‘మీ భర్త నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించాడు’
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి బాలీవుడ్లో బంధుప్రీతి వంటి అంశాలతో పాటు సినీ విమర్శకుల మీద కూడా తీవ్రమైన ఆరోపణలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సుశాంత్ ఆఖరిసారిగా నటించిన ‘దిల్ బేచారా’ చిత్రం విడుదల కానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసిద్ధ రచయిత చేతన్ భగత్ సిని విమర్శకులను ఉద్దేశిస్తూ.. ‘సంస్కారం లేని, ఉన్నతమైన విమర్శకులకు ఓ విన్నపం. సుశాంత్ సింగ్ ‘దిల్ బేచారా’ ఈ శుక్రవారం విడుదల అవుతుంది. కాస్తా సున్నితంగా ఉండటానికి ప్రయత్నించండి. పనికిమాలిన చెత్త అంతా రాయకండి. సున్నితంగా, స్పష్టంగా ఉండండి. మీ అతి తెలివితేటలను ఉపయోగించకండి. ఇప్పటికే చాలా మంది జీవితాలను నాశనం చేశారు. ఇప్పటికైనా ఆపండి. మేము ప్రతిది గమనిస్తూనే ఉంటాము’ అంటూ చేతన్ భగత్ ట్వీట్ చేశారు. గతంలో విమర్శకులు రాజీవ్ మసంద్, అనుపమ చోప్రా సుశాంత్ చిత్రాల పట్ల క్రూరంగా వ్యవహరించారని చేతన్ భగత్ ఆరోపించారు. (‘సుశాంత్‌ను అందుకే తొలగించారా!’)
Ma'am, when your husband publicly bullied me, shamelessly collected all the best story awards, tried denying me credit for my story and drove me close to suicide, and you just watched, where was your discourse? https://t.co/CeVDT2oq47
— Chetan Bhagat (@chetan_bhagat) July 21, 2020
ఈ క్రమంలో అనుపమ చోప్రా, చేతన్ భగత్ ట్వీట్‌పై స్పందించారు. ‘విశ్లేషణ తక్కువగా ఉందని మీరు భావించిన ప్రతిసారి ఇదే జరుగుతుంది’ అని స్పందించారు. దీనికి చేతన్ భగత్ ‘మేడమ్.. మీ భర్త నన్ను బహిరంగంగా తిట్టారు. బెస్ట్ స్టోరి అవార్డులను సిగ్గులేకుండా తీసుకున్నారు. నా కథకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. పైగా ఆయన ప్రవర్తనతో నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించారు. మీరు వీటన్నింటిని చూస్తూ ఉన్నారు. మరి మీ విశ్లేషణ ఏది’ అంటూ ప్రశ్నించారు.
చేతన్ భగత్ రాసిన ‘ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ నవల ఆధారంగా ‘3 ఇడియట్స్’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే విడుదల సమయంలోనే దీనిపై వివాదం మొదలయ్యింది. ఈ చిత్ర నిర్మాత విధు వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ నవల హక్కులను కొనుగోలు చేశారు. అయితే చిత్రం ప్రారంభంలో ‘చేతన్ భగత్ ‘ఫైవ్‌పాయింట్ సమ్‌వన్’ ఆధారంగా’ అని వేశారు. కానీ టైటిల్స్‌లో కథ, స్క్రీన్‌ప్లే అభిజాత్ జోషి అని వేశారు. అంతేకాక ఐఫా, ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్లలో ఉత్తమ కథ బహుమతిని హిరానీ, జోషి అందుకున్నారు. దీనిపై గతంలోనే చేతన్ భగత్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Each time you think the discourse can’t get lower, it does! https://t.co/yhkBUd8VSQ
— Anupama Chopra (@anupamachopra) July 21, 2020