అన్వేషి మూవీ రివ్యూ
టైటిల్: అన్వేషి
నటీనటులు: అనన్య నాగళ్ల, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అజయ్ ఘోష్ తదితరులు
నిర్మాత: గణపతి రెడ్డి
దర్శకుడు : వీజే ఖన్నా
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: కెకె రావు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
విడుదల తేది: నవంబర్ 17, 2023
అన్వేషి కథేంటంటే..
విక్రమ్(విజయ్‌ధరణ్ దాట్ల).. అను(సిమ్రాన్ గుప్తా)తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను వెతుక్కుంటూ మారేడుకోన అనే గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అవన్నీ మూతపడిపోయిన అను ఆస్పత్రి ఎదుటే జరుగడంతో..చనిపోయిన డాక్టర్ అను(అనన్య నాగళ్ల)నే ఊరి జనాలను చంపుతుందని గ్రామస్తులంతా నమ్ముతారు.
ఆ మిస్టరీని కనిపెట్టేందుకు వచ్చిన ప్రముఖ డిటెక్టివ్ ప్రకాశ్ జాదవ్ కూడా అనూహ్యంగా ఆ ఆస్పత్రి ఎదుటే హత్యకు గురవుతాడు. దీంతో ఆ రహస్యాన్ని కనిపెట్టేందుకు విక్రమ్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? ఆ హత్యల వెనుక ఉన్నదెవరు? అను ఆస్పత్రి ఎందుకు మూతపడింది? డాక్టర్ అనుకి ఏమైంది? రాజకీయ నాయకుడు, ప్రైవేట్ ఆస్పత్రి యజమాని పెద్దిరెడ్డి(అజయ్ ఘోష్)తో ఈ హత్యలకు సంబంధం ఉందా? లేదా? మర్డర్ మిస్టరీని విక్రమ్ ఎలా ఛేదించాడు? అనేది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
ఊరిలో వరుస హత్యలు.. దానికి కారణం ఒకటని అంతా నమ్మితే.. హీరో మాత్రం మరేదో ఉందని అనుమానిస్తాడు. దాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తాడు.. చివరకు అసలు కారణాన్ని బయటపెడతాడు. దాదాపు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథలన్నీ ఇలానే సాగుతాయి. అయితే హీరో ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడనే దానిపైనే సినిమా ఫలితం ఆధారపడుతుంది. వరుస ట్విస్టులతో..క్లైమాక్స్ వరకు థ్రిల్లింగ్‌గా కథనం సాగితే.. ఆ మూవీ విజయం సాధిస్తుంది. ఇక అన్వేషి విషయానికొస్తే.. సస్పెన్స్‌ని చివరకు మెయిన్టైన్ చేస్తూ.. ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే భయపెట్టే సన్నివేశాలు తక్కువగానే ఉన్నాయి.
ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌స్టోరీ రొటీన్‌గా ఉంటుంది. పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. హీరో ఎప్పుడైతే మారేడుకోన గ్రామానికి వెళ్తాడో అప్పటి నుంచి కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. హత్యల వెనుక రహస్యాన్ని ఛేదించే క్రమంలో వచ్చే సన్నివేశాలు..ప్రతి పాత్రపై అనుమానం కలిగించేలా చేస్తాయి. సెకండాఫ్‌లో డాక్టర్ అను ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
విక్రమ్‌గా విజయ్‌ధరణ్ దాట్ల చక్కగా నటించాడు. ఇక ఎస్సై కూతురు, విక్రమ్ ప్రియురాలు అనుగా సిమ్రాన్ గుప్తా తన పాత్ర పరిధిమేర నటించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల..డాక్టర్ అను పాత్రలో చక్కగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. రాజకీయ నాయకుడు, ప్రైవేట్ ఆస్పత్రి యజమాని పెద్దిరెడ్డి పాత్రకు అజయ్ ఘోష్ న్యాయం చేశాడు. ఈ తరహా పాత్రల్లో నటించడం అజయ్ ఘోష్‌కి కొత్తేమి కాదు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సాగదీత సీన్లను కట్ చేసి సినిమా నిడివి తగ్గించి ఉంటే బాగుండేదేమో. నిర్మాత గణపతి రెడ్డి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది.