సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులపై దర్యాప్తు సంస్థలు విచారణకు స్వీకరించి నేరం రుజువైతే బాబుతో పాటు ఆయన తనయుడు చిన్నబాబు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రముఖ న్యాయవాది, కార్పొరేట్ న్యాయ నిపుణుడు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఐటీ నోటీసులపై ఈడీ సుమోటోగా దర్యాప్తు చేపట్టవచ్చన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఫెమా, ఆర్‌బీఐ, కంపెనీ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు ఎన్నికల కమిషన్, విజిలెన్స్ కమిషన్ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా కేసు నమోదు చేయొచ్చని వెల్లడించారు.
పూర్తి ఆధారాలు, సాక్ష్యాలను ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొందని.. ఇవి నిజమేనని తేలితే చంద్రబాబు, లోకేశ్ జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరిట రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను అప్పగించి భారీ మొత్తంలో దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌ను, అందులోని అవినీతిని ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసిన విషయం తెలిసిందే.
డొల్ల కంపెనీల ద్వారా రూ.వందల కోట్లు స్వాహా చేసినట్లు, బాబుకు ఎవరి ద్వారా, ఏ కంపెనీ ద్వారా ఎంతెంత అందింది.. తదితర వివరాలను ఆధారాలతో సహా ఐటీ శాఖ వెల్లడించింది. దీనిపై వెంకటరామిరెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
తప్పించుకునే యత్నమెందుకు?
ఓ రాజకీయ పారీ్టకి అధ్యక్షుడిగా, మాజీ సీఎంగా చంద్రబాబు ఐటీ శాఖ నోటీసులకు బాధ్యతగా వివరణ ఇవ్వాలి. నేరమేమీ చేయనప్పుడు ఐటీ శాఖ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే యత్నం ఎందుకో చెప్పాలి. వారడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా.. అసలు తనకు నోటీసులిచ్చే అధికారమే లేదని బాబు పలుమార్లు లేఖ రాయడం చూస్తుంటే నేరం చేసినట్లు భావించాల్సి వస్తోంది. సెక్షన్–127 ప్రకారం నోటీసులిచ్చే అధికారం ఉందని ఐటీ అధికారులు స్పష్టంచేశారు. నేరుగానైనా కావొచ్చు.. తన అనుచరుల ద్వారానైనా కావొచ్చు.. రూ.118.98 కోట్లు బాబుకే అందాయని ఐటీ వివరాలతో సహా కుండబద్దలు కొట్టింది.
2023, ఆగస్టు 4న చంద్రబాబుకు ఐటీ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులో అదే నెల 11న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలన్నారు. దీనిని నేరుగా బాబు నివాసమైన ప్లాట్ నంబర్ 1310, రోడ్ నంబర్ 65, జూబ్లీహిల్స్ ఇంటికి పంపారు. ఆయన వద్ద సరైన వివరణ ఉండి ఆ రోజున హాజరై చెప్పి ఉంటే.. ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేదికాదు. కనీసం ఎప్పుడు హాజరై వివరణ ఇస్తారో కూడా చెప్పడంలేదని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొనడం చూస్తుంటే అందులోని అంశాలు పూర్తి వాస్తవమేనని స్పష్టమవుతోంది.
బోగస్ కంపెనీలు సృష్టించి..
మనోజ్ వాసుదేవ్ పార్థసాని, ఐదు కంపెనీల వాళ్లు ఇచ్చిన మెటీరియల్ పేపర్లు, బాబు పీఏ శ్రీనివాస్‌ను పరిచయం చేసిన ముగ్గురు ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఐటీ శాఖ తన నోటీసుల్లో పేర్కొంది. ఆ ముగ్గురు భారత్, దుబాయ్, ఇతర చోట్ల నుంచి నగదు తెచ్చి ఎవరెవరికి ఇచ్చారో కూడా ఉంది. తాము కాంట్రాక్టులు తీసుకుని.. ఎన్నికల నిధుల కోసం ఖర్చుపెట్టేందుకు టీడీపీకి ఇచ్చినట్లు స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు.
నోటీసుల్లో కూడా నగదంతా షాపూర్‌జీ పల్లోంజీ నుంచి చంద్రబాబుకే అందినట్లు ఉంది. షలక, అన్నై (ఎక్సెల్ ఫ్రమ్ వినయ్ నంగాలియా) నుంచి రూ.33,76,18,207, ఎవరెట్ అండ్ నయోలిన్ (షీట్ ఫ్రమ్ విక్కీ మొబైల్) నుంచి రూ.50,43,00,000, పోర్ ట్రేడింగ్ నుంచి రూ.9,42,00,000, హార్డ్‌రిటన్ షీట్ (లక్‌స్టోన్ అండ్ కో) నుంచి రూ.10,23,00,000, దుబాయ్ నుంచి రూ.15,13,95,000లు చంద్రబాబుకు అందాయని.. ఇందులో రూ.118.98 కోట్లను మాత్రం ఆదాయంలో చూపలేదని కంపెనీల వారీగా వివరాలు వెల్లడించింది.
షాపూర్‌జీ పల్లోంజీ నుంచి నగదును తీసుకునేందుకు ప్రైవేట్ డొల్ల కంపెనీలు, బోగస్ కాంట్రాక్టులు సృష్టించారు. బోగస్ కంపెనీలు, బోగస్ కాంట్రాక్టులు, బోగస్ నామినేషన్లు అంటూ.. ‘బోగస్’ అనే పదాన్ని ఐటీ శాఖ తన నోటీసుల్లో స్పష్టంగా పలుమార్లు పేర్కొంది. సెక్షన్ 132(4), 5(బీ) కింద మనోజ్ స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. ఆయన కూడా అదంతా వాస్తవమేనని సంతకం పెట్టారు. స్టేట్‌మెంట్లు ఇచ్చిన వారు చంద్రబాబు, అతని పీఎస్ పేరుతో పాటు లోకేశ్ పేరును వెల్లడించారు. విక్కీ అనే వ్యక్తి ద్వారా లావాదేవీలన్నీ జరిగినట్లు, నేరుగా చంద్రబాబు కూడా కొన్ని చెప్పినట్లు ఐటీ తన నోటీసుల్లో పేర్కొంది.
అరెస్టు చేసి.. దర్యాప్తు చేపట్టవచ్చు..
ఇప్పటికే ఐటీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేసినా చంద్రబాబు నుంచి సరైన సమాధానం రాలేదు. ఒకవేళ సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందని పక్షంలో పెద్దఎత్తున జరిమానాలు విధించవచ్చు. 25 శాతం అదనపు పన్నుతో పాటు వడ్డీ కూడా విధించవచ్చు. నేరం జరిగినట్లు తేలితే.. రూ.118.98 కోట్లకు 300 శాతం అంటే రూ.356.94 కోట్లు వసూలుచేసే అవకాశం కూడా ఉంటుంది.
అంతేకాదు.. అరెస్టుచేసే అధికారం కూడా ఉంటుంది. దుబాయ్ నుంచి కూడా నగదు అందడం.. పలు కంపెనీల నుంచి డబ్బు స్వీకరించడం.. క్విడ్ ప్రో కోతో పాటు మనీలాండరింగ్ కిందికి వస్తుంది. దీంతో ఈడీ కూడా సుమోటోగా దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఈడీనే కాదు.. పీఎంఎల్‌ఏ, ఫెమా, ఆర్‌బీఐ, కంపెనీ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు ఎన్నికల కమిషన్, విజిలెన్స్ కమిషన్ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా కేసు నమోదు చేయవచ్చు. అంతేకాక.. సీబీసీఐడీ కూడా దర్యాప్తు చేపట్టవచ్చు.
2019 తర్వాతవే ఆ రూ.118.98 కోట్లు..
ఇక 2019 తర్వాత వచ్చినవే ఆ రూ.118.98 కోట్లు అయితే.. మరి 2014 నుంచి ఎన్ని డొల్ల కంపెనీలు నెలకొల్పారు.. ఎన్ని వేల కోట్లు ప్రజా ధనం కొల్లగొట్టారు.. పూర్తిస్థాయి దర్యాప్తు జరిగితే కానీ ఈ కుంభకోణం వివరాలన్నీ బహిర్గతం కావు. ఇదంతా ప్రజల డబ్బు. దీనిపై ప్రజలెవరైనా కోర్టు ద్వారా నిష్పాక్షిక దర్యాప్తు కోరవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment