సాక్షి, అమరావతి: ఐటీ శాఖ నోటీసుల వ్యవహారంలో చంద్రబాబు తీరు దొంగతనం చేసి దబాయిస్తున్నట్లుగా ఉందని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అవినీతి బండారం బయటపడటంతో ఆయనకు భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోందని, అడ్డంగా దొరికిపోయినట్లు ఆయనకే అర్థమవుతోందని చెప్పారు. అందుకే గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సజ్జల బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను రేపో ఎల్లుండో అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు సానుభూతి కోసం నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నిప్పు కాదని.. తప్పులకు మానవ రూపమని, తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి అని మండిపడ్డారు. బాబు చట్టానికి అతీతుడు కాదన్నారు. నోటీసులకు స్పందించకుండా, విచారణకు సహకరించకుంటే ఐటీ శాఖ అరెస్టు కూడా చేయవచ్చన్నారు. ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులను పరిశీలిస్తే చంద్రబాబు, లోకేష్ హవాలా, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమవుతోందని, ఈ వ్యవహారంపై ఇన్నాళ్లూ ఈడీ జోక్యం చేసుకోకపోవడంపై సజ్జల విస్మయం వ్యక్తం చేశారు.
అప్పట్లోనే కుంభకోణాన్ని ఎండగట్టాం..
అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని చదరపు అడుగుకు రూ.పది వేల చొప్పున షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు చంద్రబాబు అప్పగించారు. హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో అత్యాధునిక సదుపాయాలు, ఫర్నిచర్‌తో సహా చదరపు అడుగు నిర్మాణానికి రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేలు మాత్రమే బిల్డర్లు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూమిలో తాత్కాలిక నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేలకు మించి వ్యయం కాదు. ఇందులో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని అప్పట్లోనే మేం అభ్యంతరం తెలిపాం. కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకు అదనంగా రూ.7–8 వేలు దోచిపెట్టిన చంద్రబాబు అందులో 60 నుంచి 70 శాతం వరకూ కమీషన్ తీసుకున్నారు.
పేదల నోళ్లు కొట్టి..
టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.వెయ్యికి మించి వ్యయం కాదు. కానీ ఆ పనులను రూ.2,200 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. పేదల కష్టార్జితాన్ని చదరపు అడుగుకు అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన చంద్రబాబు వారి నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని, ఇది పాపమని అప్పట్లోనే మేం చెప్పాం.
ఐటీ నోటీసులతో అది రుజువైంది. షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, విక్కీజైన్, కిలారు రాజేష్ ద్వారా చంద్రబాబు, ఆయన పీఎస్ శ్రీనివాస్, లోకేష్ వసూలు చేసిన విధానాన్ని ఆధారాలతోసహా ఐటీ శాఖ బహిర్గతం చేసింది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్ చేతిలో అడ్డంగా దొరికిపోయిన సమయంలోనూ తనను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చునని, ప్రజలంతా తనకు రక్షణ కవచంలా నిలబడి రక్షించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐటీ శాఖ నోటీసులతో ఇప్పుడూ అలాగే కోరడం విడ్డూరం.
కుంభకోణాల దారులన్నీ బాబు వైపే..
అమరావతి భూకుంభకోణం, ఫైబర్‌నెట్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ల్లో సీఐడీ దర్యాప్తుతో చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైంది. ఐటీ నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులనే ఆ కుంభకోణాల్లో నిందితులుగా సీఐడీ గతంలోనే తేల్చింది. 1995–2004 మధ్య ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. ఈ వ్యవహారంపై కోర్టుల్లో విచారణను ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టే తెచ్చుకున్నారు. రాజకీయంగా కక్ష సాధించాలనుకుంటే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెట్టించేవారు. చంద్రబాబు కుంభకోణాలన్నీ ఆధారాలతోసహా ఇప్పుడు బయటపడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడం ఆయన తరం కాదు.
ఖజానాను లూటీ చేయడం సాధారణమా?
చంద్రబాబుకు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులు సాధారణమైనవని, వాటిపై తాను స్పందించబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొనడం విడ్డూరం. ప్రభుత్వ ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ముడుపులు తీసుకున్నందుకే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని ఆమెకు తెలియదా? లేదంటే మరిదిని రక్షించుకోవడానికి అలా మాట్లాడారా? చీటికిమాటికీ ట్వీట్లతో రెచ్చిపోయే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడంలో ఆంతర్యమేంటి? ఎల్లో మీడియా ఐటీ నోటీసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి శతవిధాలా ప్రయతి్నస్తోంది.
శాంతి భద్రతల సమస్య సృష్టించే కుట్ర..
చంద్రబాబు శాంతి భద్రతల సమస్య సృష్టించి లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారు. పుంగనూరులో పోలీసులపైకి టీడీపీ గూండాలను ఉసిగొల్పారు. అదే కుట్రను లోకేశ్ భీమవరంలో అమలు చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టించాలని ప్రయత్ని స్తే చూస్తూ ఊరుకోం.
Comments
Please login to add a commentAdd a comment