స్టార్టప్‌లకు ఉపశమనం! | Govt eases process to seek tax exemption on angel fund investments | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌లకు ఉపశమనం!

Published Thu, Jan 17 2019 4:59 AM | Last Updated on Thu, Jan 17 2019 4:59 AM

Govt eases process to seek tax exemption on angel fund investments - Sakshi

న్యూఢిల్లీ: పన్నుకు సంబంధించి స్టార్టప్‌ సంస్థల్లో నెలకొన్న భయాందోళనలు కాస్త ఉపశమించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏంజెల్‌ ఫండ్స్‌ వెచ్చించే పెట్టుబడులపై స్టార్టప్స్‌ పన్ను మినహాయింపులను కోరేందుకు సంబంధించిన ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఏంజెల్‌ ఫండ్స్‌ ద్వారా తాము సమీకరించిన నిధులపై పన్నులు చెల్లించాలంటూ ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ నుంచి తమకు నోటీసులందటంపై స్టార్టప్స్‌ వ్యవస్థాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 56 (2) కింద స్టార్టప్‌ సంస్థలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.

స్టార్టప్‌కు పన్ను మినహాయింపు నిబంధనల విషయంలో తాజా మార్పుల నోటిఫికేషన్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ఆమోదం తెలిపినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ‘త్వరలో అమల్లోకి రానున్న కొత్త విధానం ప్రకారం స్టార్టప్స్‌ గనుక ఏంజెల్‌ ఫండ్స్‌పై పన్ను మినహాయింపులను కోరాలంటే ముందుగా పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డీఐపీపీ) దరఖాస్తు చేసుకోవాలి. నిర్ధేశిత స్టార్టప్‌ దరఖాస్తును తగిన ధ్రువపత్రాలతో కలిపి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగానికి (సీబీడీటీ) డీఐపీపీయే పంపుతుంది. దరఖాస్తును అందుకున్న 45 రోజుల్లోగా స్టార్టప్‌లకు పన్ను మినహాయింపునకు ఆమోదం తెలపడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తిరస్కరించడంపై సీబీడీటీ కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

త్వరలో నోటిఫికేషన్‌...
గతంలో స్టార్టప్‌లు సమర్పించే పన్ను మినహాయింపు దరఖాస్తును అంతర్‌ మంత్రిత్వ శాఖల విభాగం ధ్రువీకరణ కోసం పంపేవారు. దీనివల్ల జాప్యం అయ్యేంది. ఇప్పుడు డీఐపీపీ ద్వారా నేరుగా సీబీడీటీకి పంపేలా ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వం వర్గాలు వివరించాయి. అదేవిధంగా స్టార్టప్‌లు విక్రయించిన షేర్లకు మార్కెట్‌ విలువ ఎంతనేది నిర్ధారిస్తూ మర్చెంట్‌ బ్యాంకర్‌ నుంచి నివేదికను తీసుకొని సమర్పించాలన్న గత నిబంధనను కూడా తాజాగా తొలగించారు. డీఐపీపీ గుర్తింపు ఉన్న స్టార్టప్‌లన్నీ కొన్ని షరతులకు లోబడి ఈ పన్ను మినహాయింపు పొందే వీలుంది. ప్రధానంగా ఖాతాల వివరాలతోపాటు గడిచిన మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాలి. అలాగే ఏంజెల్‌ ఇన్వెస్టర్లు కూడా తమ నెట్‌వర్త్, పెట్టుబడిపై ఎంత ఆదాయం వచ్చింది అనే వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.  
కాగా, ఏంజెల్‌ ఫండ్స్‌ ఇతరత్రా ఇన్వెస్టర్ల నుంచి రూ.10 కోట్లకు మించి జరిపిన నిధుల సమీకరణపై పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుందని 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 56(2) ప్రకారం స్టార్టప్స్‌ తమకున్న మార్కెట్‌ విలువకు మించి జరిపే నిధుల సమీకరణపై 30 శాతం పన్ను విధించేందుకు వీలుంది. దీని ఆధారంగానే ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. కాగా, పన్ను మినహాయింపు నిబంధనల్లో తాజా మార్పులన్నీ నోటిఫికేషన్‌ జారీ అయినతర్వాత అమల్లోకి వస్తాయని.. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి కొత్త నిబంధనలు వర్తించవని ఆయా వర్గాలు తెలిపాయి. ఏటా 300– 400 స్టార్టప్‌లకు ఏంజెల్‌ ఫండ్స్‌ నుంచి నిధులు అందుతుండగా... 2018 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకూ కేవలం రెండు స్టార్టప్స్‌కు మాత్రమే పన్ను మినహాయింపు లభించడం గమనార్హం. ఈ అంశాన్ని కూడా మంత్రి సురేష్‌ ప్రభు కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు.

ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు చేయండి ప్రధానిని కోరిన ఐస్పిర్ట్‌
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు శాపంగా మారిన ఏంజెల్‌ ట్యాక్స్‌ను తక్షణం రద్దు చేయాలని స్టార్టప్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐస్పిర్ట్‌... ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ మేరకు ఈ సంస్థ ఒక లేఖ రాసింది. స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్‌ అని పేర్కొంది. ఏంజెల్‌ ఇన్వెస్టర్లు ఎంతో రిస్క్‌ తీసుకొని ఈ పెట్టుబడుల పెడతారని,  విదేశాల్లో ఇలాంటి పెట్టుబడులకు నజరానాలిస్తుండగా, ఇక్కడ మాత్రం పన్నులు వేసి పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు వస్తుండటంతో పలు స్టార్టప్‌లు బెంబేలెత్తుతున్నాయని, కొన్ని మూతపడుతున్నాయని పేర్కొంది. ఈ ఏంజెల్‌ ట్యాక్స్‌ను తక్షణం రద్దు చేయాలని, అలా కుదరని పక్షంలో కనీసం నిబంధనలను సరళీకరించాలని కోరింది.

స్టార్టప్‌లలో మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడులు

20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల వరకు

ఇన్నోవాక్సర్‌లో తొలి పెట్టుబడి   
బెంగళూరు: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం  మైక్రోసాఫ్ట్‌ భారత్‌ స్టార్టప్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన కార్పొరేట్‌ వెంచర్‌ ఫండ్, ఎమ్‌12 (గతంలో మైక్రోసాఫ్ట్‌ వెంచర్స్‌ ఫండ్‌గా వ్యవహరించేవారు) భారత స్టార్టప్‌లలో ఒక్కో కంపెనీలో 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల రేంజ్‌లో పెట్టుబడులు పెట్టబోతోంది. దీన్లో భాగంగా తొలి పెట్టుబడి పెట్టడానికి హెల్త్‌ టెక్‌ స్టార్టప్, ఇన్నోవాక్సర్‌ను ఎంచుకున్నామని ఎమ్‌12 పార్ట్‌నర్‌ రష్మి గోపీనాధ్‌ చెప్పారు. బీ2బీ స్టార్టప్‌లలో ఏ నుంచి సి రౌండ్‌ సిరీస్‌లలో నిధులు సమకూరుస్తామని పేర్కొన్నారు. బిగ్‌ డేటా, అనలిటిక్స్, బిజినెస్‌ సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెషీన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు నిధులందిస్తామని ఆమె పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement