న్యూఢిల్లీ: వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టో కరెన్సీలు, ఎన్‌ఎఫ్‌టీలు)లో లాభాలు సంపాదించి.. రిటర్నుల్లో ఆ విషయాన్ని వెల్లడించకపోతే ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు. ఎందుకంటే వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీలను 30 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ 2022–23 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేర్చడం తెలిసిందే. దీని ప్రకారం క్రిప్టో లావాదేవీల్లో వచ్చిన లాభంపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఈ లావాదేవీలకు సంబంధించి పన్ను చెల్లింపుదారులే స్వయంగా తమ రిటర్నుల్లో వెల్లడించేవారు. స్వయంగా కోరి తీసుకుంటే తప్ప ఆదాయపన్ను శాఖకు ఆ లావాదేవీల వివరాలు ఇప్పటి వరకు తెలిసేవి కావు.
కానీ, ఇక మీదట స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల మాదిరే వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల వివరాలు కూడా ఆటోమేటిగ్గా ఆదాయపన్ను శాఖకు వెళ్లనున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం అన్ని బ్యాంకులు, క్రిప్టో ఎక్సేంజ్‌లను వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల వివరాలను నివేదించాలని కోరనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్యాంకులు, క్రిప్టో ఎక్సేంజ్‌లకు ఈ ఆదేశాలు వెళితే.. అనంతరం క్రిప్టోలు, ఎన్‌ఎఫ్‌టీ లావాదేవీల వివరాలు ఇన్వెస్టర్ల పాన్ నంబర్ ఆధారంగా ఆదాయపన్ను శాఖకు చేరతాయి. అవి వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ప్రతిఫలిస్తాయి. ఏఐఎస్ అన్నది 46 ఆర్థిక లావాదేవీల వివరాలతో కూడిన రిపోర్ట్. ప్రతీ పన్ను చెల్లింపుదారు ఆదాయపన్ను శాఖ పోర్టల్‌కు వెళ్లి దీన్ని పొందొచ్చు. రిటర్నులు దాఖలు చేయడానికి ముందు ఏఐఎస్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది.
లీకేజీలకు చెక్..: వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల వివరాలు సైతం ఏఐఎస్‌లో చేరితే.. వాటిని ఎప్పుడైనా తనిఖీ చేసేందుకు, పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ఆదాయపన్ను శాఖకు వెసులుబాటు ఉంటుంది. ‘‘ఒక్కసారి పన్ను నిబంధనలు అమల్లోకి వస్తే.. డిజిటల్ అస్తుల లావాదేవీల వివరాలను సైతం నిర్ధేశిత ఆర్థిక లావాదేవీల (ఎస్‌ఎఫ్‌టీలు) మాదిరే నివేదించాలని కోరొచ్చు’’ అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే, ఎస్‌ఎఫ్‌టీలన్నవి పన్ను చెల్లింపుదారు ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత పరిమితికి మించి చేసిన లావాదేవీలు, పెట్టుబడుల వివరాలకు సంబంధించినది.
క్రిప్టోకరెన్సీ కఠిన పన్ను నిబంధనలు
క్రిప్టోకరెన్సీలపై పన్ను నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వం గురువారం ప్రతిపాదించింది. ఈ దిశలో ఫైనాన్స్ బిల్లుకు సవరణలు తీసుకురావాలని నిర్ణయించింది. లోక్‌సభ సభ్యులకు ఈ మేరకు ఫైనాన్స్ బిల్లు, 2022కి సవరణ బిల్లు సర్క్యులేట్ అయ్యింది. వర్చువల్ డిజిటల్ ఆస్తుల నష్టాలపై పన్ను ప్రయోజనాలు పొందడాన్ని సవరణలు నిరోధిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment