భారీ యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ షురూ!
ఉగ్రవాదులు వరుస బ్యాంకు లూటీలతో చెలరేగిపోతున్న నేపథ్యంలో వారిని ఉక్కుపాదంతో అణిచేందుకు సైన్యం దక్షిణ కశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో భారీ యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ చేపట్టింది. తుర్కవాన్ గావ్ ప్రాంతంలోని 20 గ్రామాలను దిగ్బంధించి భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. షోపియన్ జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్ పై దాడి చేసి.. ఐదు సర్వీస్ రైఫిళ్లు ఎత్తుకెళ్లిన మిలిటెంట్లను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. భద్రతా దళాల భారీ ఆపరేషన్ నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో యువత గుమిగూడి.. జవాన్లపై రాళ్లు రువ్వుతున్నట్టు తెలుస్తోంది.
బుధవారం ఒక్కరోజే రెండు గంటల వ్యవధిలో పుల్వామా జిల్లాలో రెండు వేర్వేరు బ్యాంకుల్లోకి ఉగ్రవాదులు చొరబడి నగదు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 1.50 కి వాహిబుగ్‌లో ఉన్న ఇలాకి దెహతి బ్యాంకులోకి నలుగురు సాయుధ మిలిటెంట్లు ప్రవేశించి సిబ్బందిపై తుపాకి గురిపెట్టి రూ.3-4 లక్షల నగదుతో పరారయ్యారు.
బ్యాంకు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దొంగలను పట్టుకోవడానికి వేట ప్రారంభించారు. మధ్యాహ్నం 3.30కి అదే జిల్లాలో జమ్మూ కశ్మీర్ బ్యాంకు నెహమా శాఖలో కూడా మిలిటెంట్లు దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గత మూడు రోజులు నుంచి దక్షిణ కశ్మీర్‌లోని బ్యాంకులపై మిలిటెంట్లు వరసగా దాడులు చేస్తున్నారు.