apathy
-
ముక్కు ఆపరేషన్ కోసం వెడితే దారుణం
వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఘటన.ముక్కు ఆపరేషన్‌కోసం ఆసుపత్రిలో చేరిన బాలుడికి హెర్నియా ఆపరేషన్ నిర్వహించిన ఘటన కలకలం రేపింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హెర్నియా ఆపరేషన్ కోసం ధనుష్ మరో రోగి ఇదే ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ఇద్దరు రోగుల మధ్య కన్ఫ్యూజన్కు లోనైన వైద్యులు..ఒకటికి నాలుగు సార్లు ధృవీకరించుకోవాల్సింది పోయి.. వెనకా ముందు చూడకుండా బాలుడికి శస్త్ర చికిత్స పూర్తి చేశారు. దీంతో ముక్కు ప్రాంతంలో (నాసిల్ ఫాలిప్స్)సర్జరీ జరగాల్సిన తమ కుమారుడు మహ్మమద్ డానిష్ (7) పొట్టపై కుట్లు ఉండటం చూసి తల్లితండ్రులు షాక్ అయ్యారు. దీంతో ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు బాధపడకూడదని అని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి కె.కె.శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు ఈ కేసులో బాధ్యతా రాహిత్యంగా వ్యవరించిన డాక్టర్ ఎ సురేష్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. బాధిత బాలుడికి ఉచిత చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. -
కాపాడండయ్యా!.. కనికరం చూపని ఖాకీలు
సహరన్పూర్ : రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రెండు ప్రాణాలు.. తమను కాపాడాలంటూ వేడుకోలు... స్థానికులు కూడా బతిమిలాడారు. అయినా కనికారం చూపని ఖాకీలు. సాయం కోరితే దారుణమైన సమాధానాలు ఇచ్చారు. వెరసి వారి ఉదాసీనత మూలంగా కళ్ల ముందే ఆ యువకులు ప్రాణాలు కోల్పోయారు. యూపీలో ఈ హేయనీయమైన ఘటన చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి సహరన్‌పూర్‌లో అర్పిత్ ఖాన్, సన్నీ అనే ఇద్దరు యువకులు మోటర్ బైక్‌పై వెళ్తుండగా యాక్సిడెంట్‌కి గురయ్యారు. అర్ధరాత్రి కావటంతో జన సందోహం పెద్దగా లేదు. అటుగా వెళ్తున్న కొందరు యువకులు అది గమనించి 100 కి డయల్ చేశారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ వాహనం అక్కడికి వచ్చింది. కానీ, వారిని వాహనంలోకి ఎక్కించుకునేందుకు అందులో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు నిరాకరించారు. ‘‘వారిని వాహనంలోకి ఎక్కిస్తే సీట్లకు రక్తపు మరకలు అంటుకుంటాయి’’ ... ఇది ఆ కానిస్టేబుళ్లు ఇచ్చిన సమాధానం. దీంతో కంగుతిన్న స్థానికులు అటుగా వెళ్తున మరికొన్ని వాహనాలను ఆపేందుకు యత్నించారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో ఓ వ్యక్తి ‘‘ ఏ తల్లి కన్న పిల్లలో... కాపాడండి. అవసరమైతే ఆ రక్తపు మరకలను నేను శుభ్రచేస్తా.. సాయం పట్టండి అని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కారు కడిగితే.. రాత్రంతా తాము ఎక్కడ పడుకోవాలని? వారు సమాధానం ఇవ్వటంతో మళ్లీ అవాక్కవ్వటం ప్రజల వంతు అయ్యింది. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కూడా ఆ ఇద్దరు యువకులు తమను కాపాడంటూ అక్కడున్నవారిని వేడుకోవటం కదిలించి వేసింది. ఇంతలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి మరో వాహనం అక్కడికి చేరుకుంది. కానీ, అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. యువకులను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. తీవ్ర రక్తస్రావంతో అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్పందించిన ఉన్నతాధికారులు... పోలీసులు సాయానికి నిరాకరించిన ఎపిసోడ్ అంతా ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వదలటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం అన్ని మీడియా ఛానెళ్లలో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో సహరన్పూర్ పోలీస్ ఉన్నతాధికారి ప్రబల్ ప్రతాప్ సింగ్ ఘటనపై స్పందించారు. ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌చేసినట్లు ఆయన వెల్లడించారు. ఘటనపై పూర్తి దర్యాప్తు తర్వాత వారిపై మరిన్ని చర్యలు ఉంటాయని ప్రకటించారు. "Don't want blood stains in car": 2 teens die as UP cops refuse help Read more here: https://t.co/qkcaRJtwkj pic.twitter.com/M3LuZnYnqd — NDTV (@ndtv) 20 January 2018 -
కష్టాలు గట్టెక్కని గట్టయ్య
హైదరాబాద్ : పొడగరి పొలిపాక గట్టయ్యను కష్టాలు చుట్టుముట్టాయి. ఏడు అడుగుల ఆరు అంగుళాల ఎత్తుతో.. యావత్ దేశాన్ని బాప్రే అనిపించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కినగట్టయ్య ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. శిల్పారామంలో కాంట్రాక్ట్ పద్దతిన తొమ్మిదేళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గట్టయ్య కుడికాలుకు సెప్టిక్ కావటంతో ఇటీవలే దాన్ని పాదం వరకు తొలగించారు. దీంతో ఆయన కృత్రిమ పాదాన్ని పెట్టుకుని గంటల తరబడి నిలబడి శిల్పారామంలో వచ్చిపోయే వారిని పలకరిస్తూ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అయితే కుడికాలుకు సెప్టిక్ అయి కాలు తొలగించే క్రమంలో చేతిలో చిల్లిగవ్వ లేకపోవటంతో కరీంనగర్ జిల్లాలో ఉన్న తన ప్లాట్‌ను అమ్మి వైద్యమైతే చేయించుకున్నారు గాని నెలనెలా మందుల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్నారు. మందులు కొనుక్కోవడానికి అతనికి వచ్చే జీతం రూ.8000 ఎటూ సరిపోని పరిస్థితి. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గట్టయ్య శిల్పారామంలో ఉద్యోగంతో పాటు వికలాంగుల కోటా కింద బస్‌పాస్ మంజూరు చేయించారు. అయితే ఇటీవల బస్‌పాస్ గడువు ముగియగా, రెన్యువల్‌కు అధికారులు నిరాకరించారు. ఇటీవలే సొంతూళ్లో తల్లికి కాలు విరిగి మంచాన పడిందని, అప్పుడప్పుడు ఊరికి వెళ్లివచ్చే వాడినని, ప్రస్తుతం బస్‌పాస్ రెన్యువల్ కాకపోవటంతో తల్లిని చూసేందుకు కూడా వీలుపడటం లేదని గట్టయ్య ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శిల్పారామరంలో అధికారులందరూ తననెంతో అప్యాయంగా చూసుకుంటున్నప్పటికీ భవిష్యత్తు గురించి తలచుకుంటే.. భయం వేస్తుందన్నారు. తన ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తే, తానంటే ఇష్టపడే అమ్మాయి దొరికితే ఓ ఇంటివాడిని కావాలనుకుంటున్నట్లు గట్టయ్య మనసులో మాటను వెలిబుచ్చారు.