చిన్నారులకు సి‘కిల్’సెల్
బిడ్డల రక్తం తాగుతున్న ప్రాణాంతక వ్యాధి
ఖరీదైన వైద్యం చేయించలేనిస్థితిలోతల్లిదండ్రు
దాతల సాయం కోసం వేడుకోలు
జ్యోతినగర్ : అయ్యా.. మా బిడ్డలకు ప్రాణభిక్ష పెంట్టండి’ అని వేడుకుంటున్నారు ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన బోగె కిష్టయ్య-పద్మ దంపతులు. ‘మా ప్రాణాలు.. మీ చేతుల్లో ఉన్నాయి. మమ్మల్ని బతికించండి’ అని చేతులు జోడించి అర్థిస్తున్నారు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వీరి కొడుకు, కూతురు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్నపూర్ణకాలనీలో నివాసముంటున్న బోగె కిష్టయ్య-పద్మకు కుమారుడు నవీన్‌కుమార్, కుమార్తె వందన ఉన్నారు. కిష్టయ్య పర్మనెంట్ టౌన్‌సిప్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పద్మ కూలీ పనిచేస్తూ భర్తకు అండగా ఉంటోంది. వీకి కుమారుడు నవీన్‌కుమార్ గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు.
కూతురు వందన టౌన్‌షిప్‌లోని సెయింట్ క్లేర్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. హాయిగా సాగుతున్న కిష్టయ్య కుటుంబాన్ని విధి పగబట్టింది. ఎనిమిదేళ్ల క్రితం నవీన్‌కుమార్ అనారోగ్యంతో మంచం పట్టాడు. వైద్య పరీక్షలు చేయించగా సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి శరీరంలోని రక్తకణాలను నశింపజేసి, ఎముకల్లోని మూలగ(బోన్‌మ్యారో)ను క్షీణింపజేస్తుందని పేర్కొన్నారు. వ్యాధి కారణంగా ఎమ్ములు బలహీనపడతాయని తెలిపారు. అప్పటి నుంచి నెలకు రూ.2 వేల మందులతో కొకును కాపాడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఏడేళ్ల క్రితం వందన కూడా అనారోగ్యానికి గురైంది.
ఈ మేకు కూడా వైద్య పరీక్షలు చేయించగా సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా ఇద్దరి పిల్లల పరిస్థితి విషమిస్తోంది. నవీన్‌కుమార్ ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు. దీంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స చేయిస్తున్నాడు. కూతురు వందన నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నవీన్‌కుమార్‌కు పరిస్థితి విషయమంగా ఉందని, త్వరగా బోన్‌మ్యారో మార్చాలని వైద్యులు తెలిపారు. ఇందుకు రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. అటెండర్‌గా తనకు నెలనెలా వచ్చే రూ.5 వేల వేతనంలో రూ.4 వేలు పిల్లల మందులకే వెచ్చిస్తున్నాడు కిష్టయ్య. ఇద్దరు పిల్లలను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఇంతకాలం తమ సాయశక్తులా ప్రయత్నించారు. ప్రస్తుతం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని కిష్టయ్య-పద్మ పిల్లలను ఎలా బతికించుకోవాలో తెలియక కన్నీటిపర్యంతమవుతున్నారు. దాతలు ముందుకు వచ్చి తన కొడుకు ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. కదలలేని స్థితిలో ఉన్న నవీన్‌కుమార్ కూడా సాయం కోసం మౌనంగా అర్థిస్తున్నాడు. దాతలు 9963041772, 9494985525 నబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు.