న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్... భారత్‌కు చెందిన రెండు స్టార్టప్‌లు–గ్లాన్స్ ఇన్‌మోబి, వర్స్ ఇన్నోవేషన్‌ల్లో పెట్టుబడులు పెట్టింది. తన 1,000 కోట్ల డాలర్ల గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్‌లో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టినట్లు గూగుల్ పేర్కొంది. అయితే ఈ స్టార్టప్‌ల్లో ఎంత మేరకు ఇన్వెస్ట్ చేసిందీ గూగుల్ వెల్లడించలేదు. అయితే పెట్టుబడులు పొందిన స్టార్టప్‌లు మాత్రం ఆ వివరాలను వెల్లడించాయి.
గ్లాన్స్‌లో రూ.1,072 కోట్ల పెట్టుబడులు
గూగుల్ సంస్థ తమ కంపెనీలో రూ.1,072 కోట్లు(14.5 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేసిందని గ్లాన్స్ ఇన్‌మోబి సంస్థ పేర్కొంది. ఇక తమ కంపెనీలో గూగుల్ సంస్థ రూ.739 కోట్లు(10 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేసినట్లు వర్స్ ఇన్నోవేషన్ పేర్కొంది. ఈ సంస్థ డైలీ హంట్, షార్ట్ వీడియో యాప్ జోష్‌లను నిర్వహిస్తోంది.
స్టార్టప్‌లకు గూగుల్ తోడ్పాటు..
భారత్‌లో వినూత్నమైన స్టార్టప్‌లకు తోడ్పాటునందించగలమన్న దానికి తాజా పెట్టుబడులే నిదర్శనమని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్‌గుప్తా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగించే సమ్మిళిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టామని వివరించారు. ఇంటర్నెట్ అనుసంధానత మెరుగుపడటం, చౌక ధరలకే డేటా లభించడం... ఈ రెండు కారణాల వల్ల భారత్‌లో స్టార్టప్‌ల జోరు పెరుగుతోందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో 10 కోట్ల మంది గ్రామీణులు ఇంటర్నెట్ యూజర్లయ్యారని, ఇప్పుడు మొత్తం మొబైల్ డేటా వినియోగంలో గ్రామీణుల వినియోగం 45 శాతంగా ఉందని వివరించారు.
1,000 కోట్ల డాలర్ల గూగుల్ ఫండ్
ఈ ఏడాది జూలైలో 1,000 కోట్ల డాలర్ల గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్‌ను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. దేశంలో డిజిటల్ టెక్నాలజీల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడానికి ఐదు నుంచి ఐదేళ్లలో స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం కోసం ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అప్పుడు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment