anti terrorist operation
-
రూ.1,800 కోట్ల డ్రగ్స్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో మాదకద్రవ్యాలను అక్రమంగా తీసుకువచ్చే పాకిస్తాన్ స్మగ్లర్ల ఆటకట్టింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ బృందం(ఏటీఎస్), తీర రక్షక దళం(ఐసీజీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.1,800 కోట్ల విలువైన 300 కిలోల మెథాంఫెటమైన్ అనే సింథటిక్ డ్రగ్ పట్టుబడింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి దాటాక అరేబియా సముద్రంలో ఘటన చోటుచేసుకుంది. ఫిదా అనే పేరున్న మాఫియా ముఠా చేపల పడవలో భారత జలాల్లోకి ప్రవేశించనుందంటూ ఏటీఎస్ అందించిన నిఘా సమాచారం మేరకు ఐసీజీ గస్తీని ముమ్మరం చేసింది. అంతర్జాతీయ సముద్ర జలాలకు అత్యంత సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఐసీజీ గస్తీ ఓడను దూరం నుంచే గమనించిన స్మగ్లర్లు తమ బోటులో ఉన్న డ్రగ్స్ డ్రమ్ములను సముద్రంలో విసిరేశారు. వేగంగా అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దుల వైపు వెళ్లిపోయారు. ఇదంతా వెంటవెంటనే జరిగిపోయింది. వారిని పట్టుకునేందుకు ఐసీజీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కటిక చీకటిలోనే వారు విసిరేసిన డ్రగ్ పార్శిళ్లను ఐసీజీ, ఏటీఎస్ సిబ్బంది గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 311 ప్యాకెట్లలో 311 కిలోల మెథాంఫెటమైన్‌ను పోర్బందర్ తీరానికి తరలించి, దర్యాప్తు చేపట్టామని ఐసీజీ తెలిపింది. ఈ ప్యాకెట్లను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సీల్ వేసి ఉంచారని, సముద్ర జలాల్లో వేసినా అందులోని సరుకు పాడవదని ఏటీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి చెప్పారు. ఈ డ్రగ్స్ గమ్యస్థానం తమిళనాడని ఆయన వివరించారు. పాక్‌లోని పస్ని పోర్టు నుంచి బయలుదేరిన మాఫియా సభ్యులు సముద్ర జలాల్లోనే డ్రగ్స్‌ను మరో బోటులోకి మార్చి, ఆపైన తమిళనాడుకు చేరవేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇటువంటి 13 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసి, అక్రమార్కుల ఆటకట్టించామని వివరించారు. కాగా, ఐస్, క్రిస్టల్ మెథ్ అని కూడా పిలిచే మెథాంఫెటమైన్ చాలా శక్తివంతమైన డ్రగ్. పొట్టలో రూ.7.85 కోట్ల కొకైన్ ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఉగాండా దేశస్తుడి పొట్టలో రూ.7.85 కోట్ల విలువుండే 785 గ్రాముల కొకైన్‌ను గుర్తించారు. ఈ నెల 9వ తేదీన రాత్రి ఓ విమానంలో వచ్చిన అతడిని అధికారులు అడ్డుకున్నారు. విచారణ సమయంలో అతడు ఆందోళనతో కనిపించడంతో కనిపించాడు. దీంతో, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేయించగా పొట్టలో టాబ్లెట్లు ఉన్నట్లు తేలింది. -
యాంటీ టెర్రర్ ఆపరేషన్.. కొత్తగా ఏర్పడిన ఉగ్ర సంస్థ విచ్ఛిన్నం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పలు జిల్లాలో పోలీసులు యాంటీ టెర్రర్ పేరుతో వరుస దాడులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ లబైక్ యా ముస్లింను(టీఎల్ఎమ్) విచ్చిన్నం చేశారు. ఇది ల్కరే తోయిబా అనుబంధ శాఖ అని, బాబా హమాస్ అనే పాకిస్తానీ వ్యక్తి మార్గదర్శకత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీస్‌కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ విభాగం వెల్లడించింది.శ్రీనగర్, గాందర్బల్, బందిపోరా, కుల్గాం, బుద్గాం, అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లో విస్తృత దాడులు నిర్వహించారు. గాందర్బల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు మృతి చెందిన నేపథ్యంలో భారీ ఎత్తున సోదాలు జరుగుతున్నాయి. తీవ్రవాద కార్యకలాపాల నిమిత్తం ఇటీవల కాలంలో టీఎల్ఎం భారీగా యువతను రిక్రూట్ చేసుకుంటోందని, ఆ రిక్రూట్మెంట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే ఆ సోదాల ప్రాథమిక లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి.టీఎల్ఎమ్ ఇటీవల ఏర్పడిన సం స్థ అయినప్పటికీ.. స్థానికంగా ఉగ్రవాద గ్రూపులలో ఒకటైన లష్కరే తోయిబాతో సైద్ధాంతిక, రవాణా సంబంధాలను కలిగి ఉన్నట్లు, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయని, చొరబాట్లను ప్రోత్సహించడం, ఆర్థిక వనరులు సమకూర్చడం, టీఎల్‌ఎంకు యువతను రిక్రూట్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని పేర్కొన్నాయి. -
భారీ యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ షురూ!
ఉగ్రవాదులు వరుస బ్యాంకు లూటీలతో చెలరేగిపోతున్న నేపథ్యంలో వారిని ఉక్కుపాదంతో అణిచేందుకు సైన్యం దక్షిణ కశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో భారీ యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ చేపట్టింది. తుర్కవాన్ గావ్ ప్రాంతంలోని 20 గ్రామాలను దిగ్బంధించి భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. షోపియన్ జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్ పై దాడి చేసి.. ఐదు సర్వీస్ రైఫిళ్లు ఎత్తుకెళ్లిన మిలిటెంట్లను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. భద్రతా దళాల భారీ ఆపరేషన్ నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో యువత గుమిగూడి.. జవాన్లపై రాళ్లు రువ్వుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే రెండు గంటల వ్యవధిలో పుల్వామా జిల్లాలో రెండు వేర్వేరు బ్యాంకుల్లోకి ఉగ్రవాదులు చొరబడి నగదు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 1.50 కి వాహిబుగ్‌లో ఉన్న ఇలాకి దెహతి బ్యాంకులోకి నలుగురు సాయుధ మిలిటెంట్లు ప్రవేశించి సిబ్బందిపై తుపాకి గురిపెట్టి రూ.3-4 లక్షల నగదుతో పరారయ్యారు. బ్యాంకు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దొంగలను పట్టుకోవడానికి వేట ప్రారంభించారు. మధ్యాహ్నం 3.30కి అదే జిల్లాలో జమ్మూ కశ్మీర్ బ్యాంకు నెహమా శాఖలో కూడా మిలిటెంట్లు దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గత మూడు రోజులు నుంచి దక్షిణ కశ్మీర్‌లోని బ్యాంకులపై మిలిటెంట్లు వరసగా దాడులు చేస్తున్నారు.