టెక్నాలజీ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేస్తా..
బెంగళూరు: ఈ అక్టోబర్‌లో పదవీ విరమణ చేసిన తర్వాత టెక్నాలజీ స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్. వ్యక్తిగత స్థాయిలో ఏంజెల్ ఇన్వెస్టరుగా ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఈ నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే 10వ ఇండియా ఇన్నోవేషన్ సమ్మిట్ ఏర్పాట్లను వివరించేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ‘నాకు తెలిసిందల్లా టెక్నాలజీనే. అందులో డిజిటల్, మార్కెటింగ్, ఈ-రిటైలింగ్ లాంటి వాటికి డిమాండ్ బాగా ఉంది. కాబట్టి వాటిలో లేదా అలాంటి ఇతర విభాగాలపైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది’ అని గోపాలకృష్ణన్ చెప్పారు. ఉత్పత్తుల విభాగంలోనూ అవకాశాలు ఉన్నాయని.. అయితే భవిష్యత్‌లో సేవలు, ఉత్పత్తుల మధ్య హద్దులు చెరిగిపోగలవని ఆయన తెలిపారు. చాలా మటుకు ఉత్పత్తులు రాబోయే కాలంలో సర్వీసుల రూపం సంతరించుకోవచ్చన్నారు. కాబట్టి ఐటీలో కొత్త ఆవిష్కరణలపైనే తాను దృష్టి పెట్టదల్చుకున్నానని గోపాలకృష్ణన్ వివరించారు.
దేశీయంగానే పెట్టుబడులు
స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు తన ఫ్యామిలీ ఆఫీస్ కింద ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలా లేక వ్యక్తిగతంగానే ఇన్వెస్ట్ చేయాలా అన్న అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో కన్నా దేశీయంగానే ఏదైనా చేయడంపైనే తనకు ఎక్కువ ఆసక్తి అని గోపాలకృష్ణన్ తెలిపారు. రిటైరైన తర్వాత ఇన్ఫీకి ఏదైనా సహాయం కావాల్సి వస్తే ఎప్పట్లాగే తప్పకుండా అందిస్తానని చెప్పారు.
ఇన్ఫోసిస్ రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో కొత్త సీఈవో విశాల్ సిక్కా గెడైన్స్ కోసం వ్యవస్థాపకులను సంప్రదించడంలో తప్పేమీ లేదని, అయితే ఇది ఈ ఒక్కసారికే పరిమితం అవుతుందని గోపాలకృష్ణన్ తెలిపారు. సిక్కా సామర్థ్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన సారథ్యంలో కంపెనీ గణనీయంగా వృద్ధి చెందగలదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడైన గోపాలకృష్ణన్ అక్టోబర్ 10 దాకా నాన్-ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు.
రిటైర్మెంట్‌పై క్రిస్ ఇంకా ఏం చెప్పారంటే..
‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్‌ను ఏర్పాటు చేయబోయే టీమ్‌లో నేను సభ్యుడిగా ఉన్నాను. ఇది నాకెంతో ఇష్టమైన ప్రాజెక్టు. బెంగళూరు, కేరళలో నవకల్పనలు, స్టార్టప్‌లు, ఎంట్రప్రెన్యూర్‌షిప్ వంటి వాటిలో పాలుపంచుకుంటున్నాను. నవకల్పనలపై సీఐఐ ఏర్పాటుచేసిన జాతీయ కమిటీకి సారథ్యం వహిస్తున్నాను. వీటి ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం. చివరిగా సామాజిక కార్యక్రమాలపైనా దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పటికే మా కుటుంబ ట్రస్టు ద్వారా విద్యార్థులకు ఉపకారవేతనాల రూపంలో సాయం చేస్తున్నాం’.