వెలిగే స్టార్టప్‌లు తక్కువే..
♦ 70 శాతం విఫల బాట... నిలదొక్కకునేవి 20 శాతమే
♦ 5-10 శాతమే బడా కంపెనీలుగా మారుతున్నాయి
♦ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్
బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా చూస్తే కేవలం 5 నుంచి 10 శాతం స్టార్టప్‌లే (ప్రారంభ కంపెనీలు) విజయం సాధించి పెద్ద కంపెనీలుగా నిలబడగలవని రుజువవుతున్నట్లు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ చెప్పారు. 70% కంపెనీలు మూతపడేవేనన్నారు. ఓ 20 శాతం స్టార్టప్‌లు నిలదొక్కుకున్నా వృద్ధి చెందలేక చిన్న కంపెనీలుగానే మిగిలిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘కాకపోతే ఇది సహజంగా జరిగే ప్రక్రియే. దీన్నొక సవాలుగా చూడొద్దు’’ అన్నారాయన. 12వ ఆవిష్కరణ సదస్సులో స్టార్టప్‌ల విజయం, వాటి భవిష్యత్తుపై గోపాలకృష్ణన్ తన అభిప్రాయాలను ఆవిష్కరించారు.
మరో గూగుల్ భారత్ నుంచేనా..?
‘నిలదొక్కుకోవడం, విఫలం కావడం అన్నవి సహజ పరిణామాలు. అయితే, వీటి నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ప్రపంచ స్థాయి కంపెనీలుగా అవతరించాయి. బడా కంపెనీలకు నిదర్శనంగా నిలిచాయి. పేటీఎం, ఫ్రెష్‌డెస్క్ వంటి ఎన్నో కంపెనీలు ఇదే బాటలో ఉన్నాయి. ఇప్పటి నుంచి మరో ఐదేళ్లలో ఈ కంపెనీల గురించి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుకోవాల్సి వస్తుంది’ అని గోపాలకృష్ణన్ వివరించారు. ఈ-రిటెయిల్ కంపెనీల్లో స్థిరీకరణ జరుగుతోందని, ఎలాంటి సరిహద్దులు లేని ప్రపంచ ఇంటర్నెట్ మార్కెట్లో భారత కంపెనీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయని చెప్పారాయన.
గూగుల్ వంటి మరో కంపెనీ భారత్ నుంచి రావడం సాధ్యమా? అన్న ప్రశ్నకు... ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ వంటి కంపెనీ ఒక్కటే ఉందని గుర్తు చేశారు. రవాణా, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ రంగాలకు భవిష్యత్తులో దృష్టి పెట్టాల్సినవిగా పేర్కొన్నారు. ప్రైవేటు, ఈక్విటీ వెంచర్ కేపిటల్ నిధులు తగ్గిపోవడానికి, నిష్ర్కమణ మార్గాలు లేకపోవడమే కారణంగా చెప్పారు. చాలా వరకు వెంచర్ ఫండ్స్ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు తగిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. విలీనాలు, కొనుగోళ్ల ద్వారా అవకాశం వచ్చినా తగిన విలువ లభించడం లేదంటూ వ్యవస్థలోని లోపాలను వ్యక్తీకరించారు.