సహరన్‌పూర్ : రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రెండు ప్రాణాలు.. తమను కాపాడాలంటూ వేడుకోలు... స్థానికులు కూడా బతిమిలాడారు. అయినా కనికారం చూపని ఖాకీలు. సాయం కోరితే దారుణమైన సమాధానాలు ఇచ్చారు. వెరసి వారి ఉదాసీనత మూలంగా కళ్ల ముందే ఆ యువకులు ప్రాణాలు కోల్పోయారు. యూపీలో ఈ హేయనీయమైన ఘటన చోటు చేసుకుంది.
గురువారం అర్ధరాత్రి సహరన్‌పూర్‌లో అర్పిత్ ఖాన్, సన్నీ అనే ఇద్దరు యువకులు మోటర్ బైక్‌పై వెళ్తుండగా యాక్సిడెంట్‌కి గురయ్యారు. అర్ధరాత్రి కావటంతో జన సందోహం పెద్దగా లేదు. అటుగా వెళ్తున్న కొందరు యువకులు అది గమనించి 100 కి డయల్ చేశారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ వాహనం అక్కడికి వచ్చింది. కానీ, వారిని వాహనంలోకి ఎక్కించుకునేందుకు అందులో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు నిరాకరించారు. ‘‘వారిని వాహనంలోకి ఎక్కిస్తే సీట్లకు రక్తపు మరకలు అంటుకుంటాయి’’ ... ఇది ఆ కానిస్టేబుళ్లు ఇచ్చిన సమాధానం.
దీంతో కంగుతిన్న స్థానికులు అటుగా వెళ్తున మరికొన్ని వాహనాలను ఆపేందుకు యత్నించారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో ఓ వ్యక్తి ‘‘ ఏ తల్లి కన్న పిల్లలో... కాపాడండి. అవసరమైతే ఆ రక్తపు మరకలను నేను శుభ్రచేస్తా.. సాయం పట్టండి అని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కారు కడిగితే.. రాత్రంతా తాము ఎక్కడ పడుకోవాలని? వారు సమాధానం ఇవ్వటంతో మళ్లీ అవాక్కవ్వటం ప్రజల వంతు అయ్యింది. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కూడా ఆ ఇద్దరు యువకులు తమను కాపాడంటూ అక్కడున్నవారిని వేడుకోవటం కదిలించి వేసింది.
ఇంతలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి మరో వాహనం అక్కడికి చేరుకుంది. కానీ, అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. యువకులను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. తీవ్ర రక్తస్రావంతో అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
స్పందించిన ఉన్నతాధికారులు...
పోలీసులు సాయానికి నిరాకరించిన ఎపిసోడ్ అంతా ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వదలటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం అన్ని మీడియా ఛానెళ్లలో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో సహరన్‌పూర్ పోలీస్ ఉన్నతాధికారి ప్రబల్ ప్రతాప్ సింగ్ ఘటనపై స్పందించారు.
ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌చేసినట్లు ఆయన వెల్లడించారు. ఘటనపై పూర్తి దర్యాప్తు తర్వాత వారిపై మరిన్ని చర్యలు ఉంటాయని ప్రకటించారు.
"Don't want blood stains in car": 2 teens die as UP cops refuse help
— NDTV (@ndtv) 20 January 2018
Read more here: https://t.co/qkcaRJtwkj pic.twitter.com/M3LuZnYnqd
Comments
Please login to add a commentAdd a comment