వ్యాపార నైపుణ్యాలు నేర్పించాలి!! | Teach business skills | Sakshi
Sakshi News home page

వ్యాపార నైపుణ్యాలు నేర్పించాలి!!

Published Sun, May 4 2014 11:06 PM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

వ్యాపార నైపుణ్యాలు నేర్పించాలి!! - Sakshi

వ్యాపార నైపుణ్యాలు నేర్పించాలి!!

గెస్ట్ కాలమ్
 
సేనాపతి గోపాలకృష్ణన్.. అంటే గుర్తుపట్టడం కొంత కష్టమే. క్రిస్ గోపాలకృష్ణన్.. అంటే అందరికీ సుపరిచితమైన పేరు. ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన సాఫ్ట్‌వేర్ సంస్థ  ‘ఇన్ఫోసిస్’ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1979లో పట్ని కంప్యూటర్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రస్థానాన్ని ప్రారంభించి.. 1981లో ఇన్ఫోసిస్ స్థాపనలో చేయి కలిపిన గోపాలకృష్ణన్.. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ స్థాయికి ఎదిగారు. మరోవైపు ట్రిపుల్ ఐటీ బెంగళూరు చైర్మన్‌గా, ఐఐఎం-బెంగళూరు గవర్నింగ్ బోర్డ్ సభ్యుడిగా విద్యారంగ అభివృద్ధిలోనూ తనవంతు తోడ్పాటును అందిస్తున్నారు. విద్యార్థులు తమను తాము ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దుకోవాలి, కాలేజీ స్థాయిలోనే విద్యార్థులకు వ్యాపార నైపుణ్యాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తే కెరీర్ ఆశాజనకంగా ఉంటుంది అంటున్న ఇన్ఫోసిస్  ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ గోపాలకృష్ణన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ...
 
దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయం?

నాణ్యమైన విద్య అనేది మన దేశ విద్యారంగంలో చాలా ముఖ్యమైన అంశం. చక్కటి విద్యను అందించి తద్వారా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను సంసిద్ధులను చేయాలంటే.. నిపుణులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు అవసరం. అదేవిధంగా నిరంతరం పరిశోధనలు కొనసాగించేందుకు వీలుగా సరిపడ నిధులు అందుబాటులో ఉండేలా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుంచే సంస్కరణలు తేవాలి. ఇందులో అత్యంత ముఖ్యమైనది మౌలిక సదుపాయాల కల్పన. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆడియో-విజువల్ సౌకర్యాలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి ఆధునిక వనరులను వినియోగించి నాణ్యమైన విద్యను అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కేవలం కుర్చీలు, బల్లలు ఉన్న సాధారణ తరగతి గదులే ఉంటున్నాయి. ఈ పరిస్థితికి వీలైనంత త్వరగా స్వస్తి పలికి, బోధనలో ఆధునికతవైపు అడుగులు వేయాలి. అదే విధంగా విద్యార్థినుల నమోదు శాతం పెరిగేలా స్కూళ్లలో వారి కోసం టాయిలెట్లు వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. మన దేశంలో ఉన్నత విద్య, ఉద్యోగాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. ప్రాథమిక స్థాయిలో వారికి ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే.
 
మన విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పులు తేవాల్సిన అవసరముంది?

విద్యార్థులకు రెగ్యులర్ కరిక్యులంను బోధిస్తూనే.. ఇంటర్నెట్ ఆధారిత అధునాతన శిక్షణ అందించాలి. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఎడ్యుకేషనల్ టూల్స్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలు మరింతగా మెరుగుపరచుకునేలా వారిని ప్రోత్సహించాలి. తద్వారా విద్యార్థికి సాంకేతిక నైపుణ్యాలతోపాటు విస్తృతమైన పరిజ్ఞానం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా వేల మంది విద్యార్థులు కళాశాల విద్యకు, ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారు తమ స్వశక్తిపై జీవించేలా, సదరు రంగంలో ఉపాధి పొందేలా పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్య నైపుణ్యాలు అందించాలి. విద్యార్థులకు జాబ్ మార్కెట్ సంబంధిత నైపుణ్యాలు అందించేందుకు ఒకేషనల్ ఎడ్యుకేషన్‌కు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
 
కంపెనీలు అభ్యర్థుల్లో ఎలాంటి లక్షణాలను కోరుకుంటున్నాయి?

పరిశ్రమ వర్గాలు ప్రధానంగా విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, సమస్య సాధన నైపుణ్యాలు (ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్) ఉండాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే.. పరిశ్రమలలో టెక్నాలజీ పరంగా మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. నేర్చుకునే తత్వం లేకుంటే వెనకబడిపోవడం ఖాయం. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కలిగిన వ్యక్తులు సమస్యల్లోనే అవకాశాలను గుర్తిస్తారు. ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొంటారు. వీటితోపాటు విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, బృందంలో కలిసి పనిచేయగలిగే నేర్పు, నిర్వహణా నైపుణ్యాలు ఉండాలని కంపెనీలు కోరుతున్నాయి.
 
పరిశ్రమ అవసరాలకు, అకడెమిక్ నైపుణ్యాలకు మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

ఇందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా కంపెనీలకు, కాలేజీలకు మధ్య పరస్పర సంబంధాలు కొనసాగించాలి. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్‌షిప్స్, ఇండస్ట్రీ విజిట్స్ వంటి మార్గాల ద్వారా ఈ సమస్యకు సులువుగా పరిష్కారం లభిస్తుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ తనవంతు కృషి చేస్తోంది. విద్యార్థుల్లో ఇండస్ట్రీకి తగిన నైపుణ్యాలు అందించేందుకు ప్రస్తుతం ఇన్ఫోసిస్.. క్యాంపస్ కనెక్ట్, క్యాచ్ దెమ్ యంగ్ (సీటీవై); స్పార్క్ (్కఅఖఓ) అనే మూడు ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తోంది. క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రామ్‌ను తొలుత 2004లో 60 కళాశాలలతో ప్రారంభించాం. ఇండస్ట్రీ-అకడెమిక్స్ మధ్య దూరం తగ్గించడం క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు ఐటీ పరిశ్రమ అవసరాలకు సరితూగేలా నిపుణులను తయారు చేయడంపై ఈ క్యాంపస్ కనెక్ట్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందుకోసం క్యాంపస్ కనెక్ట్ పోర్టల్‌లో ఇన్ఫోసిస్ కోర్స్‌వేర్‌ను, ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్, కేస్ స్టడీస్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. అదే విధంగా పలు సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహించి పరిశ్రమ అవసరాలు విద్యార్థులకు తెలిసేలా చేస్తున్నాం. అలాగే రెండు వారాల వ్యవధి ఉండే సీటీవై ప్రోగ్రామ్ ద్వారా పాఠశాల విద్యార్థులకు ఐటీపై అవగాహన కల్పిస్తాం. విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తాం. ఎంట్రెన్స్‌లో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు ఇన్ఫోసిస్ సంస్థలో అనుభవజ్ఞులతో కలిసి ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నాం. దీనివల్ల విద్యార్థులకు చిన్నతనం నుంచే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అలవడుతుంది. 2008లో ప్రారంభించిన ్కఅఖఓ ప్రోగ్రామ్ ప్రధానంగా ఐటీ రంగంలో ఆధునిక మార్పులు, ఐటీ రంగ పురోభివృద్ధిలో ఇన్ఫోసిస్ పాత్ర అనే అంశాలపై ఉంటుంది. ఇన్ఫోసిస్‌లోని వేల మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని.. ఐటీ రంగానికి అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
 
ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా ఆలోచించడంపై మీ అభిప్రాయం?

దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితుల కోణంలో ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు, స్టార్ట్-అప్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. విద్యార్థులు దీన్ని గుర్తించి వ్యాపార నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాల ద్వారా సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలు చూపించాలి. దానివల్ల సమాజంలో కొత్త వ్యాపారాలు, నూతన ఉత్పత్తులు, కొత్త ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలా అవసరం. దీనివల్ల వ్యక్తి అభివృద్ధితోపాటు, సమాజ అవసరాలు తీరుతాయి. ఫలితంగా ఆర్థిక ప్రగతికి మార్గం ఏర్పడుతుంది.
 
ఇంతటి ప్రాముఖ్యమున్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను అకడెమిక్ స్థాయిలోనే పెంపొందించాలంటే?

 ఎంటర్‌ప్రెన్యూరియల్ నైపుణ్యాలపై కాలేజీ స్థాయిలోనే శిక్షణ ఇవ్వడం అవసరం. ఇందుకోసం ఇంక్యుబేషన్ సెంటర్స్, ఈ-సెల్స్ వంటివి ఏర్పాటు చేయాలి. విద్యార్థులు వాటిలో పాల్పంచుకునేలా ప్రోత్సహించాలి. డిగ్రీ అంటే క్యాంపస్ సెలక్షన్స్- అయిదంకెల జీతం అనే చట్రం నుంచి విద్యార్థులను బయటకు తీసుకురావాలి. వారిని స్వయం ఉపాధి దిశగా ఆలోచించేలా చేయాలి. ఆ నైపుణ్యాలున్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ సదుపాయాలు కల్పించాలి. తద్వారా భవిష్యత్తులో ఎన్నో స్టార్ట్-అప్స్‌ను, మరెందరో ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను సమాజానికి అందించడానికి వీలవుతుంది.
 
 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అవసరం?

ప్రభుత్వం చొరవ తీసుకొని విధాన నిర్ణయాల ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను, స్టార్ట్‌అప్‌లను ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఆర్థిక తోడ్పాటునందించేలా ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందించాలి. దేశంలో ఎంటర్‌ప్రెన్యూరియల్ ఎకోసిస్టమ్‌కు దోహదపడేలా రోడ్ మ్యాప్‌ను తయారు చేయాలి. ఇలా చేయడం ద్వారా దేశ పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోతుంది.
 
విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఎంటర్‌ప్రెన్యూర్ ఔత్సాహికులకు మీ సలహా?

ఏ దశలోనూ నిర్దిష్ట లక్ష్యం నుంచి దృష్టిని మళ్లించకూడదు. జీవితంలో సవాళ్లు ఎదురవడం సాధారణం. ప్రతి సవాల్‌ను ఒక పాఠంగా భావించాలి. సవాళ్లు-సమస్యలు లేని విజయాలు చాలా తక్కువ. ఈ విషయాన్ని గ్రహిస్తే ఉద్యోగం, ఉపాధి ఏదైనా సరే.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయం!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement