annojiguda
-
ఎలా వచ్చిందో ఏమో.. కొండచిలువ కలకలం
సాక్షి, పోచారం: అన్నోజిగూడలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద ఆదివారం కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు అయిదు అడుగుల పొడవున్న ఆ పాము తావుర్యా నాయక్ అనే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పట్టుకొని అడవిలో వదిలేశారు. -
ఏకాత్మక మానవతా ధర్మమే ధ్యేయం
► ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 2 తీర్మానాలు ► రెండోరోజు భేటీకి హాజరైన బీజేపీ చీఫ్ అమిత్ షా ఘట్కేసర్: ఏకాత్మక మానవతా ధర్మ సాధన, కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తల రాజకీయ హత్యలను ఖండిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సోమవారం రెండు తీర్మానాలు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడలో జరుగుతున్న మూడు రోజుల సమావేశాల్లో రెండోరోజు భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. సమావేశంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 400 మంది ఆరెస్సెస్ ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశ వివరాలను ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య, అఖిల భారతీయ ప్రచార సహప్రముఖ్, కేసరి మలయాళ వారపత్రిక ఎడిటర్ నందకుమార్జీ, కేరళ ప్రాంత సహ సంచాలక్ బల్రాంజీ విలేకరులకు వెల్లడించారు. ఏకాత్మక మానవతా ధర్మంపై చేసిన తీర్మానం గురించి వారు మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన వనరులను కాపాడుకోకపోతే మానవ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమా దం ఉందన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం అవసరాలకు మించి వనరులను కొల్లగొడుతున్నారని, దీనివల్ల ప్రకృతి సమతౌల్యత లోపించి భూతాపం పెరుగుతోందన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవడం హిందూ జీవన విధానంలో ఉందని, దాన్ని ప్రతిఒక్కరూ ఆచరించాలన్నారు. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యా య ఏకాత్మక మానవతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించి 51 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దానికి ప్రాధాన్యత ఇస్తూ తీర్మానం చేశామన్నారు. ఏకాత్మక మానవ ధర్మ సాధనకు కృషి చేస్తామన్నారు. మైనారిటీ ఓట్ల కోసమే హత్యలు... కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తల హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని నందకుమార్జీ చెప్పారు. ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకును కొల్లగొటెందుకు అక్కడి ప్రభుత్వాలు ఆరెస్సెస్ కార్యకర్తలపై దాడులను పట్టించుకోవట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ కార్యకర్తలపై భారీ స్థాయిలో దాడులు జరుగుతున్నా ప్రభుత్వాల జోక్యంతో అతితక్కువగా కేసు లు నమోదవుతున్నాయని, ఇప్పటివరకు కేవలం 55 కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. 1962 నుంచి కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తలపై సీపీఎం హత్యాకాండ కొనసాగుతుందన్నారు. సీపీఐ సైతం గతంలో దాడులు చేసిందన్నారు. కన్నూర్ జిల్లాలో తమ వారిపై ఎక్కువగా హత్యలు జరిగాయన్నారు. గతంలో ఆరెస్సెస్ కార్యకర్తలను హత్య చేసిన వ్యక్తే ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దాడులను ఆపేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రయత్నిస్తున్నామన్నారు. -
ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ సమావేశాలు
హైదరాబాద్: నగరంలోని అన్నోజీగూడలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను మోహన్ భగవత్, భయ్యాజీ జోషి ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు 400 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. అన్నోజీగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు మూడు రోజులపాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రేపు, ఎల్లుండి సమావేశాల్లో అమిత్ షా పాల్గొననున్నట్టు సమాచారం. -
నేటి నుంచి ఆర్ఎస్ఎస్ సమావేశాలు
హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 23 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యావిహార్లో జరుగుతాయని సంఘ్ అఖిలభారత ప్రచారక్ప్రముఖ్ మన్మోహన్ వైద్య తెలిపారు. అన్నోజిగూడలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజులపాటు జరిగే సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ జాతీయ సర్సంఘ్ చాలక్ మోహన్జీ భగవత్, భయ్యాజీ వంటి ప్రముఖులు పాల్గొంటారని వివరించారు. ఆర్ఎస్ఎస్కి చెందిన 42 రాష్ట్రాల(ప్రాంతాలు)కు చెందిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యనిర్వాహకులు, అఖిల భారతీయ మజ్దూర్ సంఘ్ వంటి సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొంటారని వివరించారు. మౌలిక విషయాలు, జాతీయ అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. సమావేశాల్లో ఏదైనా ఒక రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా రానున్నారని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రచారక్ ప్రముఖ్ ఆయుష్ తెలిపారు. -
బిల్డింగ్పై నుంచి పడి ఇన్పోసిస్ ఉద్యోగి మృతి
హైదరాబాద్ నగర శివారు ఘట్కేసర్లోని అన్నోజిగూడలో సింగపూర్ టౌన్షిప్లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీపక్ ఫకీర్ హబీబ్ ఈ రోజు ఉదయం పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్లో దీపక్ పని చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. ఇటీవల అతడు బెంగళూరు నుంచి బదిలీపై హైదరాబాద్ వచ్చాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.