Anita Rajendra
-
క్యాట్‌ను ఆశ్రయించిన అనితారాజేంద్ర
సాక్షి, హైదరాబాద్: తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకో వాలంటూ చేసుకున్న విజ్ఞప్తిని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తనతో పాటు సర్వీసులో చేరిన వాణీ ప్రసాద్‌తో సమానంగా తనను ఐఏఎస్ పోస్టుకు తీసుకోలేదని పేర్కొన్నారు. 1997లో ఏలేరు కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని తప్పు పట్టిన రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ 1999లో తన సర్వీసును పునరుద్ధరిస్తూ ఏపీఏటీ ఆదేశాలు జారీచేసిందన్నారు. అనంతరం అన్ని అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించిం దని పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలాన్ని సీనియారిటీగా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీచేయాలని ఆమె క్యాట్‌ను కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన క్యాట్ ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యూపీఎస్సీకి కౌంటర్ దాఖలు చేయాలని బుధవారం నోటీసులు జారీ చేసింది. -
10 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్
జీఏడీ కార్యదర్శిగా అరుణ మార్కెటింగ్ డెరైక్టర్‌గా అనితా రాజేంద్ర భూ సేకరణ డెరైక్టర్‌గా మాణిక్‌రాజ్ నియామకం సాక్షి, హైదరాబాద్: పదిమంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాల్లో భాగంగా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న పలువురికి కొత్తగా బాధ్యతలు అప్పగించారు. జీఏడీ కార్యదర్శిగా(సర్వీసెస్, హెచ్ఆర్ఎం) జి.డి.అరుణ నియమించడంతో పాటు జీఏడీ అదనపు బాధ్యతల నుంచి బి.వెంకటేశ్వరరావును రిలీవ్ చేశారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డెరైక్టర్‌గా అనితా రాజేంద్రకు పోస్టింగ్ ఇచ్చారు. మార్క్‌ఫెడ్ ఎండీగా ఇన్చార్జి బాధ్యతలను కూడా అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా సి. సుదర్శన్‌రెడ్డి, ఫిషరీస్ డెరైక్టర్‌గా టి.విజయ్‌కుమార్, యూత్సర్వీసెస్ డెరైక్టర్‌గా మహ్మద్ అబ్దుల్‌అజీమ్ నియమితులయ్యారు. నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖ పరిహారం, పునరావాసం, భూ సేకరణ డెరైక్టర్‌గా కె.మాణిక్‌రాజ్ నియమితులయ్యారు. అంతకుముందు ఈ పోస్టులో జి. వెంకటరామ్రెడ్డిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేశారు. రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డెరైక్టర్‌గా డా.ఎం.వి.రెడ్డి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శిగా భారతీ లక్పతి నాయక్‌కు బాధ్యతలు అప్పగించారు. మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పి.వెంకటరామిరెడ్డి నియమితులు కాగా, అంతకుముందు బి. విజేంద్రకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. -
ఎన్నికల విధులు మొక్కుబడి
=పాత జాబితాలతో విధులు =పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో లేని దరఖాస్తులు =బీఎల్వోలకు చేరని ఆన్లైన్ నమోదులు = ఉన్నతాధికారులు పర్యవేక్షించినా ఫలితం శూన్యం =గుడివాడలో ఓటర్ల చేర్పింపు జరుగుతున్న తీరిదీ గుడివాడ, న్యూస్‌లైన్ : ‘ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితాను 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా బహిరంగంగా వేలాడదీయాలి’ - పోలింగ్ కేంద్రాల పరిశీలనలో ఎన్నికల కమిషన్ గుంటూరు, కృష్ణాజిల్లాల పరిశీలకులు అనితా రాజేంద్ర అధికారుల చేసిన సూచన ఇది. ‘మాకు మొన్నటి వరకు పాత ఓటర్ల జాబితా ఇచ్చారు. ఇక్కడికి వచ్చి ఓటు చూసుకునేవారికి సరైన సమాచారం ఇవ్వలేక పోయాం.. చివరి రోజున మాత్రం కొత్త ఓటర్ల జాబితా ఇచ్చారు.. ఇలాగైతే ఎలా చేయగలం..’ - పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు చెబుతున్న మాటలివి. ‘రెండు వారాల క్రితం ఆన్లైన్లో దరఖాస్తు చేశా.. బీఎల్వోలు నేటికీ విచారణకు రాలేదు’ - పెద ఎరుకపాడుకు చెందిన ఎ.కమలకుమారి వాదన ఇది. గుడివాడలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితాల్లో సవరణలపై జరుగుతున్న విధి నిర్వహణ తీరుకు ఇవి నిదర్శనం. అర్హత కలిగిన ప్రతి పౌరుడికీ ఓటుహక్కు కల్పించాలనే లక్ష్యంతో ఎన్నికల కమిషన్ చేపట్టిన కార్యక్రమం గుడివాడలో మొక్కుబడిగా సాగుతోంది. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేస్తున్న సిబ్బంది ఆనక పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రచారం కూడా బాగానే చేశారు. ఆచరణకు వచ్చేసరికి గుడివాడ మండలంలో క్షేత్రస్థాయిలో మొక్కుబడిగా సాగుతోంది. నవంబర్ 24 నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల్లో బూత్‌లెవల్ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని ఓటు నమోదు, ఓటు తొలగింపు వంటి అంశాలపై దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. బీఎల్ఓలుగా ఉన్న అంగన్వాడీ టీచర్లకు ఎన్నికల కమిషన్ తరఫున ఇవ్వాల్సిన గౌరవ వేతనం మూడేళ్లుగా అందకపోవడంతో తాము విధులు నిర్వర్తించబోమని వారు స్పష్టం చేశారు. తొలి వారం నిర్వహించాల్సిన ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో అధికారులు వారిని బతిమాలుకుని మిగిలిన మూడు వారాల్లో విధులు నిర్వర్తించేలా ఒప్పించారు. అయినా విధులు మాత్రం మొక్కుబడిగానే సాగుతున్నాయి. పాత జాబితాతోనే విధులు.. అందుబాటులో లేని దరఖాస్తులు... ‘మాకు మొన్నటి వరకు పాత ఓటర్ల జాబితా ఇచ్చారు. ఇక్కడికి వచ్చి ఓటు చూసుకునేవారికి సరైన సమాచారం ఇవ్వలేక పోయాం.. చివరి రోజున మాత్రం కొత్త ఓటర్ల జాబితా ఇచ్చారు.. ఇలాగైతే ఎలా చేయగలం..’ పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు చెబుతున్నారు. కనీసం దరఖాస్తు ఫారాలు కూడా తమకు అందించలేదని వారు పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ గుంటూరు, కృష్ణాజిల్లాల పరిశీలకులు అనితా రాజేంద్ర ఈ నెల ఒకటిన గుడివాడలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి.. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితాను 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా బహిరంగంగా వేలాడదీయాలని ఆర్డీవో ఎస్.వెంకటసుబ్బయ్యకు ఆదేశించారు. కానీ నేటివరకు ఏ పోలింగ్ కేంద్రంలోనూ ఓటర్ల జాబితాను ఉంచిన పాపాన పోలేదు. మరోవైపు నిన్నటి వరకు తమ వద్ద ఉన్న పాత ఓటర్ల జాబితాతో కాలం గడిపామని బీఎల్వోలు చెబుతున్నారు. దీనికితోడు తహశీల్దారు కార్యాలయంలో వేలకొద్దీ దరఖాస్తు ఫారాలున్నా వాటిని బీఎల్వోలకు అందజేయలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం పట్టణంలోని పెద ఎరుకపాడుకుచెందిన బీఎల్వోలు ఓటు కోసం వచ్చినవారిని మీరు దరఖాస్తులు కొనుక్కుని రండని చెప్పటంతో వారు వెనుదిరిగారు. దీనిపై తహశీల్దారు టి.దేవదాసును ‘న్యూస్‌లైన్’ ఫోన్ ద్వారా వివరణ కోరగా, తాను దూరంగా ఉన్నానని వెంటనే సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హడావిడిగా దరఖాస్తు ఫారాలను పోలింగ్ కేంద్రాలకు పంపించారు. ఆన్లైన్లో నమోదు చేసినా.. ఫలితమేదీ? ఓటర్లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ప్రచారం చేస్తోంది. ఆన్లైన్ దరఖాస్తులను ఏరోజుకారోజు నమోదు చేయాల్సిన అధికారులు మాత్రం వారానికి ఒక్కసారి కూడా ఆ పని చేయటం లేదని తెలుస్తోంది. రెండు వారాల క్రితం ఆన్లైన్లో చేసిన దరఖాస్తు తహశీల్దారు కార్యాలయంలో నేటికీ నమోదు కాలేదని, బీఎల్వోలు విచారణకు రాలేదని పెద ఎరుకపాడుకు చెందిన ఎ.కమలకుమారి చెప్పారు. వీటిపై తహశీల్దారు స్పందిస్తూ.. సంబంధిత ఉద్యోగుల్లో నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందని వివరించటం గమనార్హం.