Annapurna Theatre
-
వెజిటబుల్ కట్లెట్లో బొద్దింకలు, పురుగులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు విక్రయించడమే కాకుండా, లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న అన్నపూర్ణ థియేటర్లోని క్యాంటీన్‌ను అధికారులు సీజ్ చేశారు. గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ, శకుంతల థియేటర్స్‌లో ఆహార పదార్థాలు శుభ్రంగా లేవంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు తనిఖీలో తేలిందని పూర్ణచంద్రరావు తెలిపారు. మినిట్ మెయిడ్ పల్ప్ డ్రింక్ బాటిల్స్‌కు 4, 5 రోజుల్లో కాలవ చెల్లనున్నట్లు గుర్తించామన్నారు. వెజిటబుల్ కట్లెట్ పూర్తిగా పాడైపోయి పురుగులు పట్టిందని తెలిపారు. బొద్దింకలు, పురుగులు ఆహార పదార్థాల్లో సంచరిస్తున్నాయని చెప్పారు. లేస్, పాప్‌కార్న్ అన్ఆథరైజ్డ్ ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వైట్ కవర్స్‌లో ఉంచిన కంపెనీ పేరులేని ఆహార పదార్థాలు గుర్తించామన్నారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. క్యాంటీన్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. క్యాంటీన్లో లభించిన బ్యాచ్‌కు చెందిన కూల్ డ్రింక్స్ ఎక్కడెక్కడ నిల్వలున్నాయో.. వాటన్నింటిని స్వాధీనం చేసుకోవాలని కోకాకోలా కంపెనీకి నోటీసులు జారీ చేస్తామన్నారు. క్యాంటీన్‌కు సరుకు సరఫరా చేసే వారికి లైసెన్స్ లేదని తనిఖీల్లో వెల్లడైందన్నారు. శాంపిల్స్ నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్ లేకుండా సరుకు సరఫరా చేసేవారిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
మీ అభిమానమే కొండంత అండ
పాలకొల్లు అర్బన్: ‘మీ అభిమానమే మాకు కొండంత అండ.. మెగా కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఆశీర్వదించండి’ అని మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి ధరమ్‌తేజ అన్నారు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా విజయోత్సవంలో భాగంగా చిత్ర యూనిట్ ఆది వారం రాత్రి పాలకొల్లు గీతా అన్నపూర్ణ థియేటర్‌కు వచ్చింది. హీరో, హీరోయిన్ రెజీనా, నిర్మాత బన్నీవాసు, శ్రీహర్షిత్, సహనటుడు ప్రభాస్ శ్రీను ప్రేకక్షకులతో మాట్లాడి సందడి చేశారు. తూ ర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ప్రత్యేక బస్సులో వచ్చిన చిత్ర యూని ట్‌కు అభిమానులు తీన్మార్ డప్పులతో స్వాగతం పలికారు. హీరో సాయిధరమ్‌తేజ మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధత ఉంటే చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని అన్నారు. ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ పాలకొల్లులో అభిమానుల సందడి చూస్తుంటే మనసు పులకరించిపోతుందన్నారు. తమకు ఇం తలా మరెక్కడా ఆదరణ లభించలేదని చెప్పారు. హీరోయిన్ రెజీనా, నిర్మాత బన్నీవాసు మాట్లాడారు. అనంతరం హీ రోను అభిమానులు గజమాలతో సత్కరించారు. చిరంజీవి అభిమానుల సం ఘం రాష్ట్ర కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు, దాసిరెడ్డి శ్రీనివాసు, థియేటర్ యజమాని అహ్మద్ పాల్గొన్నారు. తొలి చిత్రంతోనే విజయం సొంతం చేసుకున్న సాయి ధరమ్‌తేజను చూసేం దుకు, మాట్లాడేందుకు అభిమానులు ఆసక్తి కనబర్చారు. అభిమానులంతా ఒక్కసారిగా ఎగబడటం, కేరింతలతో కార్యక్రమం రసాభాసగా మారింది. విలేకరులు ఫొటోలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా తోపులాట జరగడం ప్రేక్షకులను నిరాశపర్చింది. అనంతరం భీమవరం గీతా మల్టీప్లెక్స్‌లో యూనిట్ సందడి చేసింది.