‘సెడెమ్యాక్’లో నీలేకని పెట్టుబడులు..
ముంబై: వాహన విడిభాగాల స్టార్టప్, సెడెమ్యాక్ మెక్‌ట్రానిక్స్‌లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని , నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ కలిసి 75 లక్షల డాలర్లు(50 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. అందరూ ఈ కామర్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుండగా నిలేకని అందుకు భిన్నంగా ఈ సెడెమ్యాక్ స్టార్టప్‌కు నిధులందించారు. వినూత్న ఐడియాలకు పెట్టుబడులందించే వ్యూహంలో భాగంగా నీలేకని, ఐఐటీ-బాంబే ల్యాబ్‌లో ఊపిరి పోసుకున్న సెడెమ్యాక్‌లో ఇన్వెస్ట్ చేశారు. నెక్సస్ వెంచర్, ఇండియా ఇన్నోవేషన్ ఫండ్‌లు కూడా ఈ స్టార్టప్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాయి.
సెడెమ్యాక్ సంగతి...: చిన్న ఇంజిన్లు, పవర్ ట్రైన్‌ల కోసం కంట్రోల్స్ అందించే సెడెమ్యాక్ స్టార్టప్‌ను 2008లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ శశికాంత్ సూర్యనారాయణన్ ప్రారంభించారు. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో కంట్రోల్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేసిన సూర్యనారాయణన్, ఇతర ఐఐటీయన్‌లు-పుష్కరాజ్ పన్సే, అమిత్ దీక్షిత్, మనీశ్ శర్మ్‌లతో కలసి దీనిని నిర్వహిస్తున్నారు. టాటా మోటార్స్, మహీంద్రా గ్రూప్, అశోక్ లేలాండ్, టీవీఎస్ మోటార్స్ తదితర దిగ్గజాలు సెడెమ్యాక్ క్లయింట్లు.