ఏంజెల్ ఫండ్స్ ఇతరత్రా ఇన్వెస్టర్ల నుంచి రూ.10 కోట్లకు మించి జరిపిన నిధుల సమీకరణపై పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుందని 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఐటీ చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం స్టార్టప్స్ తమకున్న మార్కెట్ విలువకు మించి జరిపే నిధుల సమీకరణపై 30 శాతం పన్ను విధించేందుకు వీలుంది. దీని ఆధారంగానే ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. కాగా, పన్ను మినహాయింపు నిబంధనల్లో తాజా మార్పులన్నీ నోటిఫికేషన్ జారీ అయినతర్వాత అమల్లోకి వస్తాయని.. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి కొత్త నిబంధనలు వర్తించవని ఆయా వర్గాలు తెలిపాయి. ఏటా 300– 400 స్టార్టప్‌లకు ఏంజెల్ ఫండ్స్ నుంచి నిధులు అందుతుండగా... 2018 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ కేవలం రెండు స్టార్టప్స్‌కు మాత్రమే పన్ను మినహాయింపు లభించడం గమనార్హం. ఈ అంశాన్ని కూడా మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేయండి ప్రధానిని కోరిన ఐస్పిర్ట్ న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు శాపంగా మారిన ఏంజెల్ ట్యాక్స్‌ను తక్షణం రద్దు చేయాలని స్టార్టప్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐస్పిర్ట్... ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ మేరకు ఈ సంస్థ ఒక లేఖ రాసింది. స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్ అని పేర్కొంది. ఏంజెల్ ఇన్వెస్టర్లు ఎంతో రిస్క్ తీసుకొని ఈ పెట్టుబడుల పెడతారని, విదేశాల్లో ఇలాంటి పెట్టుబడులకు నజరానాలిస్తుండగా, ఇక్కడ మాత్రం పన్నులు వేసి పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు వస్తుండటంతో పలు స్టార్టప్‌లు బెంబేలెత్తుతున్నాయని, కొన్ని మూతపడుతున్నాయని పేర్కొంది. ఈ ఏంజెల్ ట్యాక్స్‌ను తక్షణం రద్దు చేయాలని, అలా కుదరని పక్షంలో కనీసం నిబంధనలను సరళీకరించాలని కోరింది. స్టార్టప్‌లలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల వరకు ఇన్నోవాక్సర్లో తొలి పెట్టుబడి బెంగళూరు: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్ స్టార్టప్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన కార్పొరేట్ వెంచర్ ఫండ్, ఎమ్12 (గతంలో మైక్రోసాఫ్ట్ వెంచర్స్ ఫండ్‌గా వ్యవహరించేవారు) భారత స్టార్టప్‌లలో ఒక్కో కంపెనీలో 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల రేంజ్లో పెట్టుబడులు పెట్టబోతోంది. దీన్లో భాగంగా తొలి పెట్టుబడి పెట్టడానికి హెల్త్ టెక్ స్టార్టప్, ఇన్నోవాక్సర్‌ను ఎంచుకున్నామని ఎమ్12 పార్ట్నర్ రష్మి గోపీనాధ్ చెప్పారు. బీ2బీ స్టార్టప్‌లలో ఏ నుంచి సి రౌండ్ సిరీస్‌లలో నిధులు సమకూరుస్తామని పేర్కొన్నారు. బిగ్ డేటా, అనలిటిక్స్, బిజినెస్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు నిధులందిస్తామని ఆమె పేర్కొన్నారు. -
టెక్నాలజీ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేస్తా..
బెంగళూరు: ఈ అక్టోబర్‌లో పదవీ విరమణ చేసిన తర్వాత టెక్నాలజీ స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్. వ్యక్తిగత స్థాయిలో ఏంజెల్ ఇన్వెస్టరుగా ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఈ నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే 10వ ఇండియా ఇన్నోవేషన్ సమ్మిట్ ఏర్పాట్లను వివరించేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ‘నాకు తెలిసిందల్లా టెక్నాలజీనే. అందులో డిజిటల్, మార్కెటింగ్, ఈ-రిటైలింగ్ లాంటి వాటికి డిమాండ్ బాగా ఉంది. కాబట్టి వాటిలో లేదా అలాంటి ఇతర విభాగాలపైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది’ అని గోపాలకృష్ణన్ చెప్పారు. ఉత్పత్తుల విభాగంలోనూ అవకాశాలు ఉన్నాయని.. అయితే భవిష్యత్‌లో సేవలు, ఉత్పత్తుల మధ్య హద్దులు చెరిగిపోగలవని ఆయన తెలిపారు. చాలా మటుకు ఉత్పత్తులు రాబోయే కాలంలో సర్వీసుల రూపం సంతరించుకోవచ్చన్నారు. కాబట్టి ఐటీలో కొత్త ఆవిష్కరణలపైనే తాను దృష్టి పెట్టదల్చుకున్నానని గోపాలకృష్ణన్ వివరించారు. దేశీయంగానే పెట్టుబడులు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు తన ఫ్యామిలీ ఆఫీస్ కింద ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలా లేక వ్యక్తిగతంగానే ఇన్వెస్ట్ చేయాలా అన్న అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో కన్నా దేశీయంగానే ఏదైనా చేయడంపైనే తనకు ఎక్కువ ఆసక్తి అని గోపాలకృష్ణన్ తెలిపారు. రిటైరైన తర్వాత ఇన్ఫీకి ఏదైనా సహాయం కావాల్సి వస్తే ఎప్పట్లాగే తప్పకుండా అందిస్తానని చెప్పారు. ఇన్ఫోసిస్ రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో కొత్త సీఈవో విశాల్ సిక్కా గెడైన్స్ కోసం వ్యవస్థాపకులను సంప్రదించడంలో తప్పేమీ లేదని, అయితే ఇది ఈ ఒక్కసారికే పరిమితం అవుతుందని గోపాలకృష్ణన్ తెలిపారు. సిక్కా సామర్థ్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన సారథ్యంలో కంపెనీ గణనీయంగా వృద్ధి చెందగలదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడైన గోపాలకృష్ణన్ అక్టోబర్ 10 దాకా నాన్-ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. రిటైర్మెంట్పై క్రిస్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్‌ను ఏర్పాటు చేయబోయే టీమ్‌లో నేను సభ్యుడిగా ఉన్నాను. ఇది నాకెంతో ఇష్టమైన ప్రాజెక్టు. బెంగళూరు, కేరళలో నవకల్పనలు, స్టార్టప్‌లు, ఎంట్రప్రెన్యూర్షిప్ వంటి వాటిలో పాలుపంచుకుంటున్నాను. నవకల్పనలపై సీఐఐ ఏర్పాటుచేసిన జాతీయ కమిటీకి సారథ్యం వహిస్తున్నాను. వీటి ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం. చివరిగా సామాజిక కార్యక్రమాలపైనా దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పటికే మా కుటుంబ ట్రస్టు ద్వారా విద్యార్థులకు ఉపకారవేతనాల రూపంలో సాయం చేస్తున్నాం’.